ఖమ్మం కలెక్టరేట్, న్యూస్‌లైన్ : సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి ఆయా కౌంటింగ్ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. ఈవీఎంలతో ఎన్నికలు నిర్వహించడంతో ఈ ప్రక్రియ మధ్యాహ్నానికి పూర్తయ్యే అవకాశాలున్నాయని అధికారులు చెపుతున్నారు. కౌంటింగ్ నిర్వహణకు ఆయా స్ట్రాంగ్ రూమ్‌ల పరిధిలోనే కేంద్రాలను ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక టేబుళ్లు, మెస్ ఏర్పాటు చేశారు.
స్ట్రాంగ్ రూమ్ నుంచి ఈవీఎంలను కౌంటింగ్ కేంద్రాల వద్దకు తేవడం నుంచి లెక్కింపు ప్రక్రియ పూర్తయ్యేంత వరకు వీడియోగ్రఫీ నిర్వహించనున్నారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియను వెబ్ కెమెరాల ద్వారా చిత్రీకరిస్తారు. లెక్కింపు కోసం ఇప్పటికే సూపర్‌వైజర్లు, అసిస్టెంట్ సూపర్‌వైజర్లు, మైక్రో అబ్జర్వర్లు, వలంటీర్లను నియమించారు. కౌంటింగ్ ప్రక్రియపై ప్రత్యేక నిఘా ఉంచేందుకు కౌంటింగ్ అబ్జర్వర్లను సైతం ఎన్నికల సంఘం నియమించింది. జిల్లాలోని 10 అసెంబ్లీలకు 143 మంది అభ్యర్థులు, ఖమ్మం పార్లమెంట్ పరిధిలోని 27 మంది అభ్యర్థుల భవితవ్యం మధ్యాహ్నం వరకు తేలనుంది.
పోలింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. కౌంటింగ్ సిబ్బందికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. కౌంటింగ్ సిబ్బందికి, మీడియాకు ప్రత్యేకంగా పాస్‌లు ఇచ్చారు. ఈ పాస్ ఉన్నవారిని మాత్రమే లోనికి అనుమతిస్తారు. ఖమ్మం పార్లమెంట్ ఫలితాలను విజయ ఇంజనీరింగ్ కళాశాల(తనికెళ్ల) వద్ద, కలెక్టరేట్‌లో వెల్లడించేందుకు ప్రత్యేకంగా డిస్‌ప్లే బోర్డులను ఏర్పాటు చేస్తున్నారు. ఖమ్మం పార్లమెంట్ పరిధిలో 14,39,983 మందికి గాను 11,79,136 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.
మహబూబాబాద్ లోక్‌సభ పరిధిలోని ఇల్లెందు, పినపాక, భద్రాచలం నియోజకవర్గాల్లో 5,77,018 మందికి గాను 4,49,489 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. పది నియోజకవర్గాల పరిధిలో 253 రౌండ్ల ఓట్ల లెక్కింపు చేపట్టేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే అత్యధికంగా సత్తుపల్లి నియోజకవర్గంలో 36 రౌండ్ల ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు. దీని ప్రకారం ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గానికి 36 రౌండ్లలో ఓట్ల లెక్కింపు ప్రక్రియను పూర్తి చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.
కౌంటింగ్ కేంద్రాలు ఇవే...
ఖమ్మంలోని సెయింట్ జోసఫ్ స్కూల్‌లో ఖమ్మం అసెంబ్లీ, మౌంట్‌ఫోర్ట్ పాఠశాలలో పాలేరు, ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్ డిగ్రీ కళాశాలలో కొత్తగూడెం, తనికెళ్లలోని విజయ ఇంజనీరింగ్ కళాశాలలో మధిర, అశ్వారావుపేట, సత్తుపల్లి, బ్రౌన్స్ కళాశాలలో వైరా నియోజకవర్గాల ఓట్లు లెక్కిస్తారు. కొత్తగూడెంలోని సింగరేణి మహిళా కళాశాలలో ఇల్లెందు, పినపాక, భద్రాచలం నియోజకవర్గాల ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు చేశారు. ఖమ్మం పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని కౌంటింగ్ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ఉంటుంది.
కౌంటింగ్ ప్రక్రియ ఇలా...
కౌంటింగ్ ప్రక్రియకు ముందు పోస్టల్ బ్యాలెట్‌లను లెక్కిస్తారు. రిటర్నింగ్ అధికారి టేబుల్ మీద పోస్టల్ బ్యాలెట్ పత్రాల గణన జరుగుతుండగా, ఓటింగ్ యంత్రాల ద్వారా పోలింగ్ స్టేషన్‌లలో నమోదైన ఓట్ల లెక్కింపును కౌంటింగ్ హాలులో ఉన్న ఇతర టేబుళ్ల వద్ద అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు చేపడతారు. ఇందుకోసం పోలింగ్ స్టేషన్ నుంచి వచ్చిన ఓటింగ్ యంత్రాల కంట్రోల్ యూనిట్లను లెక్కింపు టేబుళ్ల వద్దకు తెస్తారు. మొదటి పోలింగ్ స్టేషన్ ఓటింగ్ యంత్రపు కంట్రోల్ యూనిట్‌ను మొదటి టేబుల్‌తో మొదలై... రెండో పోలింగ్ స్టేషన్ ఓటింగ్ యంత్రపు కంట్రోల్ యూనిట్ రెండో టేబుల్‌కు... ఇలా కొనసాగుతుంది.
ప్రతి లెక్కింపు బల్ల వద్ద ఒక పోలింగ్ స్టేషన్‌లో పోలయిన ఓట్ల లెక్కింపు ఒకేసారి చేపడతారు. ఉన్న లెక్కింపు బల్లల సంఖ్యను బట్టి అన్ని పోలింగ్ స్టేషన్‌ల ఓట్ల లెక్కింపు ఏకకాలంలో మొదటి రౌండ్ లెక్కింపుగా చేపడతారు. అంటే ఒక నియోజకవర్గానికి 12 టేబుళ్లను ఏర్పాటు చేస్తే ఒకే రౌండ్‌లో 12 ఈవీఎంలలో పోలైన ఓట్లను లెక్కిస్తారన్నమాట. లెక్కింపు బల్లల సంఖ్య పోలింగ్ స్టేషన్‌ల సంఖ్యను పరిగణనలోకి తీసుకుని అవసరమైన రౌండ్లలో గణన జరిగి లెక్కింపు పూర్తవుతుంది.
అభ్యర్థుల్లో ఉత్కంఠ...
ఎన్నికలు జరిగిన ఏప్రిల్ 30 నుంచి ఫలితాల కోసం వేచి ఉన్న అభ్యర్థులు, కార్యకర్తలతోపాటు ప్రజల ఉత్కంఠకు నేటితో తెరపడనుంది. ఈ దఫా ఎన్నడూ లేని విధంగా బహుముఖ పోటీ నెలకొనడంతో అభ్యర్థుల్లో ఒకింత ఆందోళన నెలకొంది. ఫలితాలు ఏ మలుపు తిరుగుతాయి... క్రాస్ ఓటింగ్ జరిగిందా అనే అనుమానాలతో అభ్యర్థులకు కంటిమీద కునుకు లేకుండా పోయింది.
కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తి
Published Fri, May 16 2014 2:24 AM | Last Updated on Sat, Sep 2 2017 7:23 AM
Advertisement
Advertisement