సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎటువంటి విద్యుత్ కోతలు లేవని ఇంధన శాఖ కార్యదర్శి బి. శ్రీధర్ స్పష్టంచేశారు. పల్లెల్లో కోతలంటూ జరుగుతున్న ప్రచారం పచ్చి అబద్ధమని చెప్పారు. 4వ తేదీన మాత్రమే డిమాండ్ ఎక్కువగా ఉండటంతో గ్రిడ్ భద్రత దృష్ట్యా కేవలం కొన్ని గంటలు లోడ్ రిలీఫ్ విధించాల్సి వచ్చిందని తెలిపారు.
కృష్ణపట్నంలోని శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ స్టేషన్‌లో బూడిదను బయటికి పంపడంలో ఏర్పడ్డ సాంకేతిక సమస్యపై విచారణకు ఆదేశించామని చెప్పారు. ఈ ప్లాంటును ప్రైవేటీకరించడానికే హాఫర్స్‌ను కూల్చారన్నది అవాస్తవమని వివరించారు. ఈ ప్లాంట్‌ను ఆదానీకి అప్పగిస్తారన్న ప్రచారంలో వాస్తవం లేదని చెప్పారు. శ్రీధర్ సోమవారం ‘సాక్షి’తో మాట్లాడుతూ ఏమన్నారంటే..
ఈ ఏడాది మార్చి, ఏప్రిల్, మే నెలల్లో ఎండలు తీవ్రంగా ఉండి, డిమాండ్ ఎక్కువ ఉన్నప్పటికీ అతి తక్కువ కోతలతో విద్యుత్ సరఫరా చేశాం. ఏప్రిల్ 15 నుంచి పరిశ్రమలకు పవర్ హాలిడే కూడా ఎత్తేశాం. ఆ తరువాత రోజుకి 180 నుంచి 190 మిలియన్ యూనిట్ల డిమాండ్ ఉండేది. ఉష్ణోగ్రతలు పెరిగి, గృహ విద్యుత్ వినియోగం ఎక్కువగా ఉండటంతో నాలుగు రోజులుగా డిమాండ్ అనూహ్యంగా 225 ఎంయూకు పైగా ఉంది.
ఈ నెల 4న 224 ఎంయూ డిమాండ్ ఉంది. అయినా అంతమేరకు విద్యుత్ సరఫరా చేశాం. అయితే పవన విద్యుత్ 800 మెగావాట్లు పడిపోయింది. బయటి మార్కెట్‌లో దొరకలేదు. ఫలితంగా సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల మధ్య పీక్ అవర్స్‌లో 4.6 ఎంయూ లోటు ఏర్పడింది. అప్పటికే సెంట్రల్ గ్రిడ్ నుంచి అదనంగా విద్యుత్ తీసుకున్నాం.
ఇంకా తీసుకుంటే గ్రిడ్ కూలిపోతుంది. దీంతో 2 నుంచి 3 గంటలు ఎమర్జెన్సీ లోడ్ రిలీఫ్ (ఈఎల్‌ఆర్) అమలు చేయాల్సి వచ్చింది. అంతేతప్ప అది విద్యుత్ కోత కాదు. విదేశీ బొగ్గుతో నడిచే కృష్ణపట్నం ప్లాంట్‌కు టన్ను రూ.24 వేలు చొప్పున 18 లక్షల టన్నులను అదానీ సంస్థ సరఫరా చేస్తుంది. స్వదేశీ బొగ్గుతో విద్యుత్ ఉత్పత్తి చేసే డాక్టర్ నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్ (ఎన్టీటీపీసీ), రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ (ఆర్టీపీపీ)లకు 13 లక్షల బొగ్గును టన్ను రూ.19,500కు చెట్టినాడు సంస్థ సమకూరుస్తుంది.
ఈ రెండు టెండర్లను సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అనుమతితో ఖరారు చేశాం. జూలై మొదటి వారం నుంచి బొగ్గు సరఫరా మొదలవుతుంది. మన దగ్గర విద్యుత్ ఉన్నప్పుడు ఇతర రాష్ట్రాలకు ఇచ్చి, వారి దగ్గర ఉన్నప్పుడు తీసుకునే ఏర్పాటు చేస్తున్నాం. అవసరమైనప్పుడు కొనేలా షార్ట్‌టర్మ్ టెండర్లు పిలుస్తున్నాం. కృష్ణపట్నం ప్లాంటుకు క్వాలిటీ బొగ్గు కావాలి. దీని నుంచి వచ్చే ఫ్లైయాష్‌ను సిమెంటు కంపెనీలు తీసుకోవడంలేదు.
రెండేళ్లుగా పెన్నా సిమెంట్ మాత్రమే 40శాతం తీసుకుంటోంది. స్థానికంగా వాడేది 10శాతం. మిగిలిన 50శాతాన్ని యాష్‌పాండ్‌లోకి పంపుతుంటారు. పైపు నుంచి బూడిద వెళుతున్నప్పుడు దానిలోని ఎలక్ట్రోడ్స్‌ను ఎలక్ట్రోస్టాటిక్ ప్రెసిపిటేటర్ (ఈఎస్‌పీ) సేకరించి కిందకు పంపుతుంది. ఎక్కువ బూడిద రావడంతో ప్లేట్స్ (హాఫర్స్) కింద పడిపోయాయి. దీంతో ప్లాంటును నిలిపివేయాల్సి వచ్చింది. దీనిపై డైరెక్టర్, చీఫ్ ఇంజనీర్, ఎస్‌ఈ బృందంతో విచారణ చేయిస్తున్నాం.
ఇది సాంకేతిక సమస్యే తప్ప ఎలాంటి కుట్రా లేదు. కృష్ణపట్నం ప్లాంటును ప్రైవేటీకరించం. ప్లాంట్ నిర్వహణకు మనకు పడుతున్న కాస్ట్‌కంటే తక్కువకు ఎవరైనా ఇస్తామంటే పారదర్శక టెండర్ల ద్వారా ఓ అండ్ ఎం విధానంలో అప్పగిస్తాం. దీనివల్ల యూనిట్ రేటు తగ్గి వినియోగదారులకే మేలు జరుగుతుంది. ఎస్‌బీఐ కాప్స్ బిడ్ డాక్యుమెంట్ తయారు చేసి టెండర్ల ప్రక్రియకు సహకరించేందుకు ఈరోజే ఆదేశాలిచ్చాం. ప్లాంటులో ఉద్యోగులంతా ఏపీ జెన్‌కో నుంచి డిప్యుటేషన్‌పై వెళ్లినవారే. వారు అభద్రతకు గురి కావద్దు.
విద్యుత్ కోతల్లేవు.. ‘ప్రైవేటు’ కుట్రల్లేవు
Published Tue, Jun 7 2022 5:27 AM | Last Updated on Tue, Jun 7 2022 2:57 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment