కొత్త కలెక్టర్ ఎన్.శ్రీధర్
ప్రభుత్వ భూముల పరిరక్షణకు పెద్దపీట వేస్తా. జిల్లాను పెట్టుబడులకు అనువైన కేంద్రంగా మలుస్తా. పట్టణ, గ్రామీణ ప్రాంతాల మధ్య ఉన్న అభివృద్ధి అంతరాలను రూపుమాపుతా. జిల్లాను హార్టికల్చర్ హాబ్‌గా మార్చడం, విద్యాప్రమాణాలు పెంపొందించడం నా ముందున్న ప్రథమ ప్రాధాన్యాలు.
- కలెక్టర్ ఎన్.శ్రీధర్
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: జిల్లా పాలనలో మంగళవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. కొత్త కలెక్టర్‌గా నియమితులైన నడిమట్ల శ్రీధర్ తనకు ఉత్తర్వులు అందిన అరగంట వ్యవధిలోనే బాధ్యతలు స్వీకరించడం సర్వత్రా చర్చనీయాంశమైంది. సాధారణంగా ఇటువంటి కీలక పోస్టులో చేరే అధికారులు ఒకట్రెండు రోజులు సమయం తీసుకోవడం ఆనవాయితీ. రెవెన్యూపరంగా ముఖ్యమైన జిల్లా కావడంతో తక్షణమే విధుల్లో చేరాలని ప్రభుత్వం ఆదేశించింది.
ఈ నేపథ్యంలో ఉత్తర్వులు అందుకున్నదే తడువు ఎన్ .శ్రీధర్ కలెక్టర్ సీట్లో వాలిపోయారు. కాగా, బదిలీ అయిన బి.శ్రీధర్‌కు ప్రభుత్వం ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు. ఆయనను ఏపీ రాష్ట్ర కేడర్‌కు పంపే అవకాశముంది. రాష్ట్ర విభజన అనంతరం శ్రీధర్ బదిలీ అనివార్యమని తెలిసినప్పటికీ, అఖిల భారత సర్వీసు అధికారుల కేటాయింపుపై కేంద్రం ఇంకా మార్గదర్శకాలు జారీ చేయలేదు. ఈ నేపథ్యంలో కలెక్టర్లు, జేసీలు, ఎస్పీలకు స్థానచలనం కల్పించకూడదని ఇరురాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. అయితే, ఐఏఎస్ వర్గాలు హాట్‌సీటుగా భావించే రంగారెడ్డి జిల్లా కలెక్టర్ పోస్టుపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర కసరత్తు చేసింది.
వివిధ మార్గాల్లో ఒత్తిళ్లు వచ్చినప్పటికీ, సమర్థుడు, సీనియర్ అధికారిగా పేరున్న ఎన్.శ్రీధర్ ైవె పు మొగ్గు చూపింది. ఈ క్రమంలోనే మంగళవారం ఉదయం ఉత్తర్వులు జారీచేసిన సీఎస్ రాజీవ్‌శర్మ తక్షణమే విధుల్లో చేరాలని ఆదేశించారు. దీంతో వడివడిగా కలెక్టరేట్‌కు వచ్చిన ఆయనకు బాధ్యతలు అప్పగించిన బి.శ్రీధర్ విధుల నుంచి రిలీవ్ అయ్యారు. గత ఏడాది జూలై 2న జిల్లా కలెక్టర్‌గా నియమితులైన శ్రీధర్ సమర్థవంతంగా పనిచేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు సహా సాధారణ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించడం ద్వారా ప్రశంసలందుకున్నారు.