
సాక్షి, హైదరాబాద్: గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు మెంబర్ పదవులకు ఎన్నికలు నిర్వహించేలా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ హైకోర్టులో వ్యాజ్యం దాఖలైంది. రాజ్యాం గంలోని 73వ సవరణ ప్రకారం ఆ పదవులకు ప్రతి ఐదేళ్లకోసారి విధిగా ఎన్నికలు నిర్వహించాలని, ఈ నెలాఖరుతో సర్పంచులు, వార్డు సభ్యుల పదవీ కాలం పూర్తి కాబోతుంటే ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించే ప్రయత్నాలు చేయకుండా ప్రత్యేకాధికారుల పాలన తీసుకొచ్చే చర్యల్ని అడ్డుకోవాలని కోరుతూ రంగారెడ్డి జిల్లా శంషాబాద్ జడ్పీటీసీ సభ్యుడు బూర్కుంట సతీశ్, నార్సింగ్ ఎంపీటీసీ సాయిరాం, చేవెళ్ల మండలం గోపాలపల్లి గ్రామ సర్పంచ్ ఎల్.శ్రీనివాస్‌గౌడ్, నార్సింగ్ గ్రామ వార్డు సభ్యుడు కె.వినోద్‌కుమార్ నార్సింగ్ సంయుక్తంగా ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు.
ఇందులో ప్రతివాదులుగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పంచాయతీ/సాధారణ పరిపాలన శాఖల ముఖ్య కార్యదర్శులు, రాష్ట్ర ఎన్నికల సంఘం, పంచాయతీరాజ్ శాఖ కమిషనర్లను చేర్చారు. కాగా, ఈ కేసు ప్రాధాన్యతను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ వి.రామసుబ్రమణియన్‌లతో కూడిన ధర్మాసనం ఎదుట పిటిషనర్ తరఫు న్యాయవాది సోమవారం ప్రస్తావించారు. దీనిపై మంగళవారం విచారణ చేపడతామని ధర్మాసనం ప్రకటించింది.
ప్రభుత్వం సహకరించడం లేదు..
తెలంగాణలోని 12,751 గ్రామ పంచాయతీలకు ఆగస్టు 1 నుంచి ప్రత్యేకాధికారుల పాలనకు వీలుగా పంచాయతీరాజ్ కమిషనర్ ఈ నెల 13న జారీ చేసిన ప్రొసీడింగ్స్‌ను రద్దు చేయాలని వ్యాజ్యంలో కోరారు. పాలకవర్గ గడువు ముగిసిన ఆరు మాసాల్లోగా ఎన్నికలు నిర్వహించకపోవడం రాజ్యాంగంలోని 243(ఇ)(3), పంచాయతీరాజ్ చట్టంలోని 136 సెక్షన్లను ఉల్లంఘించినట్లేనని తెలిపారు. ఎన్నికలు నిర్వహించేందుకు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) సిద్ధంగా ఉన్నా ప్రభుత్వం సహకరించడం లేదని పేర్కొన్నారు.
పోలింగ్ కేంద్రాల తుది జాబితా సిద్ధమైందని, ఎన్నికలకు అయ్యే వ్యయంలో రూ. 120 కోట్లలో రూ.30 కోట్లను కూడా ప్రభుత్వం మంజూరు చేసిందని తెలిపారు. ప్రత్యేకాధికారుల పాలనపై ఇచ్చిన ఉత్తర్వులను వెంటనే నిలుపుదల చేయాలని, ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని వ్యాజ్యంలో వారు హైకోర్టును కోరారు.
Comments
Please login to add a commentAdd a comment