కలెక్టర్, సబ్‌కలెక్టర్, ఎస్పీ బదిలీలపై ఉత్కంఠ | Suspense on Collector, Sub-Collector, SP transfers | Sakshi
Sakshi News home page

కలెక్టర్, సబ్‌కలెక్టర్, ఎస్పీ బదిలీలపై ఉత్కంఠ

Published Fri, May 23 2014 12:31 AM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM

Suspense on Collector, Sub-Collector, SP transfers

సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: కొత్త కలెక్టర్ ఎవరు? జిల్లా ఎస్పీగా ఎవరు రానున్నారనే ఊహాగానాలకు మరో ఐదు రోజుల్లో తెరపడనుంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో పాలనాపరమైన మార్పులకు కేంద్ర ప్రభుత్వం తుది మెరుగులు దిద్దుతోంది. ‘స్థానికత’ను పరిగణనలోకి తీసుకోవడం ద్వారా అఖిల భారత సర్వీసు(ఏఐఎస్) అధికారులను విభజిస్తారని ప్రచారం జరుగుతున్న తరుణంలో కలెక్టర్, సబ్‌కలెక్టర్, ఎస్పీల బదిలీలపై ఉత్కంఠ నెలకొంది. తెలంగాణ రాష్ర్ట ఆవిర్భావ దినోత్సవం(అపాయింటెడ్ డే) నేపథ్యంలో జూన్ 2లోపు ఆలిండియా సర్వీస్ అధికారుల విభజన ప్రక్రియను పూర్తి చేయాలని కేంద్రం నిర్ణయించింది.

 ఈ క్రమంలోనే సంబంధిత అధికారుల నుంచి ఆప్షన్లను కూడా కోరింది. జన్మస్థానం, విద్యాభ్యాసం ప్రాంతాలపై స్పష్టత ఇవ్వాలని సూచిస్తూ మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ రెండింటిలో ఏ అంశాన్ని ఆధారంగా చేసుకొని నియామకాలు చేస్తారనే అంశంపై మాత్రం ఇప్పటి వరకు కేంద్రం స్పష్టత ఇవ్వలేదు. జిల్లాలో పనిచేస్తున్న ఐదుగురు కీలక అధికారుల్లో ముగ్గురు సీమాంధ్ర ప్రాంతానికి చెందినవారే. దీంతో వారందరినీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయిస్తారనే ప్రచారం జరుగుతోంది. కలెక్టర్ బి.శ్రీధర్ కడప జిల్లాకు చెందినవారు. పాఠశాల విద్యాభ్యాసం ఎక్కువ భాగం రాయలసీమలోనే కొనసాగించారు.

 విద్యాభ్యాసం, పుట్టిన స్థలం.. దేన్ని ప్రాతిపదికగా తీసుకున్నాఆయన ను ఆంధ్ర కేడర్‌కు కేటాయించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆయన లిఖిత పూర్వక ఆప్షన్ ఇవ్వలేదు. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ప్రస్తుత జిల్లా గ్రామీణ ఎస్పీ రాజకుమారికి సైతం రాష్ట్ర విభజన నేపథ్యంలో స్థాన చలనం తప్పడంలేదు. కేడర్ కేటాయింపుపై ఆమె ఆప్షన్ కూడా ఇచ్చారు. డైరె క్ట్ రిక్రూటీ అయిన వికారాబాద్ సబ్‌కలె క్టర్ కాట ఆమ్రపాలికి కూడా బదిలీ అనివార్యమైంది. విశాఖపట్టణంలో విద్యాభ్యాసం కొనసాగించిన ఆమె.. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆప్షన్‌ను కూడా ఇచ్చారు.

 డ్రాలో లక్కెవరికో?
 స్థానికత ఆధారంగా రాష్ట్రంలో అఖిల భారత సర్వీసుల అధికారులను రెండు రాష్ట్రాలకు పంచినా.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారుల మిగులు ఏర్పడుతోంది. అక్కడి అవసరాలకు మించి 14 మంది చొప్పున ఐఏఎస్, ఐపీఎస్‌లు అదనంగా ఉన్నారు. వీరిని తెలంగాణ రాష్ట్ర కేడర్‌కు బదలాయించే అవకాశం ఉంది. అయితే 14 మంది ఎవరనేది లక్కీ డ్రా ద్వారా నిర్ణయిస్తారు. దీంతో ఈ లక్కీ డ్రాలో ఎంపికైన అధికారులను నిర్దేశిత రాష్ట్ర కేడర్‌లకు అలాట్ చేయనున్నారు. ఇంకోవైపు జిల్లాలో పనిచేస్తున్న ఇద్దరు జాయింట్ కలెక్టర్లు తెలంగాణ ప్రాంతానికే చెందినవారు. కన్ఫర్డ్ (ప్రమోటీ)ఐఏఎస్‌లుగా పదోన్నతి పొందిన వీరిరువురూ తెలంగాణలో పనిచేసేందుకు సుముఖంగా ఉన్నారు.

 అయితే ఆంధ్రా కంటే తెలంగాణలో కన్ఫర్డ్ ఐఏఎస్‌లు ఆరుగురు అదనంగా ఉన్నారు. వీరిని ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు కేటాయించాలని కేంద్రం భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఆంధ్రాకు వెళ్లే అధికారులపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఈనెల 26న ప్రధాన మంత్రిగా మోడీ ప్రమాణస్వీకారం చేసిన అనంతరం ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల కేటాయింపులపై స్పష్టమైన మార్గదర్శకాలు వెలువడే అవకాశాలున్నాయి. ‘అపాయింటెడ్ డే’లోపు ఆయా రాష్ట్రాల్లో శాఖాధిపతులు, జిల్లా కలెక్టర్ల నియామకాల ప్రక్రియ పూర్తికావాల్సి ఉన్నందున మరో ఐదారు రోజుల్లో వీరి బదిలీలపై స్పష్టత రానుంది. ఈ నెల 25న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి సమైక్య రాష్ట్రంలో చివరి కలెక్టర్ల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశాన్ని వీడ్కోలు సమావేశంగా అధికారులు పేర్కొంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement