సాక్షి, అమరావతి: విపరీతమైన వేడిగాలులు ఉక్కపోతతో ఆరేళ్ల తరువాత యావత్ దేశం తీవ్ర విద్యుత్ కొరత ఎదుర్కొంటోంది. బొగ్గు నిల్వలూ తొమ్మిదేళ్ల కనిష్ట స్థాయికి చేరుకున్నాయి. కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ వివరాల ప్రకారం.. దేశంలో పీక్–పవర్ డిమాండ్ గురువారం గరిష్ట స్థాయికి చేరుకుంది. వచ్చే నెలలో ఇది 8 శాతం వరకు పెరగనుంది. ఏప్రిల్ మొదటి 27 రోజుల్లో విద్యుత్ సరఫరా డిమాండ్ కంటే 1.88 బిలియన్ యూనిట్లు (1.6 శాతం) తగ్గింది.
ఇదీ వివిధ రాష్ట్రాల్లో పరిస్థితి..
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీకి విద్యుత్ సరఫరాచేసే పవర్ ప్లాంట్లలో బొగ్గు కొరత ఏర్పడే అవకాశముందని అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రభుత్వం ఆందోళన వ్యక్తంచేసింది. ఢిల్లీ విద్యుత్ శాఖ మంత్రి సత్యేందర్ జైన్ చెప్పినదాని ప్రకారం.. నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్‌కు చెందిన దాద్రీ–2, ఝజ్జర్ (ఆరావళి) పవర్ ప్లాంట్లలో బొగ్గు కొరత ఏర్పడింది. దాద్రీలో ఒక రోజుకు మాత్రమే నిల్వలు ఉన్నట్లు ఢిల్లీ ప్రభుత్వం వెల్లడించింది.
హరియాణా: గరిష్ట విద్యుత్ డిమాండ్ దాదాపు 9 వేల మెగావాట్లకు చేరుకోగా, సరఫరా దాదాపు 1,500 మెగావాట్లు తగ్గింది. 33.72 మిలియన్ యూనిట్ల కొరత కారణంగా గురుగ్రామ్‌లో 4–6 గంటల పాటు విద్యుత్‌కు అంతరాయం ఏర్పడింది. రాష్ట్ర అవసరాలకు ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ వంటి ఇతర రాష్ట్రాల నుంచి అదనపు విద్యుత్‌ను తీసుకోవాలని హరియాణా నిర్ణయించింది.
ఉత్తరప్రదేశ్: దేశంలో అత్యధిక జనాభా కలిగిన ఈ రాష్ట్రంలో 3 వేల మెగావాట్ల లోటు ఉంది. దాదాపు 23 వేల మెగావాట్ల డిమాండ్ ఉంటే, సరఫరా 20 వేల మెగావాట్లు. 29.52 మిలియన్ యూనిట్ల కొరతవల్ల గ్రామీణ ప్రాంతాలు, చిన్న పట్టణాల్లో లోడ్ షెడ్డింగ్ ఏర్పడింది. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో సగటున 15 గంటల 7 నిమిషాలపాటు విద్యుత్ సరఫరా అవుతోంది.
బిహార్: డిమాండ్ అకస్మాత్తుగా పెరగడంతో బిహార్ రోజుకు 200–300 మెగావాట్ల విద్యుత్ లోటును ఎదుర్కొంటోంది. రాష్ట్ర వినియోగం రోజుకు 6 వేల మెగావాట్లు కాగా వివిధ వనరుల నుండి 5,000–5,200 మెగావాట్లు అందుబాటులో ఉంటోంది. 15.90 మిలియన్ యూనిట్ల కొరత ఉంటోంది.
రాజస్థాన్: విద్యుత్ డిమాండ్ 31 శాతం పెరిగింది. దీంతో విద్యుత్ కొరత 43.59 మిలియన్ యూనిట్లు ఏర్పడింది. ఇది రోజుకు 5 నుండి 7 గంటల విద్యుత్ కోతలకు దారితీసింది. పట్టణ ప్రాంతాల కంటే గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ కోతలు ఎక్కువగా ఉన్నాయి.
కేరళ: ఈ రాష్ట్రంలో గురువారం నుంచి కరెంటు కోతలు మొదలయ్యాయి. బొగ్గు సంక్షోభం కారణంగా ఉత్పత్తి 400 మెగావాట్లు తగ్గడంతో విద్యుత్ కోత విధించాలని రాష్ట్ర విద్యుత్ బోర్డు నిర్ణయించింది.
పంజాబ్: విద్యుత్ డిమాండ్ 40 శాతం పెరిగిందని ఆ రాష్ట్ర విద్యుత్ శాఖ వెల్లడించింది. రాష్ట్రంలో అన్ని వనరుల నుండి విద్యుత్ సరఫరా లభ్యత 1,679 లక్షల యూనిట్లు కాగా 30.65 మిలియన్ యూనిట్ల కొరత ఏర్పడింది. రోపర్ థర్మల్ ప్లాంట్‌లో 8.3 రోజులు, లెహ్రా మొహబ్బత్ ప్లాంట్‌లో నాలుగు రోజులు, జీవీకేలో 2.4 రోజులకు సరిపడా మాత్రమే బొగ్గు ఉంది.
వీటితోపాటు జమ్మూకశ్మీర్‌లో 5.28 మిలియన్ యూనిట్లు, ఛత్తీస్‌గఢ్‌లో 6.71 మి.యూ, మధ్యప్రదేశ్‌లో 13.72 మి.యూ, జార్ఖండ్‌లో 5.78 మి.యూ, ఒడిశాలో 2.69 మి.యూ, తమిళనాడులో 1.60 మి.యూ కొరత ఏర్పడింది. అలాగే, ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్, అసోం, మణిపూర్, మేఘాలయ వంటి రాష్ట్రాలు సైతం విద్యుత్ కొరతను ఎదుర్కొంటున్నాయి. దీంతో ఆయా రాష్ట్రాల్లో రోజుకి 2–8 గంటల మేర విద్యుత్ కోత విధిస్తున్నారు.
ఏపీలో ఇదీ పరిస్థితి..
ఇక ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ డిమాండ్ 8.33 శాతం పెరిగింది. రోజువారీ డిమాండ్ 230 మిలియన్ యూనిట్లు ఉండగా 215 మిలియన్ యూనిట్లు సరఫరా జరుగుతోంది. వ్యవసాయ విద్యుత్ వినియోగం కాస్త తగ్గినప్పటికీ వేసవి కారణంగా గృహ విద్యుత్ వినియోగం భారీగా పెరగడంతో డిమాండ్ తగ్గడంలేదు. థర్మల్ నుంచి 78.40 మి.యూ, సెంట్రల్ గ్యాస్ స్టేషన్ల నుంచి 37.82 మి.యూ, హైడ్రో 6.52 మి.యూ, గ్యాస్, సెయిల్ 8.74 మి.యూ, విండ్ 13.70 మి.యూ, సోలార్ 24.45 మి.యూ, హిందుజా 11.55 మి.యూ, ఇతర ఉత్పత్తి కేంద్రాలు 1.64 మిలియన్ యూనిట్లు చొప్పున అందిస్తున్నాయి. పవర్ ఎక్స్ఛేంజ్‌ల నుంచి 32.73 మిలియన్ యూనిట్లను రూ.12 నుంచి రూ.20 (యూనిట్) చొప్పున కొనుగోలు చేసి వినియోగదారులకు అందిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment