Micro Observer
-
రెండో విడత ‘పంచాయతీ’ నేడే
సాక్షి, హైదరాబాద్: రెండోవిడత గ్రామ పంచాయతీ ఎన్నికలు శుక్రవారం(నేడు) జరగనున్నాయి. మండల, గ్రామస్థాయిల్లో ఎన్నికల వ్యయపరిశీలకులు, మైక్రో అబ్జర్వర్లు, పోలీసు సోదాలు, నిఘా కొనసాగుతున్నా కిందిస్థాయిలో డబ్బు, మద్యం పంపిణీ యథేచ్ఛగా సాగుతున్నట్టు వార్తలొస్తున్నాయి. బుధవారం వరకు దాదాపు రూ. రెండున్నర కోట్ల విలువైన నగదు, మద్యం, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నట్టు రాష్ట్ర ఎన్నికల కమిషన్(ఎస్ఈసీ)కు పోలీసు శాఖ నివేదికలు సమర్పించిన విషయం తెలిసిందే. అయితే, పోలీసులకు పట్టుబడిన డబ్బు, మద్యం నామమాత్రమేనని, రెండోవిడత ఎన్నికల నేపథ్యంలో ప్రలోభాల పర్వం కొనసాగుతున్నట్టుగా గ్రామస్థాయిల నుంచి సమాచారం వస్తోంది. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ ఉంటుంది. మధ్యాహ్నం రెండు గంటలకు ఓట్ల లెక్కింపు మొదలవుతోంది. ఈ ప్రక్రియ ముగియగానే ఫలితాలను ప్రకటిస్తారు. ఆ వెంటనే ఉపసర్పంచ్ ఎన్నిక ఉంటుంది. అనివార్య కారణాలతో ఉప సర్పంచ్ ఎన్నిక జరగకపోతే, మరుసటిరోజు దానిని నిర్వహించాల్సి ఉంటుందని ఎస్ఈసీ ఇదివరకే తెలియజేసింది. ఎన్నికల విధుల నిర్వహణకు పెద్దసంఖ్యలో అధికారులు, సిబ్బందితోపాటు బం దోబస్తు కోసం 20 వేల మందికిపైగా పోలీసుల సేవలను వినియోగించుకుంటున్నారు. రెండోవిడత ఎన్నికల్లో భాగంగా 29,964 కేంద్రాల్లో పోలింగ్ నిర్వహిస్తున్నట్టు, 673 చోట్ల వెబ్ కాస్టింగ్ కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసినట్టు ఎస్ఈసీ వెల్లడించింది. ఓటింగ్ స్లిప్పులు అందనివారు టీపోల్ యాప్‌తో తమ ఓటరు స్లిప్పులను డౌన్లోడ్ చేసుకునే అవకాశాన్ని కూడా కమిషన్ కల్పించింది. 26,191 వార్డులకు ఎన్నికలు... మూడు విడతలుగా జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో భాగంగా శుక్రవారం జరగనున్న రెండోదశలో మొత్తం 4,135 సర్పంచ్‌స్థానాలకు 783 మంది సర్పంచ్‌లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 36,602 వార్డు మెంబర్ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా 10,317 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. వీటిని మినహాయించాక మొత్తం 3,342 సర్పంచ్ స్థానాలకు 10,668 మంది, 26,191 వార్డులకు 63,480 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. రెండో విడతలో భాగంగా కోర్టు కేసులు, ఇతరత్రా కారణాలతో ఐదు పంచాయతీల్లో, 94 వార్డుల్లో ఎన్నికలు జరగడంలేదు. మూడో విడతలో573 సర్పంచ్‌లు ఏకగ్రీవం ఈ నెల 30న జరగనున్న మూడోదశ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి 373 సర్పంచ్ అభ్యర్థులు, 8,956 మంది వార్డుమెంబర్ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ఎస్ఈసీ తెలిపింది. ఈ ఎన్నికల్లో భాగంగా 4,116 గ్రామపంచాయతీలకు ఎన్నికలు నోటిఫై చేయగా 573 ఏకగ్రీవాలు కావడం, పది చోట్లా కోర్టు కేసులు, ఇతరత్రా కారణాలతో ఎన్నికలు జరగడంలేదు. ఈ నెల 22న నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిశాక మొత్తం 3,529 సర్పంచ్ స్థానాలకు 11,667 అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మూడో విడతలో మొత్తం 36,729 వార్డు మెంబర్ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా, వాటిలో 8,956 వార్డులు ఏకగ్రీవం కాగా, వివిధ కారణాలతో 185 చోట్ల ఎన్నికలు జరగడం లేదు. దీంతో మొత్తం 27,583 వార్డు మెంబర్ స్థానాలకు 67,516 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. -
మైక్రో అబ్జర్వర్లే కీలకం
ఖమ్మం కలెక్టరేట్, న్యూస్‌లైన్: సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపులో మైక్రో అబ్జర్వర్ల పాత్ర కీలకమని కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేష్ అన్నారు. స్థానిక జెడ్పీ మీటింగ్ హాల్లో గురువారం జిల్లా పరిషత్ మీటింగ్ హలులోసార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ సూక్ష్మపరి శీలకులకు శిక్షణ కార్యక్రమం నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 16న ఉదయం 5గంట లకు తమకు కేటాయించిన ఓట్ల లెక్కింపు కేంద్రాలకు వెళ్లి రిపోర్టు చేసి విధులకు హజరుకావాలని ఆదేశిం చారు. కౌంటింగ్ కోసం ఖమ్మం సమీపంలోని 7 లెక్కింపు కేంద్రాలు, కొత్తగూడెం పట్టణంలో 3 లెక్కింపు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వివరించారు. కౌంటింగ్ సజావుగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం సూచనల మేరకు ఒక పరిశీలకుడితో పాటు ప్రతి లెక్కింపు టేబుల్‌కు సూక్ష్మపరిశీలకుడు ఉంటారన్నారు. ఖమ్మంపార్లమెంట్ పరిశీలకులు జశ్వంత్‌సింగ్ మాట్లాడుతూ కౌంటింగ్ జరుగుతున్న తీరును అప్రమత్తంగా ఉండి గమనించాలన్నారు. సూక్ష్మపరి శీలకులు సెల్ఫోన్లు తీసుకెళ్లొద్దని సూచించారు. శిక్షణలో సాధారణ పరిశీ లకులు అశిశ్‌కుమార్‌ఘోష్, గోబిందచంద్రసేధి, లెక్కింపు కేంద్రాల పరిశీలకులు పాల్గొన్నారు. ఉదయం 8 గంటల నుంచి లెక్కింపు: కలెక్టర్ సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమవుతుందని కలెక్టర్ తెలి పారు. నియోజకవర్గాల వారీగా టేబుల్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఓట్ల లెక్కింపునకు ప్రత్యేక వెబ్సైట్ ఏర్పాటు చేశామన్నారు. కౌంటింగ్‌సిబ్బంది, సూపర్వైజర్లు, ఏజెంట్లు, అభ్యర్థులు నిర్ణీత సమయం కంటే అరగంట ముందు కేంద్రాలకు రావాలన్నారు. పోటీ చే సిన అభ్యర్థుల ఏజెంట్ల సమక్షంలో ఈవీఎంల ద్వారా కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభిస్తామన్నారు. ఓట్ల లెక్కింపులోఎలాంటి అనుమానాలకు తావీయకుండా సజావుగా జరిగేందుకు అందరూ సహకరించాలని కోరారు. -
కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తి
ఖమ్మం కలెక్టరేట్, న్యూస్‌లైన్ : సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి ఆయా కౌంటింగ్ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. ఈవీఎంలతో ఎన్నికలు నిర్వహించడంతో ఈ ప్రక్రియ మధ్యాహ్నానికి పూర్తయ్యే అవకాశాలున్నాయని అధికారులు చెపుతున్నారు. కౌంటింగ్ నిర్వహణకు ఆయా స్ట్రాంగ్ రూమ్‌ల పరిధిలోనే కేంద్రాలను ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక టేబుళ్లు, మెస్ ఏర్పాటు చేశారు. స్ట్రాంగ్ రూమ్ నుంచి ఈవీఎంలను కౌంటింగ్ కేంద్రాల వద్దకు తేవడం నుంచి లెక్కింపు ప్రక్రియ పూర్తయ్యేంత వరకు వీడియోగ్రఫీ నిర్వహించనున్నారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియను వెబ్ కెమెరాల ద్వారా చిత్రీకరిస్తారు. లెక్కింపు కోసం ఇప్పటికే సూపర్వైజర్లు, అసిస్టెంట్ సూపర్వైజర్లు, మైక్రో అబ్జర్వర్లు, వలంటీర్లను నియమించారు. కౌంటింగ్ ప్రక్రియపై ప్రత్యేక నిఘా ఉంచేందుకు కౌంటింగ్ అబ్జర్వర్లను సైతం ఎన్నికల సంఘం నియమించింది. జిల్లాలోని 10 అసెంబ్లీలకు 143 మంది అభ్యర్థులు, ఖమ్మం పార్లమెంట్ పరిధిలోని 27 మంది అభ్యర్థుల భవితవ్యం మధ్యాహ్నం వరకు తేలనుంది. పోలింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. కౌంటింగ్ సిబ్బందికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. కౌంటింగ్ సిబ్బందికి, మీడియాకు ప్రత్యేకంగా పాస్‌లు ఇచ్చారు. ఈ పాస్ ఉన్నవారిని మాత్రమే లోనికి అనుమతిస్తారు. ఖమ్మం పార్లమెంట్ ఫలితాలను విజయ ఇంజనీరింగ్ కళాశాల(తనికెళ్ల) వద్ద, కలెక్టరేట్లో వెల్లడించేందుకు ప్రత్యేకంగా డిస్ప్లే బోర్డులను ఏర్పాటు చేస్తున్నారు. ఖమ్మం పార్లమెంట్ పరిధిలో 14,39,983 మందికి గాను 11,79,136 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. మహబూబాబాద్ లోక్‌సభ పరిధిలోని ఇల్లెందు, పినపాక, భద్రాచలం నియోజకవర్గాల్లో 5,77,018 మందికి గాను 4,49,489 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. పది నియోజకవర్గాల పరిధిలో 253 రౌండ్ల ఓట్ల లెక్కింపు చేపట్టేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే అత్యధికంగా సత్తుపల్లి నియోజకవర్గంలో 36 రౌండ్ల ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు. దీని ప్రకారం ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గానికి 36 రౌండ్లలో ఓట్ల లెక్కింపు ప్రక్రియను పూర్తి చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. కౌంటింగ్ కేంద్రాలు ఇవే... ఖమ్మంలోని సెయింట్ జోసఫ్ స్కూల్లో ఖమ్మం అసెంబ్లీ, మౌంట్‌ఫోర్ట్ పాఠశాలలో పాలేరు, ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్ డిగ్రీ కళాశాలలో కొత్తగూడెం, తనికెళ్లలోని విజయ ఇంజనీరింగ్ కళాశాలలో మధిర, అశ్వారావుపేట, సత్తుపల్లి, బ్రౌన్స్ కళాశాలలో వైరా నియోజకవర్గాల ఓట్లు లెక్కిస్తారు. కొత్తగూడెంలోని సింగరేణి మహిళా కళాశాలలో ఇల్లెందు, పినపాక, భద్రాచలం నియోజకవర్గాల ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు చేశారు. ఖమ్మం పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని కౌంటింగ్ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ఉంటుంది. కౌంటింగ్ ప్రక్రియ ఇలా... కౌంటింగ్ ప్రక్రియకు ముందు పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు. రిటర్నింగ్ అధికారి టేబుల్ మీద పోస్టల్ బ్యాలెట్ పత్రాల గణన జరుగుతుండగా, ఓటింగ్ యంత్రాల ద్వారా పోలింగ్ స్టేషన్లలో నమోదైన ఓట్ల లెక్కింపును కౌంటింగ్ హాలులో ఉన్న ఇతర టేబుళ్ల వద్ద అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు చేపడతారు. ఇందుకోసం పోలింగ్ స్టేషన్ నుంచి వచ్చిన ఓటింగ్ యంత్రాల కంట్రోల్ యూనిట్లను లెక్కింపు టేబుళ్ల వద్దకు తెస్తారు. మొదటి పోలింగ్ స్టేషన్ ఓటింగ్ యంత్రపు కంట్రోల్ యూనిట్‌ను మొదటి టేబుల్‌తో మొదలై... రెండో పోలింగ్ స్టేషన్ ఓటింగ్ యంత్రపు కంట్రోల్ యూనిట్ రెండో టేబుల్‌కు... ఇలా కొనసాగుతుంది. ప్రతి లెక్కింపు బల్ల వద్ద ఒక పోలింగ్ స్టేషన్లో పోలయిన ఓట్ల లెక్కింపు ఒకేసారి చేపడతారు. ఉన్న లెక్కింపు బల్లల సంఖ్యను బట్టి అన్ని పోలింగ్ స్టేషన్ల ఓట్ల లెక్కింపు ఏకకాలంలో మొదటి రౌండ్ లెక్కింపుగా చేపడతారు. అంటే ఒక నియోజకవర్గానికి 12 టేబుళ్లను ఏర్పాటు చేస్తే ఒకే రౌండ్లో 12 ఈవీఎంలలో పోలైన ఓట్లను లెక్కిస్తారన్నమాట. లెక్కింపు బల్లల సంఖ్య పోలింగ్ స్టేషన్ల సంఖ్యను పరిగణనలోకి తీసుకుని అవసరమైన రౌండ్లలో గణన జరిగి లెక్కింపు పూర్తవుతుంది. అభ్యర్థుల్లో ఉత్కంఠ... ఎన్నికలు జరిగిన ఏప్రిల్ 30 నుంచి ఫలితాల కోసం వేచి ఉన్న అభ్యర్థులు, కార్యకర్తలతోపాటు ప్రజల ఉత్కంఠకు నేటితో తెరపడనుంది. ఈ దఫా ఎన్నడూ లేని విధంగా బహుముఖ పోటీ నెలకొనడంతో అభ్యర్థుల్లో ఒకింత ఆందోళన నెలకొంది. ఫలితాలు ఏ మలుపు తిరుగుతాయి... క్రాస్ ఓటింగ్ జరిగిందా అనే అనుమానాలతో అభ్యర్థులకు కంటిమీద కునుకు లేకుండా పోయింది. -
నేటితో ప్రచారానికి తెర
- మూగబోనున్న మైకులు - పంపకాలకు సిద్ధమవుతున్న నేతలు - తుది దశకు చేరిన ‘సార్వత్రిక’ సమరం హన్మకొండ, న్యూస్‌లైన్ : సార్వత్రిక ఎన్నికల సమరం తుది ఘట్టానికి చేరింది. దాదాపు రెండు నెలలుగా జిల్లాలో కొనసాగుతున్న ఎన్నికల ప్రచారానికి సోమవారం సాయంత్రం 5 గంటలకు తెరపడనుంది. ఇప్పటివరకు ప్రచార రథాలు... మైకుల మోతలు.. కళాకారుల ఆటపాటలు... పార్టీల అధినేతల పర్యటనలతో సందడిగా మారిన పట్టణాలు, పల్లెలు నిశ బ్దంగా మారనున్నాయి. ఈనెల 30న జరుగనున్న ఎన్నికల ప్రచార ఘట్టం సోమవారంతో ముగుస్తుండడంతో అన్ని పార్టీల అభ్యర్థులు ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే పనిలో పడ్డారు. పగలంతా ప్రచారం చేస్తున్న నేతలు... రాత్రిపూట ఓటర్లకు తాయిలాలు అందిస్తూ వారిని మచ్చిక చేసుకుంటున్నారు. ప్రధాన పార్టీల నుంచి పోటీ పడుతున్న అభ్యర్థులు ఈ ఎన్నికల్లో కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలిసింది. ఆయా అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి ఒక్కో అభ్యర్థి రూ. 2 నుంచి 5 కోట్ల వరకు ఖర్చు పెడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక ఎన్నికల అధికారులు కూడా ఇప్పుడు అభ్యర్థులు, వారి పెట్టే ఖర్చు, ఓటర్లకు ప్రలోభాల అంశంపైనే దృష్టి పెట్టారు. నిన్నటి వరకు అక్కడా... ఇక్కడా తిరిగిన అధికారులు ఇప్పుడు నియోజకవర్గాల్లో మకాం పెట్టారు. ఎన్నికల నిర్వహణ అధికారులు, మైక్రో అబ్జర్వర్లు, పరిశీలకులు సెగ్మెంట్లకు వచ్చే ప్రతీ వాహనాన్ని తనిఖీ చేస్తున్నారు. ఇదిలా ఉండగా, సెగ్మెంట్లలో ఇన్ని రోజులు ప్రచారం చేసిన స్థానికేతర నేతలు తమ తమ ప్రాంతాలకు వెళ్లిపోవాలంటూ ఆదేశాలు జారీ చేశారు. స్థానికేతర నేతలు సెగ్మెంట్లలో ఉంటే అభ్యర్థులదే పూర్తి బాధ్యత అని, వారిపై కేసులు నమోదు చేస్తామంటూ హెచ్చరికల నోటీసులు జారీ చేశారు. ఓటర్లకు వల.. ఎన్నికలు దగ్గర పడడంతో అభ్యర్థులంతా క్షణం తీరిక లేకుండా ఓట్లు రాబట్టుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. ఇప్పటికే ఇంటింటి ప్రచారం పూర్తి చేసుకున్న నేతలు... ఇప్పుడు గంపగుత్త ఓట్ల కోసం ప్రణాళికలు వేసుకుంటున్నారు. ఇందులో భాగంగానే రాత్రిపూట గ్రామాలు, మండలాలు, డివిజన్ల వారీగా నేతలు, ముఖ్య కార్యకర్తలు, కాలనీలు, గ్రామ పెద్దలతో సమావేశమై తమకు పడే ఓట్లు ఎన్ని.. వాటికి ఎంత ఖర్చు చేయాలనే విషయంపై చర్చించి ఒప్పందాలు చేసుకుంటున్నారు. అయితే ఒప్పందం కుదిరిన తర్వాత ప్రలోభాల మూటలను పంపిస్తూ హామీలను లిఖిత పూర్వకంగా రాసిస్తూ ఓట్లను తమ ఖాతాల్లో వేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా, ఎన్నికల అధికారులకు చిక్కకుండా అభ్యర్థులు ప్రలోభాల పాట్లు పాట్లు పడుతున్నారు. ఎన్నికల పరిశీలకులు డేగకళ్లతో నిఘా పెట్టినా... ప్రలోభాలు మాత్రం జోరుగా సాగుతూనే ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా, ఈసారి క్రీడా సామగ్రి, చీరెలు, వస్తువులను కాకుండా... నగదు రూపంలోనే ఓటర్లకు ఎక్కువ పంపిణీ చేస్తున్నట్లు సమాచారం. కాగా, కొన్ని ప్రాంతాల్లో కుల, యువజన సంఘాలకు లక్షల్లో ముట్టజెప్పుతున్నారు. వారి సంఘం పేరిట నగదును మధ్యవర్తుల వద్ద పెడుతున్నారు. పోలింగ్ తర్వాత వారికి పడిన ఓట్లను అంచనా వేసుకుని వాటిని వారికి అప్పగించే విధంగా ఒప్పందాలు చేసుకుంటున్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో పెట్టిన ఖర్చు కంటే ఈసారి ఒక్కో సెగ్మెంట్లో అదనంగా 40 శాతం ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తుం దని పార్టీల అభ్యర్థులే బాహాటంగా చెబుతుండడం గమనార్హం. -
ఎన్నికలు సమర్థంగా నిర్వహించండి
విజయనగరం మున్సిపాలిటీ, న్యూస్‌లైన్: రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఈ నెల 30న జరగనున్న పురపాలక సంఘ ఎన్నికలను పారదర్శకంగానూ, సమర్థంగా నిర్వహించాలని ఎన్నికల పరిశీలకుడు ధనుంజయరెడ్డి ఆదేశిం చారు. విజయనగరంలోని రాజీవ్ క్రీడా మైదానంలో ఎన్నికల సిబ్బందికి ఈవీఎంలపైన ఇస్తున్న శిక్షణను ఆదివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పోలింగ్ రోజున రాజకీయ పార్టీల ఏజెంట్ల సమక్షంలో ఈవీవిఎం యూనిట్లను పరిశీలించి ఓటింగ్‌కు సిద్ధం చేయాలన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో వెబ్ కాస్టింగ్, వీడియోగ్రఫీ, మైక్రో అబ్జర్వర్లలో ఏదో ఒకటి ఉండేలా చర్యలు చేపట్టాల న్నారు. పకడ్బందీగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల ప్రవర్తనా నియామవళి పకడ్బందీగా అమలుచేయాలని ధనుంజయ్ రెడ్డి ఆదేశించారు. ఎన్నిక ల వ్యయానికి సంబంధించిన నివేదికలు అభ్యర్థిపరంగా పారదర్శకంగా నివేదించాలన్నారు. ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలు, ఎన్నికల వ్యయంపై ఫిర్యాదులను 9177745658 నంబరుకు ఫోన్ చేసి నేరుగా తనను సంప్రదించవచ్చన్నారు. కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ బి.రామారావు, ఏజేసీ యూసీజీ నాగేశ్వరరావు, ఆర్డీఓ జె.వెంకటరావు, పోలింగ్ సిబ్బంది పాల్గొన్నారు.