డిమాండ్ భారీగా పెరిగినా నిరంతరాయంగా సరఫరా
విద్యుత్ డిమాండ్ రోజుకు 236 మిలియన్ యూనిట్లుగా నమోదు
కొన్నిచోట్ల పిడుగుపాట్లు, చెట్లు విరిగిపడటం, చిరు ప్రాణుల వల్ల సాంకేతిక సమస్యలు
వ్యవసాయ విద్యుత్ ఫీడర్లను వేరు చేసే పనుల వల్ల కొంత ఆటంకం
అయినా 23 నుంచి 45 నిమిషాలకి మించి అవాంతరాల్లేకుండా సరఫరా
సాక్షి, అమరావతి: విద్యుత్ డిమాండ్ ఎంత పెరిగినప్పటికీ, ప్రజలకు ఏమాత్రం ఇబ్బంది కలగకుండా విద్యుత్ సరఫరా చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం రాజీ పడటంలేదు. మండు వేసవి వస్తే గత ప్రభుత్వంలో గంటల తరబడి విద్యుత్ కోతలు గుర్తొస్తాయి. టీడీపీ హయాంలో గృహ వినియోగదారులకు పెట్టిన ఎమర్జెన్సీ లోడ్ రిలీఫ్ (ఈఎల్‌ఆర్)లు, పరిశ్రమలకు విధించిన పవర్ హాలిడేలు ఆందోళనకు గురిచేస్తుంటాయి. కానీ గత ఐదేళ్లలో ప్రజలు వేసవి విద్యుత్ కష్టాలను మర్చిపోయేలా సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేశారు.
ముందస్తు ప్రణాళికలు, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో విద్యుత్ సంస్థలను తీర్చిదిద్దారు. దీనిద్వారా ప్రజలకు ఎలాంటి అవాంతరాలు లేకుండా నాణ్యమైన విద్యుత్తు అందుతోంది. ఈ వేసవిలో రాష్ట్రవ్యాప్తంగా రోజువారీ విద్యుత్ డిమాండ్ భారీగా 236 మిలియన్ యూనిట్లకు పెరిగింది. అయినప్పటికీ, ఎక్కడా విద్యుత్ కోతలు, అవాంతరాలు లేకుండా సరఫరా జరుగుతోంది.
అయితే వేసవిలో సబ్ స్టేషన్లు, లైన్ల మరమ్మతులకు చేపట్టాల్సిన సాధారణ మెయింటెనెన్స్, వ్యవసాయ ఫీడర్లను ఇతర ఫీడర్లతో వేరుచేసేందుకు జరుగుతున్న ప్రయత్నాలు, భారీ ఈదురు గాలులకు చెట్ల కొమ్మలు విరిగి విద్యుత్ తీగలపై పడటం, సబ్ స్టేషన్లపై పిడుగులు పడటం, ఉడుతలు, బల్లులు, పక్షులు, పాములు వంటి చిరు ప్రాణులు ఫీడర్లను దెబ్బతీయడం వంటి కారణాల వల్ల పలు ప్రాంతాల్లో స్వల్ప కాలం పాటు విద్యుత్ సరఫరాను నిలిపివేయాల్సి వస్తోంది.
అది కూడా 23 నిమిషాల నుంచి 45 నిమిషాల వరకే. ఇది మినహా రాష్ట్రంలో ఎక్కడా విద్యుత్ కోతలు లేవని ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్) సీఎండీ ఐ.పృధ్వీతేజ్, ఆంధ్రప్రదేశ్ మధ్య, దక్షిణ ప్రాంత డిస్కంల సీఎండీ కె.సంతోషరావు స్పష్టం చేశారు. వారు ‘సాక్షి’కి బుధవారం వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి.
» అనంతపురం సర్కిల్ పరిధిలోని 33/11కెవి సబ్‌స్టేషన్‌లో అత్యవసర మరమ్మతుల కారణంగా ఆ మండల పరిధిలోని గ్రామాల్లో 28వ తేదీన విద్యుత్ సరఫరా ఉండదని ఈనెల 27న పత్రికా ప్రకటన ద్వారా తెలియజేశాం. మరమ్మతులు పూర్తయిన వెంటనే సరఫరాను పునరుద్ధరించాం.
» కదిరిలోని 132/33 కెవి సబ్‌స్ట్షేన్ సమీపంలో పిడుగుపాటు కారణంగా సబ్ స్టేషన్ మరమ్మతుకు గురవడంతో దాని పరిధిలోని తొమ్మిది 33/11 కెవీ సబ్‌స్టేషన్లకు సరఫరాలో అంతరాయం ఏర్పడింది. వెంటనే మరమ్మతులు పూర్తి చేసి సరఫరాను పునరుద్ధరించాం.
» వ్యవసాయ విద్యుత్ ఫీడర్లను వేరు చేయడం ద్వారా గ్రామాలకు త్రీఫేజ్ విద్యుత్తును సరఫరా చేసే పనులు జరుగుతున్నాయి. అందుకోసం లైన్ క్లియరెన్స్æ తీసుకోవడం కారణంగా కొన్ని చోట్ల విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతోంది.
» రాజమహేంద్రవరం 33/11 కేవీ తాడితోట సబ్ స్టేషన్‌లోని 11 కేవీ గాంధీపురం ఫీడర్‌పై ఉదయం 07.20 గంటలకు చెట్ల కొమ్మలు పడటం వల్ల కాసేపు కరెంట్ ఆగింది. డిస్టిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్ (డీటీఆర్) స్విచ్‌ను మార్చి, కొమ్మలను తొలగించి 45 నిమిషాల్లోనే సరఫరాను పునరుద్ధరించారు.
» శ్రీకాకుళం సర్కిల్ ఇచ్ఛాపురం టౌన్‌లో ఇన్‌కమింగ్ వైపు ఉన్న లైవ్ వైర్, క్రాస్ ఆర్మ్‌కి మధ్య బల్లి తాకింది. దీంతో ఏఎస్ పేట కాలనీ వద్ద హై టెన్షన్ (హెచ్‌టీ) ఇన్‌కమింగ్ సైడ్ జంపర్ కట్ అయ్యింది. దీనివల్ల ఇచ్ఛాపురంలోని కొన్ని ప్రాంతాలకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. కేవలం 23 నిమిషాల్లోనే దీనిని సరిచేసి విద్యుత్తు సరఫరా చేశాం. రాష్ట్రంలో ఇంతకు మించి విద్యుత్ సరఫరాలో అవాంతరాలు లేవు. పరిశ్రమలు, గృహ, వాణిజ్య వినియోగదారులకు ఎలాంటి విద్యుత్ కోతలు అమలు చేయడం లేదు.
Comments
Please login to add a commentAdd a comment