ఆలయాలకు పోలీసు రక్ష | Police Protection For Temples | Sakshi
Sakshi News home page

ఆలయాలకు పోలీసు రక్ష

Published Sun, Nov 22 2020 3:25 AM | Last Updated on Sun, Nov 22 2020 3:25 AM

Police Protection For Temples - Sakshi

సాక్షి, అమరావతి: మతపరమైన అంశాలను వివాదం చేసి అలజడులు సృష్టించే ప్రయత్నాలకు చెక్‌ పెట్టడంలో ఏపీ పోలీసులు పక్కా కార్యాచరణతో ముందుకు సాగుతున్నారు. ఇందుకోసం రాష్ట్రంలోని దేవాలయాలు, చర్చిలు, మసీదుల వద్ద నిర్వాహకులే అప్రమత్తంగా మెలిగేలా పోలీసులు చర్యలు చేపట్టారు. వాటి బందోబస్తుతోపాటు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్త వహించేలా నిర్వాహకులకు పలు సూచనలు ఇచ్చారు. పోలీస్‌ శాఖ పరిధిలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటూనే మరోవైపు ఆలయాల నిర్వాహకులు, ట్రస్ట్‌బోర్డు సభ్యులు, ధర్మకర్తలకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటున్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని అనేక ఆలయాల వద్ద సీసీ కెమెరాలు, బందోబస్తు ఏర్పాట్లను పక్కాగా చేపట్టారు.

మతపరమైన సంస్థల విషయంలో పోలీస్‌ శాఖ తీసుకున్న చర్యలు ఇవీ..
► అన్ని ఆలయాల్లో అగ్నిమాపక జాగ్రత్తలు, భద్రతాపరమైన చర్యలు చేపట్టారు. 
► మొత్తంగా 57,270 మతపరమైన సంస్థలను గుర్తించి జియో ట్యాగింగ్‌తో మ్యాపింగ్‌ చేశారు.
► సంబంధిత 9,268 ప్రాంతాల్లో ఇప్పటివరకు 31వేల సీసీ కెమెరాలు అమర్చారు.
► ఈ ఏడాది సెప్టెంబర్‌ వరకు 33 ఆలయాల్లో జరిగిన నేరాలకు సంబంధించి 27 కేసుల్లో నిందితులతోపాటు తాజాగా నేరాలకు పాల్పడిన 130 మందిని అరెస్టు చేశారు. గతంలో  54 ఆలయాల్లో జరిగిన నేరాలపైనా చట్టపరమైన చర్యలు తీసుకున్నారు. 
► ప్రార్థనామందిరాల్లో నేరాలు, అలజడులు, విధ్వంసాలు చేసే అలవాటున్న 1,196 మందిని బైండోవర్‌ చేశారు. వారిపై హిస్టరీ షీట్లు తెరిచి నిఘా ఉంచారు.

ఎటువంటి ఘటనలు జరగకుండా చర్యలు
ప్రజల మత విశ్వాసాలకు సంబంధించిన ఆలయాల విషయంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టాం. ప్రజలను రెచ్చగొట్టి శాంతిభద్రతల సమస్య సృష్టించే శక్తులపై అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాం. ఇటీవల పరిణామాలను దృష్టిలో పెట్టుకుని పక్కా కార్యాచరణ చేపట్టాం. సీసీ కెమెరాల ఏర్పాటు, బందోబస్తు చర్యలతో ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాం. ఆలయాల వద్ద అలజడులు లేకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాం. 
– గౌతమ్‌ సవాంగ్, డీజీపీ 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement