సాక్షి, అమరావతి: పోలీస్ శాఖ ఇప్పుడు నాలుగు ప్రధాన సవాళ్లను ఎదుర్కొంటోంది. గ్రామ పంచాయతీ ఎన్నికలు, ఆలయాలకు బందోబస్తు, వ్యాక్సిన్ భద్రత, రోజువారీ శాంతిభద్రతల నిర్వహణ.. ఇలా అన్నింటినీ ఒకేసారి సమర్థవంతంగా నిర్వహిస్తూ అందరి మన్ననలను పొందుతోంది. ప్రధానంగా రాష్ట్రంలో పథకం ప్రకారం జరిగిన దేవుడి విగ్రహాల ధ్వంసం కేసుల చిక్కుముడులను చాకచక్యంగా విప్పి శభాష్ అనిపించుకున్నారు. సున్నితమైన మతపరమైన అంశాల ద్వారా అలజడులు సృష్టించేందుకు పన్నిన కుట్రలను ఛేదించడమే కాకుండా.. ఆలయాలపై నిరంతర నిఘా పెట్టారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మతపరమైన సంస్థలు, ఆలయాలను గుర్తించి.. జియో ట్యాగింగ్ చేయడంతో పాటు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నారు. అలాగే కోవిడ్ వ్యాక్సిన్ భద్రతా చర్యలను కూడా పోలీసులే చేపట్టారు. వైద్య ఆరోగ్య, మున్సిపల్ తదితర సిబ్బందికి వేస్తున్న వ్యాక్సినేషన్ కార్యక్రమానికి బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఇదే సమయంలో హఠాత్తుగా వచ్చి పడిన పంచాయతీ ఎన్నికల విధులకు కూడా పోలీస్ శాఖ వెంటనే సిద్ధమైంది. నామినేషన్లు మొదలు.. ప్రచారం, పోలింగ్, కౌంటింగ్ తదితరాలన్నింటికీ బందోబస్తు నిర్వహిస్తూ గ్రామాల్లో ప్రశాంత వాతావరణం కొనసాగేలా చర్యలు తీసుకుంటోంది.
విధుల కోసం వ్యాక్సిన్ వాయిదా..
ఫ్రంట్‌లైన్ వారియర్స్ అయిన పోలీసు శాఖలోని దాదాపు 73 వేల మంది సిబ్బంది, 16 వేల మంది హోంగార్డులకు ఈ నెల 16 నుంచి వ్యాక్సినేషన్ వేయాలని అధికారులు తొలుత నిర్ణయించారు. కానీ వారికి వ్యాక్సిన్ వేస్తే నెల రోజులపాటు ఎలాంటి రియాక్షన్ లేకుండా పరిశీలనలో ఉంచాలి. అయితే రోజువారీ శాంతిభద్రతల నిర్వహణ, వ్యాక్సిన్ భద్రత, ఎన్నికల విధులకు విఘాతం కలుగుతుందని భావించిన అధికారులు, సిబ్బంది.. వ్యాక్సిన్ తీసుకునే కార్యక్రమాన్ని కూడా వాయిదా వేసుకున్నారు. కేంద్రం మార్గదర్శకాల ప్రకారం మార్చి 5లోపు వీరికి వ్యాక్సిన్ వేయాల్సి ఉంది.
పోలీసు సిబ్బందికి సలామ్ చేస్తున్నా..
త్యాగాలకు ఏపీ పోలీసులు వెనుకాడరనే విషయాన్ని మరోసారి రుజువు చేశారు. ప్రజా శ్రేయస్సు కోసం వ్యాక్సిన్ కూడా వాయిదా వేసుకొని.. సేవలందిస్తున్నందుకు పోలీస్ బాస్‌గా వారికి సలామ్ చేస్తున్నాను.
– డీజీపీ డి.గౌతమ్ సవాంగ్
కుటుంబ ఒత్తిడి.. అయినా బాధ్యత ముఖ్యం
కోవిడ్ విధులు మొదలైనప్పటి నుంచి కుటుంబసభ్యులు మా గురించి భయపడుతున్నారు. అయినా కూడా కుటుంబాలకు దూరంగా, ప్రాణాలకు తెగించి ప్రజల కోసం సేవలందిస్తున్నాం. 14,362 మంది పోలీసులు కోవిడ్ బారిన పడగా, 109 మందిని కోల్పోయాం. దీంతో కనీసం వ్యాక్సిన్ వేయించుకుంటే.. ప్రశాంతంగా ఉంటాం కదా అని కుటుంబసభ్యులు మా మీద ఒత్తిడి చేస్తున్నారు. అయినా ఎన్నికల తర్వాతే వ్యాక్సిన్ వేసుకోవాలనే నిర్ణయం తీసుకుని విధులు నిర్వహిస్తున్నాం.
–జె.శ్రీనివాసరావు, ఏపీ పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు
Comments
Please login to add a commentAdd a comment