రాష్ట్రవ్యాప్తంగా అనధికారిక విద్యుత్ కోతలు
అదేమంటే మరమ్మతులంటూ బుకాయింపు
ఏమార్చేందుకు విడతలవారీగా కరెంట్ కట్
వ్యవసాయ సీజన్‌లో అన్నదాతల అగచాట్లు
ఇచ్చేది 7 గంటలు.. అదీ రెండు మూడు దఫాలు.. గ్రామాల్లో రాత్రీ పగలూ ఉక్కపోతలతో అల్లాడుతున్న జనం
వీటీపీఎస్‌లో అడుగంటిన బొగ్గు నిల్వలు.. మొరాయించిన రోటర్
గతేడాది ఇదే సమయంతో పోలిస్తే డిమాండ్ తగ్గినా అది కూడా సమకూర్చ లేకపోతున్న కూటమి ప్రభుత్వం
రాష్ట్రంలో అస్తవ్యస్థ విద్యుత్ సరఫరాకు ఇది ఓ ఉదాహరణ మాత్రమే. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి విద్యుత్ రంగంలో ఉన్న కాంట్రాక్టులేమిటి? కమీషన్లు వచ్చే పనులేమిటి? అని ఆరా తీయడం, పది మంది డైరెక్టర్లు, ఉన్నతాధికారులతో బలవంతంగా రాజీనామాలు చేయించడం మినహా నాణ్యమైన విద్యుత్తు సరఫరాపై దృష్టి పెట్టలేదు.
వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగుతున్న నేపథ్యంలో రైతులకు 9 గంటలు నిరంతరాయంగా విద్యుత్ అందించాలనే కనీస స్పృహ లేకుండా వ్యవహరిస్తోంది. గ్రామాలు, పట్టణాలు అనే తేడా లేకుండా వానాకాలంలో సైతం విద్యుత్ కోతలు విధిస్తున్నారు. ఓవైపు ఉక్కపోత, దోమల దాడితో జనం అల్లాడుతుంటే మరోవైపు విద్యుత్ కోతలు వేధిస్తున్నాయి.
కళ్లుగప్పేందుకు విడతల వారీగా..
తమ అసమర్ధతను కప్పిపుచ్చుకునేందుకు సబ్‌స్టేషన్లకు వార్షిక మరమ్మతులు, విద్యుత్ లైన్ల తనిఖీలు చేపడుతున్నామంటూ ప్రభుత్వ పెద్దలు అధికారులతో అబద్ధాలు చెప్పిస్తున్నారు. ఒకేసారి విద్యుత్ సరఫరా నిలిపివేస్తే తమ నిర్వాకాలు తెలిసిపోతాయనే భయంతో రోజూ 15 నిమిషాల నుంచి 45 నిమిషాల వరకూ విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారు. ఇదేమిటని అడిగితే ‘‘మెయింట్‌నెన్స్ వర్క్స్’’ అంటున్నారని ప్రజలు వాపోతున్నారు.
రైతులు, సామాన్యులతో పాటు పరిశ్రమలకు సైతం విద్యుత్ కోతలు తప్పడం లేదు. సాధారణంగా వేసవిలో విధించే విద్యుత్ కోతలు ఇప్పుడే దాపురించాయి. కాకినాడ జిల్లా సామర్లకోట మండలం ఉండూరులో గత రెండు నెలలుగా రోజుకు ఆరు నుంచి ఏడు గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోతున్నట్లు గ్రామస్తులు గగ్గోలు పెడుతున్నారంటే పరిస్ధితి ఎంత దారుణంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు.
వినియోగం తక్కువే..
రాష్ట్ర ఆర్థిక పురోభివృద్ధికి విద్యుత్ వినియోగం పెరగటాన్ని ఓ సూచికగా భావిస్తారు. దానికి తగ్గట్టుగానే వైఎస్సార్‌సీపీ అధికారంలో ఉన్నన్నాళ్లూ విద్యుత్ వినియోగం రికార్డు స్థాయిలో నమోదైంది. ప్రస్తుతం రోజుకి 227.755 మిలియన్ యూనిట్ల విద్యుత్ వాడకం జరుగుతోంది.
వీటీపీఎస్‌లో దెబ్బతిన్న రోటర్..
ఏపీ జెన్‌కో థర్మల్ కేంద్రాల నుంచి కేవలం 76.143 మిలియన్ యూనిట్లు మాత్రమే విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. థర్మల్ కేంద్రాల్లో బొగ్గు నిల్వలు తగినంత లేకపోవడం ఉత్పత్తి పడిపోవడానికి ఓ కారణమైతే సాంకేతిక సమస్యలు మరో కారణం. డాక్టర్ నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్ (వీటీపీఎస్)లో నాలుగు రోజుల క్రితం 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే యూనిట్‌లో జనరేటర్ రోటర్ పాడయ్యింది. రాష్ట్రంలో విద్యుత్ కోతలు ఇది కూడా ఓ కారణం.
విద్యుత్ కోతలు ఇలా..
» అనకాపల్లి జిల్లా యలమంచిలి టౌన్, రూరల్ పరిధిలో ఫీడర్ల ఓవర్ లోడ్ వల్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతోంది. అచ్యుతాపురం సెజ్ పారిశ్రామిక ప్రాంతం, రాంబిల్లి మండలంలో రోజూ గంట చొప్పున విద్యుత్‌ను నిలిపివేస్తున్నారు. అచ్యుతాపురం మండల పరిధిలో నడింపల్లి, దొప్పెర్ల, ఇరువాడ, రావిపాలెం పరిసరాల్లో విద్యుత్ కోతలు విధిస్తున్నారు. నర్సీపట్నం ఏజెన్సీ ప్రాంతాన్ని ఆనుకుని ఉన్న గొలుగొండ మండలం పరిధిలోని చోద్యం, విప్పలపాలెం, అమ్మపేట, మల్లంపేట, జోగుంపేట, గొలుగొండ, కంఠారం, బాలారం, కేడీపేట గ్రామాల్లో విడతల వారీగా రోజుకి 2 గంటల పాటు కోతలు విధిస్తున్నారు.
» నెల్లూరు జిల్లాలో లైన్లకు మరమ్మతులు పేరుతో కోతలు విధిస్తున్నారు. విశాఖపట్నం జిల్లాలోనూ ఇదే పరిస్థితి ఉంది.
» జగ్గంపేట నియోజకకవర్గం గోకవరం మండలంలో కొత్తపల్లి, కామరాజుపేట తదితర గ్రామాల్లో నెల రోజులుగా అప్రకటిత విద్యుత్ కోతలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
» వైఎస్సార్ కడప జిల్లాలో వ్యవసాయానికి 7 గంటలు మాత్రమే కరెంటు అందుతోంది.
» ప్రకాశం జిల్లా చీమకుర్తి పరిసరాల్లో గ్రానైట్ పరిశ్రమలకు రోజులో రెండు గంటలపాటు అనధికారిక విద్యుత్ కోతలు అమల్లో ఉన్నాయి.
ఉత్పత్తి తగ్గడంతో బయట కొంటున్నాం..
‘‘ఒడిశా నుంచి కొత్త రోటర్ వీటీపీఎస్‌కు రావడానికి మరో నాలుగు రోజులు పట్టవచ్చు. ఉత్పత్తి తగ్గడంతో బహిరంగ మార్కెట్‌లో విద్యుత్ కొంటున్నాం. రాష్ట్రంలో అధికారిక విద్యుత్ కోతలు లేవు. సబ్æ స్టేషన్‌లో మరమ్మతులు, సాంకేతిక ఇబ్బందులు తలెత్తినప్పుడు ఆయా గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోతుంటుంది’’ –కె.విజయానంద్, ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి.
‘‘ఈ చిత్రంలో కనిపిస్తున్న పంచాది శ్రీను విజయనగరం జిల్లా నెల్లిమర్ల సమీపంలోని వల్లూరులో మూడెకరాల కౌలు పొలంలో వరి పండిస్తున్నాడు. మెట్ట ప్రాంతం కావడంతో అక్కడ కాలువలు లేవు. చెరువు ఉన్నా ఆ నీళ్లు అన్ని పొలాలకూ సరిపోవు. వ్యవసాయ విద్యుత్ బోర్లపైనే ఆధారపడి ఇక్కడి రైతులు సాగు చేస్తుంటారు. కొద్ది రోజులుగా రోజూ కోతలు విధిస్తున్నారు. సోమవారం ఏకంగా మూడు గంటల పాటు వ్యవసాయ విద్యుత్ సరఫరాకు ఆటంకం కలిగింది. ఇలాగైతే పంట ఎండిపోయి అప్పుల పాలు కావడం ఖాయమని రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు’’ – సాక్షి, అమరావతి/నెట్‌వర్క్
Comments
Please login to add a commentAdd a comment