B. sridhar
-
విద్యుత్ కోతల్లేవు.. ‘ప్రైవేటు’ కుట్రల్లేవు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎటువంటి విద్యుత్ కోతలు లేవని ఇంధన శాఖ కార్యదర్శి బి. శ్రీధర్ స్పష్టంచేశారు. పల్లెల్లో కోతలంటూ జరుగుతున్న ప్రచారం పచ్చి అబద్ధమని చెప్పారు. 4వ తేదీన మాత్రమే డిమాండ్ ఎక్కువగా ఉండటంతో గ్రిడ్ భద్రత దృష్ట్యా కేవలం కొన్ని గంటలు లోడ్ రిలీఫ్ విధించాల్సి వచ్చిందని తెలిపారు. కృష్ణపట్నంలోని శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ స్టేషన్లో బూడిదను బయటికి పంపడంలో ఏర్పడ్డ సాంకేతిక సమస్యపై విచారణకు ఆదేశించామని చెప్పారు. ఈ ప్లాంటును ప్రైవేటీకరించడానికే హాఫర్స్‌ను కూల్చారన్నది అవాస్తవమని వివరించారు. ఈ ప్లాంట్‌ను ఆదానీకి అప్పగిస్తారన్న ప్రచారంలో వాస్తవం లేదని చెప్పారు. శ్రీధర్ సోమవారం ‘సాక్షి’తో మాట్లాడుతూ ఏమన్నారంటే.. ఈ ఏడాది మార్చి, ఏప్రిల్, మే నెలల్లో ఎండలు తీవ్రంగా ఉండి, డిమాండ్ ఎక్కువ ఉన్నప్పటికీ అతి తక్కువ కోతలతో విద్యుత్ సరఫరా చేశాం. ఏప్రిల్ 15 నుంచి పరిశ్రమలకు పవర్ హాలిడే కూడా ఎత్తేశాం. ఆ తరువాత రోజుకి 180 నుంచి 190 మిలియన్ యూనిట్ల డిమాండ్ ఉండేది. ఉష్ణోగ్రతలు పెరిగి, గృహ విద్యుత్ వినియోగం ఎక్కువగా ఉండటంతో నాలుగు రోజులుగా డిమాండ్ అనూహ్యంగా 225 ఎంయూకు పైగా ఉంది. ఈ నెల 4న 224 ఎంయూ డిమాండ్ ఉంది. అయినా అంతమేరకు విద్యుత్ సరఫరా చేశాం. అయితే పవన విద్యుత్ 800 మెగావాట్లు పడిపోయింది. బయటి మార్కెట్లో దొరకలేదు. ఫలితంగా సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల మధ్య పీక్ అవర్స్‌లో 4.6 ఎంయూ లోటు ఏర్పడింది. అప్పటికే సెంట్రల్ గ్రిడ్ నుంచి అదనంగా విద్యుత్ తీసుకున్నాం. ఇంకా తీసుకుంటే గ్రిడ్ కూలిపోతుంది. దీంతో 2 నుంచి 3 గంటలు ఎమర్జెన్సీ లోడ్ రిలీఫ్ (ఈఎల్ఆర్) అమలు చేయాల్సి వచ్చింది. అంతేతప్ప అది విద్యుత్ కోత కాదు. విదేశీ బొగ్గుతో నడిచే కృష్ణపట్నం ప్లాంట్‌కు టన్ను రూ.24 వేలు చొప్పున 18 లక్షల టన్నులను అదానీ సంస్థ సరఫరా చేస్తుంది. స్వదేశీ బొగ్గుతో విద్యుత్ ఉత్పత్తి చేసే డాక్టర్ నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్ (ఎన్టీటీపీసీ), రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ (ఆర్టీపీపీ)లకు 13 లక్షల బొగ్గును టన్ను రూ.19,500కు చెట్టినాడు సంస్థ సమకూరుస్తుంది. ఈ రెండు టెండర్లను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అనుమతితో ఖరారు చేశాం. జూలై మొదటి వారం నుంచి బొగ్గు సరఫరా మొదలవుతుంది. మన దగ్గర విద్యుత్ ఉన్నప్పుడు ఇతర రాష్ట్రాలకు ఇచ్చి, వారి దగ్గర ఉన్నప్పుడు తీసుకునే ఏర్పాటు చేస్తున్నాం. అవసరమైనప్పుడు కొనేలా షార్ట్‌టర్మ్ టెండర్లు పిలుస్తున్నాం. కృష్ణపట్నం ప్లాంటుకు క్వాలిటీ బొగ్గు కావాలి. దీని నుంచి వచ్చే ఫ్లైయాష్‌ను సిమెంటు కంపెనీలు తీసుకోవడంలేదు. రెండేళ్లుగా పెన్నా సిమెంట్ మాత్రమే 40శాతం తీసుకుంటోంది. స్థానికంగా వాడేది 10శాతం. మిగిలిన 50శాతాన్ని యాష్‌పాండ్‌లోకి పంపుతుంటారు. పైపు నుంచి బూడిద వెళుతున్నప్పుడు దానిలోని ఎలక్ట్రోడ్స్ను ఎలక్ట్రోస్టాటిక్ ప్రెసిపిటేటర్ (ఈఎస్పీ) సేకరించి కిందకు పంపుతుంది. ఎక్కువ బూడిద రావడంతో ప్లేట్స్ (హాఫర్స్) కింద పడిపోయాయి. దీంతో ప్లాంటును నిలిపివేయాల్సి వచ్చింది. దీనిపై డైరెక్టర్, చీఫ్ ఇంజనీర్, ఎస్ఈ బృందంతో విచారణ చేయిస్తున్నాం. ఇది సాంకేతిక సమస్యే తప్ప ఎలాంటి కుట్రా లేదు. కృష్ణపట్నం ప్లాంటును ప్రైవేటీకరించం. ప్లాంట్ నిర్వహణకు మనకు పడుతున్న కాస్ట్కంటే తక్కువకు ఎవరైనా ఇస్తామంటే పారదర్శక టెండర్ల ద్వారా ఓ అండ్ ఎం విధానంలో అప్పగిస్తాం. దీనివల్ల యూనిట్ రేటు తగ్గి వినియోగదారులకే మేలు జరుగుతుంది. ఎస్బీఐ కాప్స్ బిడ్ డాక్యుమెంట్ తయారు చేసి టెండర్ల ప్రక్రియకు సహకరించేందుకు ఈరోజే ఆదేశాలిచ్చాం. ప్లాంటులో ఉద్యోగులంతా ఏపీ జెన్కో నుంచి డిప్యుటేషన్‌పై వెళ్లినవారే. వారు అభద్రతకు గురి కావద్దు. -
కొత్త కలెక్టర్ ఎన్.శ్రీధర్
ప్రభుత్వ భూముల పరిరక్షణకు పెద్దపీట వేస్తా. జిల్లాను పెట్టుబడులకు అనువైన కేంద్రంగా మలుస్తా. పట్టణ, గ్రామీణ ప్రాంతాల మధ్య ఉన్న అభివృద్ధి అంతరాలను రూపుమాపుతా. జిల్లాను హార్టికల్చర్ హాబ్‌గా మార్చడం, విద్యాప్రమాణాలు పెంపొందించడం నా ముందున్న ప్రథమ ప్రాధాన్యాలు. - కలెక్టర్ ఎన్.శ్రీధర్ సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: జిల్లా పాలనలో మంగళవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. కొత్త కలెక్టర్‌గా నియమితులైన నడిమట్ల శ్రీధర్ తనకు ఉత్తర్వులు అందిన అరగంట వ్యవధిలోనే బాధ్యతలు స్వీకరించడం సర్వత్రా చర్చనీయాంశమైంది. సాధారణంగా ఇటువంటి కీలక పోస్టులో చేరే అధికారులు ఒకట్రెండు రోజులు సమయం తీసుకోవడం ఆనవాయితీ. రెవెన్యూపరంగా ముఖ్యమైన జిల్లా కావడంతో తక్షణమే విధుల్లో చేరాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఉత్తర్వులు అందుకున్నదే తడువు ఎన్ .శ్రీధర్ కలెక్టర్ సీట్లో వాలిపోయారు. కాగా, బదిలీ అయిన బి.శ్రీధర్‌కు ప్రభుత్వం ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు. ఆయనను ఏపీ రాష్ట్ర కేడర్‌కు పంపే అవకాశముంది. రాష్ట్ర విభజన అనంతరం శ్రీధర్ బదిలీ అనివార్యమని తెలిసినప్పటికీ, అఖిల భారత సర్వీసు అధికారుల కేటాయింపుపై కేంద్రం ఇంకా మార్గదర్శకాలు జారీ చేయలేదు. ఈ నేపథ్యంలో కలెక్టర్లు, జేసీలు, ఎస్పీలకు స్థానచలనం కల్పించకూడదని ఇరురాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. అయితే, ఐఏఎస్ వర్గాలు హాట్‌సీటుగా భావించే రంగారెడ్డి జిల్లా కలెక్టర్ పోస్టుపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర కసరత్తు చేసింది. వివిధ మార్గాల్లో ఒత్తిళ్లు వచ్చినప్పటికీ, సమర్థుడు, సీనియర్ అధికారిగా పేరున్న ఎన్.శ్రీధర్ ైవె పు మొగ్గు చూపింది. ఈ క్రమంలోనే మంగళవారం ఉదయం ఉత్తర్వులు జారీచేసిన సీఎస్ రాజీవ్‌శర్మ తక్షణమే విధుల్లో చేరాలని ఆదేశించారు. దీంతో వడివడిగా కలెక్టరేట్‌కు వచ్చిన ఆయనకు బాధ్యతలు అప్పగించిన బి.శ్రీధర్ విధుల నుంచి రిలీవ్ అయ్యారు. గత ఏడాది జూలై 2న జిల్లా కలెక్టర్‌గా నియమితులైన శ్రీధర్ సమర్థవంతంగా పనిచేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు సహా సాధారణ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించడం ద్వారా ప్రశంసలందుకున్నారు. -
అన్నదాతకు భరోసా ఇవ్వండి
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఖరీఫ్ పనులు ప్రారంభమవుతున్నందున జిల్లాకు సరిపడా ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచాలని, అధికారులంతా అన్నదాతకు అండగా నిలబడి సాగు సక్రమంగా సాగేలా పటిష్ట చర్యలు తీసుకోవాలని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం మంత్రి సచివాలయంలోని తన చాంబర్లో జిల్లా వ్యవసాయశాఖపై సమీక్షించారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించి కార్యాచరణపై అధికారులతో చర్చించారు. ఈ సీజన్లో మొక్కజొన్న, కంది, పత్తి, వరి పంటలు ఎక్కువగా సాగయ్యే అవకాశం ఉన్నందున అవసరానికి సరిపడా విత్తనాలు సిద్ధంగా ఉంచాలన్నారు. నకిలీ విత్తనాలతో గతంలో చాలా నష్టం జరిగిందని, ఈసారి అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా అంతటా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి ఈ వ్యవహారాన్ని కట్టడి చేయాలన్నారు. నకిలీ విత్తనాలు విక్రయించినట్లు గుర్తిస్తే సదరు డీలరుపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. రైతులకు యూరియా, డీఏపీ తదితర ఎరువులను సకాలంలో అందించాలన్నారు. జిల్లాలో ఖరీఫ్ సీజన్లో రూ.442 కోట్ల పంటరుణాలు ఇచ్చేలా లక్ష్యాన్ని నిర్దేశించామని, ఈమేరకు అర్హులైన రైతులకు తప్పకుండా రుణాలు ఇవ్వాలని మంత్రి బ్యాంకర్లను ఆదేశించారు. నగరం చుట్టూ జిల్లా విస్తరించి ఉన్నందున హార్టికల్చర్ జోన్ ఏర్పాటుకు ప్రత్యేక ప్రణాళిక తయారు చేయాలని ఉద్యానశాఖ అధికారులను ఆదేశించారు. రైతులు సరుకులు దాచుకునేందుకు గిడ్డంగులు నిర్మించాల్సిన అవసరం ఉందని, ఇందుకోసం ప్రణాళికను తయారు చేయాలని మార్కెటింగ్ శాఖ అధికారులకు సూచించారు. కలెక్టర్ బి.శ్రీధర్ మాట్లాడుతూ ప్రస్తుత ఖరీఫ్‌లో జిల్లాలో 2లక్షల హెక్టార్లలో పంటలు సాగయ్యే అవకాశం ఉందని, ఈమేరకు విత్తనాలు, ఎరువులను సిద్ధం చేశామని చెప్పారు. పత్తి పంట ఎక్కువ విస్తీర్ణంలో సాగవనుందని, దీంతో 30 రకాల కంపెనీలకు చెందిన 3 లక్షల విత్తన ప్యాకెట్లు ఇప్పటికే డీలర్లకు పంపిణీ చేశామన్నారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు విజయ్‌కుమార్, ఉద్యానశాఖ ఏడీ ఉమాదేవి తదితరులు పాల్గొన్నారు. -
ముగిసిన బది‘లీలలు’
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: తహసీల్దార్ల బదిలీల ప్రక్రియ ఎట్టకేలకు ముగిసింది. రెండు రోజులుగా సాగిన బదిలీల కసరత్తు బుధవారం సాయంత్రానికి పూర్తయింది. కొత్త ప్రభుత్వం పాలనా యంత్రాంగంపై దృష్టి సారించిన నేపథ్యంలో.. ముందుగా రెవెన్యూ యంత్రాంగం ప్రక్షాళనకు సర్కారు ఉపక్రమిం చింది. ఇందులో భాగంగా జిల్లా/ రెవెన్యూ స్థాయి రెవెన్యూ అధికారుల పోస్టింగ్‌ల ప్రక్రియ మంగళవారం ముగిసింది. ఉద్యోగ సంఘాలు, రాజకీయ ఒత్తిళ్ల కారణంగా గ్రామీణ మండలాల తహసీల్దార్ల బదిలీలపై ఎలాంటి నిర్ణయానికి రాలేక పోయింది. ఈ నేపథ్యంలో బదిలీల జాబితాపై మల్లగుల్లాలు పడిన కలెక్టర్ బి.శ్రీధర్ బుధవారం సాయంత్రం జిల్లా వ్యాప్తంగా 30 మంది తహసీల్దార్లకు స్థానచలనం కలిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మరో ఇద్దరిని కలెక్టరేట్లో రిపోర్టింగ్ చేయాలని ఆదేశించారు. పైరవీలకు పెద్దపీట! ప్రభుత్వ పెద్దల సిఫార్సులతో తహసీల్దార్ల పోస్టింగ్‌ల వ్యవహారంలో నానాయాగీ జరిగింది. తమ కనుసన్నల్లో మెలిగే అధికారులకు కోరుకున్న మండలాల్లో పోస్టింగ్‌లు ఇప్పించేందుకు ప్రజాప్రతినిధులు రంగంలోకి దిగడంతో బదిలీల పర్వంలో పైరవీకారులదే పైచేయి అయింది. సమర్థత, పనితీరు ప్రాతిపదికన పోస్టింగ్‌లు ఇవ్వాలని భావించిన జిల్లా యంత్రాంగం ఆశలపై రాజకీయ ఒత్తిళ్లు తీవ్ర ప్రభావం చూపాయి. ఈ క్రమంలోనే నాలుగైదు సార్లు బదిలీల జాబితాలో మార్పులు చేర్పులు చోటుచేసుకున్నాయి. పోస్టింగ్‌లపై అన్ని వైపుల నుంచి ఒత్తిళ్లు తీవ్రతరం కావడంతో మంగళవారం రూపొ ందించిన జాబితాను పక్కనపెట్టిన యంత్రాంగం.. బుధవారం మరో జాబి తాను తయారు చేసింది. జాబితాలో పలు మార్పులు, చేర్పులుచేసి ఎట్టకేలకు బుధవారం సాయంత్రం బదిలీల పర్వానికి ముగింపు పలికింది. ఇదిలావుండగా, పది మంది తహసీల్దార్లను బదిలీచేస్తూ కలెక్టర్ తొలి జాబితాను విడుదల చేశారు. బదిలీ ఉత్తర్వులు అందుకున్నదే తడువు సదరు తహసీల్దార్లు నిర్దేశించిన మండలాల్లో బాధ్యతలు కూడా స్వీకరించడం గమనార్హం. తహసీల్దార్ పనిచేస్తున్న చోటు బదిలీ డి.శ్రీకాంత్‌రెడ్డి కందుకూరు మేడ్చల్ ఎస్.రాజేశ్వర్ నల్గొండ శామీర్‌పేట సీహెచ్ రవీందర్‌రెడ్డి హైదరాబాద్ కీసర కె.విష్ణువర్దన్‌రెడ్డి కలెక్టరేట్ ఘట్కేసర్ ఎస్.రాజేశ్‌కుమార్ కలెక్టరేట్ ఉప్పల్ ఎల్.రమాదేవి సెలవు మల్కాజిగిరి కె.రాజేందర్‌రెడ్డి హైదరాబాద్ చేవెళ్ల కె.అనంతరెడ్డి నిజామాబాద్ శంకర్పల్లి బి.వసంతకుమారి హైదరాబాద్ యాచారం కె.వెంకటరెడ్డి కేఆర్ఆర్సీ శంషాబాద్ కె.సుశీల బషీరాబాద్ కందుకూరు వి.లచ్చిరెడ్డి హైదరాబాద్ రిపోర్ట్ టు కలెక్టరేట్ ఎ.వెంకటేశ్వర్లు మంచాల గండేడ్ వెంకటేశ్వరరావు నిజామాబాద్ దోమ వి.వెంకట్‌రెడ్డి హైదరాబాద్ కుల్కచర్ల పి.సత్యనారాయణరాజు నల్గొండ షాబాద్ బి.యాదయ్య మహబూబ్‌నగర్ నవాబ్‌పేట కె.శ్రీనివాసులు పూడూరు బంట్వారం బి.రవీందర్ తాండూరు మోమిన్‌పేట ఎం.ప్రేమ్‌కుమార్ హైదరాబాద్ యాలాల కె.గోవింద్రావు డీఏఓ, వికారాబాద్ తాండూరు ఆర్.జనార్దన్ నల్గొండ డీఏఓ, వికారాబాద్ డి.దేవుజా హైదరాబాద్ పూడూరు వి.బాల్‌రాజ్ మెదక్ మంచాల ఎం.షర్మిల ఘట్కేసర్ కలెక్టరేట్(ఎఫ్అండ్జీ) ఎస్.రాజేశ్వరి కలెక్టరేట్ కేఆర్ఆర్సీ ఎస్.రవీందర్ మహబూబ్‌నగర్ కలెక్టరేట్ ఎన్.విజయలక్ష్మి చేవెళ్ల భూ పరిరక్షణ విభాగం పి.నర్సింహరావు హైదరాబాద్ రిపోర్ట్ టు కలెక్టరేట్ ఎం.శ్రీనివాసరావు హైదరాబాద్ ధారూరు ఎన్ఆర్.సరిత సెలవు ఐటీడీఏ, వికారాబాద్ భిక్షపతినాయక్ ఐటీడీఏ, వికారాబాద్ బషీరాబాద్ -
రెవెన్యూ యంత్రాంగం ప్రక్షాళన
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: కొత్త ప్రభుత్వం కొలువుదీరిన వెనువెంటనే జిల్లా రెవెన్యూ యంత్రాంగంలో సమూల ప్రక్షాళన జరిగింది. జిల్లా రెవెన్యూ అధికారి మొదలు రెండు డివిజన్ల ఆర్డీవోలు, పలువురు తహసీల్దార్లకు స్థానచలనం కలిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కీలకమైన శివారు మండలాల్లోని డిప్యూటీ కలెక్టర్ స్థాయి తహసీల్దార్లందరినీ బదిలీ చేసింది. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు పొరుగు జిల్లాలకు వెళ్లి తిరిగొచ్చిన తహసీల్దార్ల పోస్టింగ్‌లపై జిల్లా యంత్రాంగం మంగళవారం రాత్రి దాకా కసరత్తు చేసింది. సమర్థత, పనితీరును ప్రామాణికంగా తీసుకొని జిల్లా కలెక్టర్ బి. శ్రీధర్ బదిలీల జాబితా రూపొందించగా.. సచివాలయ స్థాయిలో లాబీయింగ్, రాజకీయ ఒత్తిళ్లతో జాబితా పూర్తిగా మారిపోయింది. తమ కనుసన్నల్లో మెలిగే అధికారులకు కీలక పోస్టింగ్‌లు ఇప్పించుకునేందుకు ప్రభుత్వ పెద్దలు ‘మంత్రాంగం’ నెరపడంతో బదిలీలు కొలిక్కిరాలేదు. ప్రభుత్వ స్థాయిలో జాబితాలో కొన్ని మార్పులు, చేర్పులు చేయాలని సూచనలు రావడంతో బదిలీలు బుధవారానికి వాయిదాపడ్డాయి. డీఆర్వో, ఇద్దరు ఆర్డీవోల బదిలీ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అధికారులకు ఉద్వాసన పలకాలని నిర్ణయించిన కేసీఆర్ సర్కారు.. తొలి రోజే జిల్లా రెవెన్యూ అధికారిపై బదిలీ వేటు వేసింది. రాయలసీమకు చెందిన ఎస్. వెంకటేశ్వర్లును బదిలీ చేస్తూ ఆయన స్థానంలో సుందర్ అబ్నార్‌ను నియమించింది. అలాగే ఎన్నికల ముందు జిల్లాకు వచ్చిన చేవెళ్ల, రాజేంద్రనగర్ ఆర్డీవోలకు కూడా స్థానభ్రంశం కలిగించింది. రాజేంద్రనగర్ ఆర్డీవోగా గతంలో జిల్లాలో పనిచేసిన సురేశ్ పొద్దార్‌ను నియమించింది. మరోవైపు శివార్లలోని కీలక మండలాల తహసీల్దార్లందరినీ సాగనంపింది. భూముల విలువలు ఆకాశాన్నంటడంతో హాట్ సీట్లుగా మారిన ఈ మండలాల్లో పోస్టింగ్ దక్కించుకునేందుకు అత్యున్నతస్థాయిలో పైరవీలు సాగుతాయి. ఈ క్రమంలోనే ఈ మండలాలపై కన్నేసిన పలువురు తమ పలుకుబడిని ఉపయోగించి పోస్టింగ్‌లు దక్కించుకున్నారు. జిల్లా న్యాయాధికారిగా పనిచేస్తున్న హరీశ్‌ను కూడా ప్రభుత్వం బదిలీ చేసింది. ఏపీకి చెందిన ఇతని స్థానంలో విక్టర్‌ను నియమించింది. అంతర్జాతీయ విమానాశ్రయం భూ సేకరణాధికారిగా పనిచేస్తున్న ఎంవీ భూపాల్‌రెడ్డికి హైదరాబాద్ జిల్లా న్యాయాధికారిగా పోస్టింగ్ ఇచ్చింది. 31 మంది తహసీల్దార్లకు స్థానచలనం ఇతర జిల్లాల్లో ఎన్నికల విధులు నిర్వర్తించి వెనక్కి వచ్చిన తహసీల్దార్ల పోస్టింగ్‌లపై జిల్లా యంత్రాంగం రోజంతా కుస్తీ పట్టి జాబితా తయారు చేసింది. ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా 31 మండలాల్లో కొత్త తహసీల్దార్ల నియామకానికి ఉత్తర్వులు కూడా సిద్ధం చేసింది. దీంట్లో శివారు మండలాల్లోని ఆరుగురు డిప్యూటీ కలెక్టర్ స్థాయి తహసీల్దార్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఈ నేపథ్యంలో గ్రామీణ మండల తహసీల్దార్ల బదిలీలకు సంబంధించి జిల్లా యంత్రాంగం జాబితాను తయారు చేసింది. అయితే, ఈ పోస్టింగ్‌లపై తీవ్ర రాద్ధాంతం నెలకొంది. ఉద్యోగసంఘాల ఒత్తిళ్లు, స్థానిక ప్రజాప్రతినిధుల సిఫార్సుల తాకిడి పెరిగిపోవడంతో జాబితా ఆసాంతం మారిపోయింది. పొరుగు జిల్లాల నుంచి మరికొందరు.. అన్నివైపుల నుంచి ఒత్తిళ్లు పెరగడంతో తహసీల్దార్ల బదిలీలపై అయోమయం నెలకొంది. మరోవైపు పొరుగు జిల్లాలకు చెందిన కొందరు తహసీల్దార్లను రంగారెడ్డి జిల్లాకు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలోనే పోస్టింగ్‌లను నిలిపివేయాలని జిల్లా యంత్రాంగానికి మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. కాగా, నగరానికి ఆనుకొని ఉన్న మండలాల్లో పోస్టింగ్‌ల కోసం తీవ్ర స్థాయిలో పైరవీలు సాగాయి. కలెక్టరేట్లోనే తిష్టవేసిన తహసీల్దార్లు కోరుకున్న మండలాలను దక్కించుకునేందుకు తమదైన శైలిలో పలుకుబడిని ఉపయోగించారు. -
కలెక్టర్, సబ్‌కలెక్టర్, ఎస్పీ బదిలీలపై ఉత్కంఠ
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: కొత్త కలెక్టర్ ఎవరు? జిల్లా ఎస్పీగా ఎవరు రానున్నారనే ఊహాగానాలకు మరో ఐదు రోజుల్లో తెరపడనుంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో పాలనాపరమైన మార్పులకు కేంద్ర ప్రభుత్వం తుది మెరుగులు దిద్దుతోంది. ‘స్థానికత’ను పరిగణనలోకి తీసుకోవడం ద్వారా అఖిల భారత సర్వీసు(ఏఐఎస్) అధికారులను విభజిస్తారని ప్రచారం జరుగుతున్న తరుణంలో కలెక్టర్, సబ్‌కలెక్టర్, ఎస్పీల బదిలీలపై ఉత్కంఠ నెలకొంది. తెలంగాణ రాష్ర్ట ఆవిర్భావ దినోత్సవం(అపాయింటెడ్ డే) నేపథ్యంలో జూన్ 2లోపు ఆలిండియా సర్వీస్ అధికారుల విభజన ప్రక్రియను పూర్తి చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ క్రమంలోనే సంబంధిత అధికారుల నుంచి ఆప్షన్లను కూడా కోరింది. జన్మస్థానం, విద్యాభ్యాసం ప్రాంతాలపై స్పష్టత ఇవ్వాలని సూచిస్తూ మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ రెండింటిలో ఏ అంశాన్ని ఆధారంగా చేసుకొని నియామకాలు చేస్తారనే అంశంపై మాత్రం ఇప్పటి వరకు కేంద్రం స్పష్టత ఇవ్వలేదు. జిల్లాలో పనిచేస్తున్న ఐదుగురు కీలక అధికారుల్లో ముగ్గురు సీమాంధ్ర ప్రాంతానికి చెందినవారే. దీంతో వారందరినీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయిస్తారనే ప్రచారం జరుగుతోంది. కలెక్టర్ బి.శ్రీధర్ కడప జిల్లాకు చెందినవారు. పాఠశాల విద్యాభ్యాసం ఎక్కువ భాగం రాయలసీమలోనే కొనసాగించారు. విద్యాభ్యాసం, పుట్టిన స్థలం.. దేన్ని ప్రాతిపదికగా తీసుకున్నాఆయన ను ఆంధ్ర కేడర్‌కు కేటాయించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆయన లిఖిత పూర్వక ఆప్షన్ ఇవ్వలేదు. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ప్రస్తుత జిల్లా గ్రామీణ ఎస్పీ రాజకుమారికి సైతం రాష్ట్ర విభజన నేపథ్యంలో స్థాన చలనం తప్పడంలేదు. కేడర్ కేటాయింపుపై ఆమె ఆప్షన్ కూడా ఇచ్చారు. డైరె క్ట్ రిక్రూటీ అయిన వికారాబాద్ సబ్‌కలె క్టర్ కాట ఆమ్రపాలికి కూడా బదిలీ అనివార్యమైంది. విశాఖపట్టణంలో విద్యాభ్యాసం కొనసాగించిన ఆమె.. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆప్షన్‌ను కూడా ఇచ్చారు. డ్రాలో లక్కెవరికో? స్థానికత ఆధారంగా రాష్ట్రంలో అఖిల భారత సర్వీసుల అధికారులను రెండు రాష్ట్రాలకు పంచినా.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారుల మిగులు ఏర్పడుతోంది. అక్కడి అవసరాలకు మించి 14 మంది చొప్పున ఐఏఎస్, ఐపీఎస్‌లు అదనంగా ఉన్నారు. వీరిని తెలంగాణ రాష్ట్ర కేడర్‌కు బదలాయించే అవకాశం ఉంది. అయితే 14 మంది ఎవరనేది లక్కీ డ్రా ద్వారా నిర్ణయిస్తారు. దీంతో ఈ లక్కీ డ్రాలో ఎంపికైన అధికారులను నిర్దేశిత రాష్ట్ర కేడర్లకు అలాట్ చేయనున్నారు. ఇంకోవైపు జిల్లాలో పనిచేస్తున్న ఇద్దరు జాయింట్ కలెక్టర్లు తెలంగాణ ప్రాంతానికే చెందినవారు. కన్ఫర్డ్ (ప్రమోటీ)ఐఏఎస్‌లుగా పదోన్నతి పొందిన వీరిరువురూ తెలంగాణలో పనిచేసేందుకు సుముఖంగా ఉన్నారు. అయితే ఆంధ్రా కంటే తెలంగాణలో కన్ఫర్డ్ ఐఏఎస్‌లు ఆరుగురు అదనంగా ఉన్నారు. వీరిని ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు కేటాయించాలని కేంద్రం భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఆంధ్రాకు వెళ్లే అధికారులపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఈనెల 26న ప్రధాన మంత్రిగా మోడీ ప్రమాణస్వీకారం చేసిన అనంతరం ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల కేటాయింపులపై స్పష్టమైన మార్గదర్శకాలు వెలువడే అవకాశాలున్నాయి. ‘అపాయింటెడ్ డే’లోపు ఆయా రాష్ట్రాల్లో శాఖాధిపతులు, జిల్లా కలెక్టర్ల నియామకాల ప్రక్రియ పూర్తికావాల్సి ఉన్నందున మరో ఐదారు రోజుల్లో వీరి బదిలీలపై స్పష్టత రానుంది. ఈ నెల 25న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి సమైక్య రాష్ట్రంలో చివరి కలెక్టర్ల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశాన్ని వీడ్కోలు సమావేశంగా అధికారులు పేర్కొంటున్నారు. -
20, 21తేదీల్లో మెగా జాబ్ మేళా
సాక్షి, సిటీబ్యూరో: రాజీవ్ యువ కిరణాలు పథకం కింద నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు ఈనెల 20, 21తేదీల్లో మెగా జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ బి.శ్రీధర్ తెలిపారు. ఇందులో 2119 పోస్టుల (597 టెక్నికల్, 1522 నాన్‌టెక్నికల్)ను భర్తీ చేయనున్నట్టు చెప్పారు. మల్లేపల్లిలోని అన్వర్ ఉలుమ్ డిగ్రీ కళాశాల్లో జరిగే ఈ మేళాకు టెన్త్ పాస్/ఫెయిల్, డిగ్రీ, డిప్లొమా, ఐటీఐ, ఇతర టెక్నిల్ అర్హతలు గలవారు హాజరు కావచ్చు. భారత్ ఇంజినీరింగ్, రెడ్డీస్ ల్యాబ్స్, ఫుడ్‌వరల్డ్, భారత్ వాల్‌మార్ట్, మెట్రో, సూర్యవంశీ స్పినింగ్ మిల్స్, వరుణ్‌మోటార్స్, ఎన్ఆర్బీ బేరింగ్స్, కన్కార్డ్ మోటార్స్, వోక్స్వ్యాగన్, అమృతాంజన్ హెల్త్‌కేర్, హెరిటేజ్‌ఫుడ్స్ తదితర సంస్థలు ఇందులో పాల్గొంటాయి. -
పైసలిచ్చి మోసపోవద్దు: కలెక్టర్ శ్రీధర్
పంచాయతీ కార్యదర్శుల నియామకాల్లో పారదర్శకత పాటిస్తాం: కలెక్టర్ శ్రీధర్ సాక్షి, రంగారెడ్డి జిల్లా: పంచాయతీ కార్యదర్శుల నియామకాల ప్రక్రియలో పూర్తి పారదర్శకతగా పాటిస్తామని కలెక్టర్ బి.శ్రీధర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఎవరైనా మధ్యవర్తులు, దళారులు చెప్పే మాటలు నమ్మవద్దని, వారికి డబ్బులిచ్చి మోసపోవద్దని ఆయన ఈ సందర్భంగా సూచించారు. డబ్బు వసూలు చేస్తునట్లు తెలిస్తే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని, అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకుంటామని, అదేవిధంగా క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు. అభ్యర్థుల డిగ్రీ మార్కులు, వెయిటేజీ మార్కుల ఆధారంగానే నియామకాలు చేపడతామన్నారు. ఎంపిక విధానం, అభ్యర్థుల వివరాలను ఆన్లైన్లో అందుబాటులో ఉంచుతామన్నారు. కాగా స్థానిక జిల్లా పరిషత్ కార్యాలయంలో గురువారం పంచాయతీ కార్యదర్శి పోస్టుల కోసం వచ్చిన దరఖాస్తులను అధికారులు పరిశీలించారు. -
అక్టోబర్ 3న ఓటరు ముసాయిదా
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఓటరు ముసాయిదా జాబితాను అక్టోబర్ 3న ప్రచురించాలని కలెక్టర్ బి.శ్రీధర్ ఈఆర్ఓలను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో ఓటరు నమోదుపై ఈఆర్ఓలతో సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు పెండింగ్‌లో ఉంచిన మల్కాజ్గిరి, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, ఉప్పల్ నియోజకవర్గాల పరిధిలోని ఓటరు నమోదు ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 45,060 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. బూత్‌స్థాయి అధికారులు తమ పరిధిలో ఓటరు నమోదు ప్రక్రియతోపాటు వలస వెళ్లిన , మరణించిన ఓటర్ల వివరాలను గుర్తించి జాబితా నుంచి తొలగించాలని ఆయన ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ దరఖాస్తులను పెండింగ్‌లో ఉండడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలింగ్ స్టేషన్లలో వికలాంగులు, వృద్ధుల సౌకర్యార్థం ర్యాంపులు ఏర్పాటు చేయాలన్నారు. విద్యుత్ సౌకర్యంలేని పోలింగ్ స్టేషన్ల జాబితాను తయారుచేసి వాటికి వెంటనే విద్యుత్ కనెక్షన్ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎంవీరెడ్డి, వికారాబాద్ సబ్‌కలెక్టర్ ఆమ్రపాలి, జెడ్పీ సీఈఓ రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఏర్పాట్లు పూర్తి చేయండి : కలెక్టర్ ఘట్కేసర్, ఎన్ఎఫ్సీ నగర్ గ్రామ పంచాయతీ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ బి.శ్రీధర్ అధికారులను ఆదేశించారు. ఈ ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో ఆయన కలెక్టరేట్లో సమావేశం నిర్వహించారు. ఈ రెండు పంచాయతీల ఎన్నికలకు మల్కాజ్‌గిరీ ఆర్డీఓ ఇన్చార్జిగా వ్యవహరిస్తారన్నారు. మొత్తం 55 పోలింగ్ స్టేషన్లు, 19,227 మంది ఓటర్లున్నారని జెడ్పీ సీఈఓ రవీందర్‌రెడ్డి కలెక్టర్‌కు వివరించారు.