ఫిబ్రవరిలోనే గ్రామ పంచాయతీ ఎన్నికలన్న సీఎం కేసీఆర్ ప్రకటనతో పల్లెల్లో రాజకీయం వేడెక్కింది. ఎక్కడ చూసినా పంచాయతీ ఎన్నికలపైనే చర్చించుకుంటున్నారు. పంచాయతీ వ్యవస్థలో సమూల మార్పులు చేస్తామని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నాటి నుంచే ఎన్నికలపై చర్చ మొదలైంది. పరోక్ష ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుండటంతో చర్చ జోరుగా సాగుతోంది.
సాక్షి, మహబూబాబాద్: గ్రామ పంచాయతీ ఎన్నికలపై రకరకాల చర్చ నడుస్తోంది. పరోక్ష ఎన్నికలతో పైసలున్నోళ్లే పోటీకి దిగుతారని కొందరు, సామాన్యులకు పంచాయతీ పదవుల కల అందని ద్రాక్షేనని మరికొందరు అనుకుంటున్నారు. మరోవైపు ఏ గ్రామానికి ఏ రిజర్వేషన్ వస్తుంది? ఏ రిజర్వేషన్ వస్తే ఎవరిని రంగంలోకి దింపాలంటూ రాజకీయ పార్టీలు సైతం లెక్కలేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆశావహులు ప్రజలకు దగ్గరవుతూ అంతర్గతంగా చర్చిస్తున్నారు. పార్టీలు మారడం, ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఏ పార్టీకి అనుకూలంగా ఉన్నాయో ఆరా తీస్తున్నారు. గ్రామ కూడళ్లలో, టీ కొట్ల వద్ద.. ఏ ఇద్దరు కలిసినా పంచాయతీ ఎన్నికల గురించే మాట్లాడుకుంటున్నారు. ప్రత్యక్ష ఎన్నికలు అనుకూలమా, పరోక్ష ఎన్నికలు అనుకూలమా అనే దానిపై కూడా ఆశావహులు ఆరా తీస్తున్నారు.
అంచనాల్లో రాజకీయ పార్టీలు
వచ్చే నెలలోనే పంచాయతీ ఎన్నికలు అని సీఎం కేసీఆర్ ప్రకటించడంతో అధికార టీఆర్‌ఎస్ పార్టీతో పాటు విపక్ష పార్టీలైనా కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, వైఎస్సార్‌సీపీ, వామపక్షాలు సైతం బిజీబిజీ అయ్యాయి. 2019లో జరిగే సార్వత్రిక ఎన్నికలకు పంచాయతీ ఎన్నికలు ప్రీఫైనల్‌గా అందరూ భావిస్తుండడంతో, ఇవి ఎవరికి లాభిస్తాయోనని లోతుగా ఆరా తీస్తున్నారు. పార్టీల గుర్తులపైనే ఎన్నికలు నిర్వహించేలా చట్టంలో మార్పులు చేస్తున్నామన్న ప్రభుత్వ కసరత్తుతో పార్టీలు సైతం అంచనాల్లో తలమునకలవుతున్నాయి. జిల్లాలోని మహబూబాబాద్, డోర్నకల్ నియోజకవర్గాలతోపాటు పాక్షికంగా ఉన్న ఇల్లందు, పాలకుర్తి, ములుగు నియోజకవర్గాల్లోనూ అంతా అధికార పార్టీ ఎమ్మెల్యేలే ఉండడంతో, పంచాయతీ ఎన్నికలపై కొంత ప్రభావం పడే అవకాశం ఉందని విశ్లేషిస్తున్నారు. ఇటు కాంగ్రెస్, బీజేపీలు సైతం పంచాయతీ ఎన్నికల కసరత్తులో నిమగ్నమయ్యాయి.
ఎన్నికలకు సిద్ధమవుతున్న అధికార యంత్రాంగం
ఫిబ్రవరిలోనే పంచాయతీ ఎన్నికలని సీఎం ప్రకటించడం, ప్రగతి భవన్‌లో జిల్లా పంచాయతీ అధికారులతో సీఎం సమీక్ష సమావేశమైన నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సిద్ధమవుతోంది. ఇందుకు అవసరమైన ఏర్పాట్లపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. జిల్లాలో మొత్తం 231 గ్రామపంచాయతీలు ఉండగా, 500 జనాభా దాటిన మరో 216 పంచాయతీల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ప్రభుత్వం రేపో, మాపో ఆమోదముద్ర వేస్తే కొత్త పంచాయతీలు ఆవిర్భవించనున్నాయి. పాత, కొత్త పంచాయతీలకు కలుపుకొని ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో, అధికారులు ఇందుకు సమాయత్తమవుతున్నారు. కాగా, ఇంకా గ్రామపంచాయతీల రిజర్వేషన్లు కూడా ఖరారు కాలేదు.
పరోక్ష పద్ధతిలో ఎన్నికలు నిర్వహిస్తే, రిజర్వేషన్లు ఎలా ఉంటాయనే దానిపై ఆసక్తి నెలకొంది. మహబూబాబాద్ మున్సిపాలిటీలో పరిసర 5 గ్రామపంచాయతీలను విలీనం చేసేందుకు కూడా ప్రభుత్వానికి ప్రతిపాదనలు వెళ్లాయి. వీటికి ప్రభుత్వం ఆమోదముద్ర వేయకపోవడంతో వీటిపై కూడా సందిగ్ధం నెలకొంది. దీనికితోడు తొర్రూరు, మరిపెడ, డోర్నకల్‌లను కూడా నగర పంచాయతీలుగా మార్చేందుకు ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. కానీ, వీటిపై ఇంతవరకు ఎలాంటి ఆదేశాలు వెలువడలేదు. వీటన్నింటి దృష్ట్యా ఎన్నికల నిర్వహణకు ఇంకా మరికొంత సమయం పడుతుందని అధికార వర్గాలు చెబుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment