రెవెన్యూ యంత్రాంగం ప్రక్షాళన | new tahsildars to 31 zones | Sakshi
Sakshi News home page

రెవెన్యూ యంత్రాంగం ప్రక్షాళన

Published Tue, Jun 3 2014 11:51 PM | Last Updated on Wed, Mar 28 2018 10:59 AM

new tahsildars to 31 zones

 సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: కొత్త ప్రభుత్వం కొలువుదీరిన వెనువెంటనే జిల్లా రెవెన్యూ యంత్రాంగంలో సమూల ప్రక్షాళన జరిగింది. జిల్లా రెవెన్యూ అధికారి మొదలు రెండు డివిజన్ల ఆర్డీవోలు, పలువురు తహసీల్దార్లకు స్థానచలనం కలిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కీలకమైన శివారు మండలాల్లోని డిప్యూటీ కలెక్టర్ స్థాయి తహసీల్దార్లందరినీ బదిలీ చేసింది. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు పొరుగు జిల్లాలకు వెళ్లి తిరిగొచ్చిన తహసీల్దార్ల పోస్టింగ్‌లపై జిల్లా యంత్రాంగం మంగళవారం రాత్రి దాకా కసరత్తు చేసింది.

 సమర్థత, పనితీరును ప్రామాణికంగా తీసుకొని జిల్లా కలెక్టర్ బి. శ్రీధర్ బదిలీల జాబితా రూపొందించగా.. సచివాలయ స్థాయిలో లాబీయింగ్, రాజకీయ ఒత్తిళ్లతో జాబితా పూర్తిగా మారిపోయింది. తమ కనుసన్నల్లో మెలిగే అధికారులకు కీలక పోస్టింగ్‌లు ఇప్పించుకునేందుకు ప్రభుత్వ పెద్దలు ‘మంత్రాంగం’ నెరపడంతో బదిలీలు కొలిక్కిరాలేదు. ప్రభుత్వ స్థాయిలో జాబితాలో కొన్ని మార్పులు, చేర్పులు చేయాలని సూచనలు రావడంతో బదిలీలు బుధవారానికి వాయిదాపడ్డాయి.

 డీఆర్‌వో, ఇద్దరు ఆర్డీవోల బదిలీ
 ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అధికారులకు ఉద్వాసన పలకాలని నిర్ణయించిన కేసీఆర్ సర్కారు.. తొలి రోజే జిల్లా రెవెన్యూ అధికారిపై బదిలీ వేటు   వేసింది. రాయలసీమకు చెందిన ఎస్. వెంకటేశ్వర్లును బదిలీ చేస్తూ ఆయన స్థానంలో సుందర్ అబ్నార్‌ను నియమించింది. అలాగే ఎన్నికల ముందు జిల్లాకు వచ్చిన చేవెళ్ల, రాజేంద్రనగర్ ఆర్డీవోలకు కూడా స్థానభ్రంశం కలిగించింది. రాజేంద్రనగర్ ఆర్డీవోగా గతంలో జిల్లాలో పనిచేసిన సురేశ్ పొద్దార్‌ను నియమించింది. మరోవైపు శివార్లలోని కీలక మండలాల తహసీల్దార్లందరినీ సాగనంపింది. భూముల విలువలు ఆకాశాన్నంటడంతో హాట్ సీట్లుగా మారిన ఈ మండలాల్లో పోస్టింగ్ దక్కించుకునేందుకు అత్యున్నతస్థాయిలో పైరవీలు సాగుతాయి.

ఈ క్రమంలోనే ఈ మండలాలపై కన్నేసిన పలువురు తమ పలుకుబడిని ఉపయోగించి పోస్టింగ్‌లు దక్కించుకున్నారు. జిల్లా న్యాయాధికారిగా పనిచేస్తున్న హరీశ్‌ను కూడా ప్రభుత్వం బదిలీ చేసింది. ఏపీకి చెందిన ఇతని స్థానంలో విక్టర్‌ను నియమించింది. అంతర్జాతీయ విమానాశ్రయం భూ సేకరణాధికారిగా పనిచేస్తున్న ఎంవీ భూపాల్‌రెడ్డికి హైదరాబాద్ జిల్లా న్యాయాధికారిగా పోస్టింగ్ ఇచ్చింది.

  31 మంది తహసీల్దార్లకు స్థానచలనం
 ఇతర జిల్లాల్లో ఎన్నికల విధులు నిర్వర్తించి వెనక్కి వచ్చిన తహసీల్దార్ల పోస్టింగ్‌లపై జిల్లా యంత్రాంగం రోజంతా కుస్తీ పట్టి జాబితా తయారు చేసింది. ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా 31 మండలాల్లో కొత్త తహసీల్దార్ల నియామకానికి ఉత్తర్వులు కూడా సిద్ధం చేసింది. దీంట్లో శివారు మండలాల్లోని ఆరుగురు డిప్యూటీ కలెక్టర్ స్థాయి తహసీల్దార్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఈ నేపథ్యంలో గ్రామీణ మండల తహసీల్దార్ల బదిలీలకు సంబంధించి జిల్లా యంత్రాంగం జాబితాను తయారు చేసింది. అయితే, ఈ పోస్టింగ్‌లపై తీవ్ర రాద్ధాంతం నెలకొంది. ఉద్యోగసంఘాల ఒత్తిళ్లు, స్థానిక ప్రజాప్రతినిధుల సిఫార్సుల తాకిడి పెరిగిపోవడంతో జాబితా ఆసాంతం మారిపోయింది.
 
పొరుగు జిల్లాల నుంచి మరికొందరు..
 అన్నివైపుల నుంచి ఒత్తిళ్లు పెరగడంతో తహసీల్దార్ల బదిలీలపై అయోమయం నెలకొంది. మరోవైపు పొరుగు జిల్లాలకు చెందిన కొందరు తహసీల్దార్లను రంగారెడ్డి జిల్లాకు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలోనే పోస్టింగ్‌లను నిలిపివేయాలని జిల్లా యంత్రాంగానికి మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. కాగా, నగరానికి ఆనుకొని ఉన్న మండలాల్లో పోస్టింగ్‌ల కోసం తీవ్ర స్థాయిలో పైరవీలు సాగాయి. కలెక్టరేట్‌లోనే తిష్టవేసిన తహసీల్దార్లు కోరుకున్న మండలాలను దక్కించుకునేందుకు తమదైన శైలిలో పలుకుబడిని ఉపయోగించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement