విద్యా ప్రమాణాలు పెంచండి
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాప్రమాణాలు పెంచడానికి అనువుగా మౌలిక సదుపాయాలు కల్పించాలని కలెక్టర్ ఎన్.శ్రీధర్ అధికారులను ఆదేశించారు. ప్రాథమిక స్థాయిలోనే విద్యార్థులకు మెరుగైన విద్యనందించడం ద్వారా ఉన్నతస్థాయిలో మంచి ఫలితాలు సాధ్యపడతాయన్నారు. శుక్రవారం తన ఛాంబర్‌లో విద్యాశాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. 10వ తరగతి ఫలితాల్లో మెరుగైన ఉత్తీర్ణతాశాతం సాధించేందుకు ఇప్పటినుంచే ప్రణాళిక తయారు చేయాలని పేర్కొన్నారు. ప్రతి పాఠశాలలో కనీస సౌకర్యాలు కల్పించాలని, మంచినీరు, శౌచాలయాలను ఏర్పాటు చేయాలన్నారు.
కస్తూర్బా పాఠశాల భవనాలు, మోడల్ పాఠశాల భవన నిర్మాణాలు వెంటనే పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అసంపూర్తి పనులపై సమగ్ర నివేదిక అందజేయాలని సూచించారు. సమావేశంలో డీఈఓ సోమిరెడ్డి, ఆర్‌వీఎం పీఓ కిషన్‌రావు, ఆర్‌డబ్ల్యూఎస్ ఈఈ వెంకటరమణ, వయోజన విద్య ఉపసంచాలకులు నారాయణరెడ్డి పాల్గొన్నారు.