
సాక్షిప్రతినిధి, ఖమ్మం : గ్రామ పంచాయతీ ఎన్నికలకు మూడు నెలల్లో ముహూర్తం ఖరారు కానుంది. రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సిద్ధమవుతోంది. ఆగస్టు ఒకటో తేదీతో గ్రామ పంచాయతీ పాలక వర్గాల పదవీ కాలం ముగిసింది. ఈ క్రమంలో ప్రభుత్వం ప్రత్యేకాధికారులను నియమించి గ్రామ పరిపాలన కొనసాగిస్తోంది. కొత్త శాసనసభ కొలువుదీరాక పంచాయతీ ఎన్నికలు ఉంటాయని, ఈలోపు అవకాశం లేదని రాజకీయ వర్గాలు భావించాయి. ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలకు సమాయత్తమవుతున్న క్రమంలో ఊహించని విధంగా పంచాయతీ ఎన్నికల అంశం ముందుకొచ్చింది.
దీంతో రాజకీయ పక్షాలు గ్రామ రాజకీయాలపై దృష్టి సారించి.. పంచాయతీ పాలక వర్గాలను కైవసం చేసుకునేందుకు వ్యూహ ప్రతివ్యూహాలు రూపొందించుకునే పనిలో నిమగ్నమయ్యాయి. ప్రభుత్వం ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలని ఆదేశించినా.. అందుకు అనుగుణంగా జిల్లా పంచాయతీ అధికారులు ఏర్పాట్లు సిద్ధం చేసి ఉంచారు. గ్రామ పంచాయతీ ఎన్నికలను ఎలక్ట్రానిక్
ఓటింగ్ యంత్రాలతో కాకుండా
బ్యాలెట్ పేపర్ పద్ధతిన నిర్వహించనుండటంతో ఇప్పటికే వివిధ రాష్ట్రాల నుంచి బ్యాలెట్ బాక్సులను అధికారులు తెప్పించి ఉంచారు. కొత్తగా ఏర్పడిన గ్రామ పంచాయతీలతో సహా అన్ని పంచాయతీల్లో పోలింగ్ కేంద్రాల ఏర్పాటు.. వాటి నిర్వహణ, పోలింగ్ కేంద్రాలకు అనువైన భవనాల అన్వేషణ సైతం పూర్తి చేశారు. అయితే శాసనసభ ఎన్నికల పర్వం కొనసాగుతున్న సమయంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించడానికి గల సానుకూల, ప్రతికూల అంశాలను అధికారులు పరిశీలించి.. ప్రభుత్వానికి నివేదిక పంపే పనిలో నిమగ్నమయ్యారు. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి బీసీ ఓటర్ల గణన పూర్తి కావాల్సి ఉంది.
584 జీపీలకు ఎన్నికలు
జిల్లాలో మొత్తం 584 గ్రామ పంచాయతీలున్నాయి. గతంలో 427 గ్రామ పంచాయతీలు ఉండగా.. ఇందులో పలు పంచాయతీలు కార్పొరేషన్, మున్సిపాలిటీలలో విలీనమయ్యాయి. కొత్తగా ప్రభుత్వం 167 గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేసింది. దీంతో మొత్తం 584 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఇందులో 99 ఏజెన్సీ పంచాయతీలు ఉన్నాయి. వీటికి సంబంధించి గతంలోనే జిల్లా అధికార యంత్రాంగం కసరత్తు పూర్తి చేసింది. అవసరమైన పోలింగ్ సామగ్రి, సిబ్బంది తదితర వివరాలను ఉన్నతాధికారులకు నివేదిక రూపంలో పంపించారు.
అన్నీ సిద్ధం..
గ్రామ పంచాయతీ పాలక వర్గాల పదవీ కాలం ముగిసిన సందర్భంలో గతంలోనే అధికారులు ఎన్నికలకు సంబంధించిన కసరత్తు పూర్తి చేశారు. మొత్తం 4,870 పోలింగ్ బాక్సులను సిద్ధంగా ఉంచారు. వీటిలో కర్ణాటక నుంచి 3,100 బాక్సులను తెప్పించారు. అవసరాన్నిబట్టి మరికొన్నింటిని కూడా తెప్పించనున్నారు. జిల్లాలోని 5,338 వార్డుల్లో అంతే మొత్తంలో పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అలాగే ఎన్నికల నిర్వహణకు 7,193 మంది సిబ్బంది అవసరం ఉంటుందని అంచనా వేశారు. అలాగే రవాణా నిమిత్తం 298 బస్సులు, 88 జీపులు, కార్లను సిద్ధంగా ఉంచారు.
7,20,045 మంది ఓటర్లు..
జిల్లాలోని 584 గ్రామ పంచాయతీల్లో 7,20,045 మంది ఓటర్లు ఉన్నారు. అర్బన్ ప్రాంతంలో ఎస్టీలు 5,105 మంది, ఎస్సీలు 3,145, బీసీలు 3,07,186, ఇతరులు 1,24,606 మంది.. అంటే మొత్తం 4,40,042 మంది ఉన్నారు. రూరల్ ప్రాంతంలో ఎస్టీలు 1,78,446 మంది, ఎస్సీలు 2,22,093, ఇతరులు 6,01,246 కలిపి మొత్తం జనాభా 10,01,785 మంది ఉన్నారు.
2013లో 760 జీపీలకు ఎన్నికలు
2013లో ఉమ్మడి రాష్ట్రంలోని ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పంచాయతీ ఎన్నికలు జరిగాయి. మొత్తం 763 గ్రామ పంచాయతీలకుగాను 760 జీపీలకు ఎన్నికలు నిర్వహించగా.. వీటిలో అత్యధికంగా టీడీపీ 227 గ్రామ పంచాయతీలను గెలుచుకుంది. 439 గ్రామ పంచాయతీలకు పోటీ చేసిన కాంగ్రెస్ 145 స్థానాలను, 494 స్థానాలకు పోటీ చేసిన వైఎస్సార్ సీపీ 181, 228 స్థానాలకు పోటీ చేసిన సీపీఎం 77, 117 స్థానాలకు పోటీ చేసిన సీపీఐ 46, న్యూడెమోక్రసీ 30 పంచాయతీలను కైవసం చేసుకుంది.
ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధం
జిల్లాలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి సిద్ధంగా ఉన్నాం. ఇప్పటికే జిల్లాలో పోలింగ్ బూత్‌లను ఎంపిక చేయడంతోపాటు ఓటర్ల జాబితాను సిద్ధం చేశాం. ఎన్నికలు బ్యాలెట్ విధానంలో జరగాల్సి ఉండటంతో అందుకు అనుగుణంగా సిబ్బందిని సమకూర్చుకోవడంతోపాటు బ్యాలెట్ బాక్సులను సైతం ఇతర రాష్ట్రాల నుంచి తెప్పించాం. కొత్త పంచాయతీల్లో సైతం పోలింగ్ స్టేషన్లకు ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేశాం. – శ్రీనివాసరెడ్డి, డీపీఓ
Comments
Please login to add a commentAdd a comment