‘పుర’ ఫలితాలు నేడే | today municipal elections results | Sakshi
Sakshi News home page

‘పుర’ ఫలితాలు నేడే

Published Sun, May 11 2014 11:31 PM | Last Updated on Wed, Mar 28 2018 10:56 AM

today municipal elections results

సాక్షి, రంగారెడ్డి జిల్లా:  టిక్.. టిక్.. టిక్.. గడియారం చప్పుడు రాజకీయ పార్టీల నేతల గుండెల్లో దడ పుట్టిస్తోంది. మరికొద్ది సేపట్లో పురపాలక సంఘాల ఎన్నికల ఓట్ల లెక్కింపు మొదలుకానుంది. ఇప్పటివరకు ఎన్నికల ప్రచారం, పోలింగ్ పనుల్లో బిజీగా గడిపిన నేతల భవితవ్యం కొన్ని గంటల్లో తేలనుంది. సోమవారం ఉదయం 8గంటలకు పురపాలక సంఘాల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. గత మార్చి 30న జిల్లాలోని వికారాబాద్, తాండూరు, ఇబ్రహీంపట్నం, బడంగ్‌పేట్, పెద్ద అంబర్‌పేట్ మున్సిపాలిటీలు/నగర పంచాయతీలకు ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఆ తర్వాత ప్రాదేశిక, సార్వత్రిక ఎన్నికల్లో ఈ ఫలితాల తాలూకు ప్రభావం ఉంటుందని భావించిన పలువురు నేతలు కోర్టును ఆశ్రయించడంతో తాత్కాలికంగా వాయిదా పడ్డాయి. ఇప్పుడు అన్ని ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ముగియడంతో ఫలితాలను తేల్చేందుకు ఎన్నికల సంఘం ఉపక్రమించింది. ఇందులో భాగంగా సోమవారం పురపాలక సంఘాల ఎన్నికల ఫలితాలు ప్రకటించనుండగా.. మంగళవారం ప్రాదేశిక స్థానాలకు సంబంధించి ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.

 తేలనున్న 663 మంది భవిష్యత్తు
 ఐదు మున్సిపాలిటీలు/నగర పంచాయతీల పరిధిలో 119 కౌన్సిలర్ స్థానాలకుగాను వివిధ పార్టీలకు చెందిన 663 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. శక్తియుక్తులన్నీ కూడగట్టి జోరుగా ప్రచారం నిర్వహించి ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు పలు ఫీట్లు చేశారు. ఓటింగ్ సమయం వరకు గెలుపు కోసం కృషి చేసిన వీరంతా నెలకుపైబడి ఫలితాల కోసం అంచనాలు వేసి తమ బలమెలా ఉందనే కోణంలో రకరకాల సర్వేలు నిర్వహించారు. మొత్తంగా సోమవారం అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. ఓటర్లు ఎవరికి పట్టం కట్టారనే అంశం మధ్యాహ్నం వరకు స్పష్టం కానుండడంతో అభ్యర్థుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

 లెక్కింపు ఇక్కడే..  
 జిల్లాలో ఐదు మున్సిపాలిటీలు/నగర పంచాయతీలకు మార్చి 30న పోలింగ్ జరిగింది. అయితే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పురపాలక ఎన్నికల ఫలితాలను వాయిదా వేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ ఎన్నికల లెక్కింపు ప్రక్రియ సోమవారం చేపట్టేందుకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇబ్రహీంపట్నం, బడంగ్‌పేట్, పెద్ద అంబర్‌పేట్ నగర పంచాయతీలకు సంబంధించి నాదర్‌గుల్‌లోని ఎంవీఎస్‌ఆర్ ఇంజినీరింగ్ కాలేజీలో ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. అదేవిధంగా వికారాబాద్ మున్నిపల్ ఎన్నికల కౌంటింగ్ వికారాబాద్‌లోని ఎస్‌ఏపీ కాలేజీలో, తాండూరు మున్సిపాలిటీ ఓట్ల లెక్కింపు తాండూరు టీఆర్‌సీలో నిర్వహిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement