అన్నదాతకు భరోసా ఇవ్వండి
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఖరీఫ్ పనులు ప్రారంభమవుతున్నందున జిల్లాకు సరిపడా ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచాలని, అధికారులంతా అన్నదాతకు అండగా నిలబడి సాగు సక్రమంగా సాగేలా పటిష్ట చర్యలు తీసుకోవాలని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.
మంగళవారం మంత్రి సచివాలయంలోని తన చాంబర్లో జిల్లా వ్యవసాయశాఖపై సమీక్షించారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించి కార్యాచరణపై అధికారులతో చర్చించారు. ఈ సీజన్లో మొక్కజొన్న, కంది, పత్తి, వరి పంటలు ఎక్కువగా సాగయ్యే అవకాశం ఉన్నందున అవసరానికి సరిపడా విత్తనాలు సిద్ధంగా ఉంచాలన్నారు. నకిలీ విత్తనాలతో గతంలో చాలా నష్టం జరిగిందని, ఈసారి అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
జిల్లా అంతటా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి ఈ వ్యవహారాన్ని కట్టడి చేయాలన్నారు. నకిలీ విత్తనాలు విక్రయించినట్లు గుర్తిస్తే సదరు డీలరుపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. రైతులకు యూరియా, డీఏపీ తదితర ఎరువులను సకాలంలో అందించాలన్నారు. జిల్లాలో ఖరీఫ్ సీజన్లో రూ.442 కోట్ల పంటరుణాలు ఇచ్చేలా లక్ష్యాన్ని నిర్దేశించామని, ఈమేరకు అర్హులైన రైతులకు తప్పకుండా రుణాలు ఇవ్వాలని మంత్రి బ్యాంకర్లను ఆదేశించారు. నగరం చుట్టూ జిల్లా విస్తరించి ఉన్నందున హార్టికల్చర్ జోన్ ఏర్పాటుకు ప్రత్యేక ప్రణాళిక తయారు చేయాలని ఉద్యానశాఖ అధికారులను ఆదేశించారు.
రైతులు సరుకులు దాచుకునేందుకు గిడ్డంగులు నిర్మించాల్సిన అవసరం ఉందని, ఇందుకోసం ప్రణాళికను తయారు చేయాలని మార్కెటింగ్ శాఖ అధికారులకు సూచించారు. కలెక్టర్ బి.శ్రీధర్ మాట్లాడుతూ ప్రస్తుత ఖరీఫ్‌లో జిల్లాలో 2లక్షల హెక్టార్లలో పంటలు సాగయ్యే అవకాశం ఉందని, ఈమేరకు విత్తనాలు, ఎరువులను సిద్ధం చేశామని చెప్పారు. పత్తి పంట ఎక్కువ విస్తీర్ణంలో సాగవనుందని, దీంతో 30 రకాల కంపెనీలకు చెందిన 3 లక్షల విత్తన ప్యాకెట్లు ఇప్పటికే డీలర్లకు పంపిణీ చేశామన్నారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు విజయ్‌కుమార్, ఉద్యానశాఖ ఏడీ ఉమాదేవి తదితరులు పాల్గొన్నారు.