సాక్షి, రంగారెడ్డి జిల్లా: పల్లె పోరు ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలోని 22 గ్రామ పంచాయతీలకు ఆదివారం ఎన్నికలు నిర్వహించారు. గతేడాది జిల్లాలోని 650 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించగా నగర శివారు పంచాయతీలను జీహెచ్‌ఎంసీలో విలీనం చేసే క్రమంలో భాగంగా వీటి ఎన్నికలు నిలిపివేశారు. తాజాగా న్యాయస్థానం ఆదేశాలమేరకు పంచాయతీ ఎన్నికలు నిర్వహించారు. అయితే ఏడాది ఆలస్యంగా ఎన్నికలు నిర్వహించినప్పటికీ ఓటర్లు మాత్రం పెద్దగా ఆసక్తి చూపలేదు. దీంతో 22 పంచాయతీల పరిధిలో కేవలం 63.9శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది. ఆదివారం ఎన్నికలు జరిగిన పంచాయతీలన్నీ మహానగరానికి చేరువలో ఉన్నవే.
ఈ గ్రామాల్లో ఓటర్లంతా చైతన్యవంతులైనప్పటికీ పంచాయతీ ఎన్నికలకు మాత్రం ఓటు వేసేందుకు ఉత్సాహం చూపలేదు. కుత్బుల్లాపూర్ మండలం నిజాంపేట పంచాయతీలో అత్యల్పంగా 27.8శాతం ఓటింగ్ నమోదు కావడం గమనార్హం. అయితే రాజేంద్రనగర్ మండలం వట్టినాగులపల్లిలో అధికంగా 87.9% ఓటింగ్ నమోదైంది. ఆ తర్వాత ఖానాపూర్‌లో 87.8%, మంచిరేవుల పంచాయతీలో 87శాతం ఓట్లు పోలయ్యాయి. ఈ పంచాయతీల పరిధిలో ఉదయం 7గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. తొలి రెండు గంటల్లో 26.44శాతం ఓట్లు పోలవ్వగా, 11గంటల ప్రాంతంలో పోలింగ్ 51.25శాతంకు చేరింది. ఓటింగ్ పూర్తయ్యే సమయానికి 63.9శాతానికి చేరింది.
పల్లె పోరు ప్రశాంతం
Published Sun, Apr 13 2014 11:09 PM | Last Updated on Wed, Mar 28 2018 10:59 AM
Advertisement