
సాక్షి, హైదరాబాద్: రెండోవిడత గ్రామ పంచాయతీ ఎన్నికలు శుక్రవారం(నేడు) జరగనున్నాయి. మండల, గ్రామస్థాయిల్లో ఎన్నికల వ్యయపరిశీలకులు, మైక్రో అబ్జర్వర్లు, పోలీసు సోదాలు, నిఘా కొనసాగుతున్నా కిందిస్థాయిలో డబ్బు, మద్యం పంపిణీ యథేచ్ఛగా సాగుతున్నట్టు వార్తలొస్తున్నాయి. బుధవారం వరకు దాదాపు రూ. రెండున్నర కోట్ల విలువైన నగదు, మద్యం, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నట్టు రాష్ట్ర ఎన్నికల కమిషన్(ఎస్‌ఈసీ)కు పోలీసు శాఖ నివేదికలు సమర్పించిన విషయం తెలిసిందే.
అయితే, పోలీసులకు పట్టుబడిన డబ్బు, మద్యం నామమాత్రమేనని, రెండోవిడత ఎన్నికల నేపథ్యంలో ప్రలోభాల పర్వం కొనసాగుతున్నట్టుగా గ్రామస్థాయిల నుంచి సమాచారం వస్తోంది. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ ఉంటుంది. మధ్యాహ్నం రెండు గంటలకు ఓట్ల లెక్కింపు మొదలవుతోంది. ఈ ప్రక్రియ ముగియగానే ఫలితాలను ప్రకటిస్తారు. ఆ వెంటనే ఉపసర్పంచ్ ఎన్నిక ఉంటుంది. అనివార్య కారణాలతో ఉప సర్పంచ్ ఎన్నిక జరగకపోతే, మరుసటిరోజు దానిని నిర్వహించాల్సి ఉంటుందని ఎస్‌ఈసీ ఇదివరకే తెలియజేసింది.
ఎన్నికల విధుల నిర్వహణకు పెద్దసంఖ్యలో అధికారులు, సిబ్బందితోపాటు బం దోబస్తు కోసం 20 వేల మందికిపైగా పోలీసుల సేవలను వినియోగించుకుంటున్నారు. రెండోవిడత ఎన్నికల్లో భాగంగా 29,964 కేంద్రాల్లో పోలింగ్ నిర్వహిస్తున్నట్టు, 673 చోట్ల వెబ్ కాస్టింగ్ కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసినట్టు ఎస్‌ఈసీ వెల్లడించింది. ఓటింగ్ స్లిప్పులు అందనివారు టీపోల్ యాప్‌తో తమ ఓటరు స్లిప్పులను డౌన్‌లోడ్ చేసుకునే అవకాశాన్ని కూడా కమిషన్ కల్పించింది.
26,191 వార్డులకు ఎన్నికలు...
మూడు విడతలుగా జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో భాగంగా శుక్రవారం జరగనున్న రెండోదశలో మొత్తం 4,135 సర్పంచ్‌స్థానాలకు 783 మంది సర్పంచ్‌లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 36,602 వార్డు మెంబర్ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా 10,317 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. వీటిని మినహాయించాక మొత్తం 3,342 సర్పంచ్ స్థానాలకు 10,668 మంది, 26,191 వార్డులకు 63,480 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. రెండో విడతలో భాగంగా కోర్టు కేసులు, ఇతరత్రా కారణాలతో ఐదు పంచాయతీల్లో, 94 వార్డుల్లో ఎన్నికలు జరగడంలేదు.
మూడో విడతలో573 సర్పంచ్‌లు ఏకగ్రీవం
ఈ నెల 30న జరగనున్న మూడోదశ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి 373 సర్పంచ్ అభ్యర్థులు, 8,956 మంది వార్డుమెంబర్ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ఎస్‌ఈసీ తెలిపింది. ఈ ఎన్నికల్లో భాగంగా 4,116 గ్రామపంచాయతీలకు ఎన్నికలు నోటిఫై చేయగా 573 ఏకగ్రీవాలు కావడం, పది చోట్లా కోర్టు కేసులు, ఇతరత్రా కారణాలతో ఎన్నికలు జరగడంలేదు. ఈ నెల 22న నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిశాక మొత్తం 3,529 సర్పంచ్ స్థానాలకు 11,667 అభ్యర్థులు పోటీలో ఉన్నారు.
మూడో విడతలో మొత్తం 36,729 వార్డు మెంబర్ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా, వాటిలో 8,956 వార్డులు ఏకగ్రీవం కాగా, వివిధ కారణాలతో 185 చోట్ల ఎన్నికలు జరగడం లేదు. దీంతో మొత్తం 27,583 వార్డు మెంబర్ స్థానాలకు 67,516 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.