
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల : పంచాయతీ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నప్పటికీ... రిజర్వేషన్లు ఖరారు కాకపోవడంతో నీలినీడలు కమ్ముకుంటున్నాయి. అదే సమయంలో ఢిల్లీ నుంచి రాష్ట్ర రాజధాని వరకు ముందస్తు సాధారణ ఎన్నికలపై పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ఈ పరిస్థితుల్లో పంచాయతీల కన్నా ముందే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు నిర్వహిస్తేనే మేలని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని అధికార, విపక్ష పార్టీల నాయకులు భావిస్తున్నారు. ఈ మేరకు అన్ని పార్టీల ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్‌చార్జిలు ‘ముందస్తు’ కోసం ఇప్పటి నుంచే కసరత్తు మొదలుపెట్టారు. ప్రచారంలో ఉన్నట్లు ఈ సంవత్సరం డిసెంబర్‌లోగా శాసనసభ, పార్లమెంటు ఎన్నికలు నిర్వహిస్తే తమకు కలిసి వస్తుందన్న ధీమాతో అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నారు. ఈ మేరకు వారు బాహాటంగానే జమిలి ఎన్నికలకు సై అంటుండడం గమనార్హం.
కాంగ్రెస్, బీజేపీ నేతలు సైతం గత కొంతకాలంగా ముందస్తు ఎన్నికలు జరుగుతాయనే భావనతోనే తమకు పట్టున్న ప్రాంతాలపై దృష్టి పెట్టి ఓటర్లను ఆకర్షించే ప్రయత్నాల్లో ఉన్నారు. పంచాయతీ ఎన్నికలు ముందు జరిగితే అధికార పార్టీ కొంత బలహీనపడి, సాధారణ ఎన్నికల నాటికి తమకు కలిసి వస్తుందని విపక్షాలు తొలుత భావించాయి. అయితే గ్రామ స్థాయిలో బలంగా ఉన్న టీఆర్‌ఎస్‌కే పంచాయతీ ఎన్నికలతో లాభమని లెక్కలేసుకున్నారు. పంచాయతీలను స్వీప్ చేసినట్లు ప్రచారం జరిగితే మొదటికే మోసం వస్తుందనే నిర్ణయానికి వచ్చిన కాంగ్రెస్, బీజేపీ, టీజేఎస్ వంటి పార్టీలు ముందస్తు ఎన్నికలకే సై అంటున్నాయి. ఈ మేరకు అన్ని నియోజకవర్గాల్లో అధికార, విపక్ష పార్టీల అంతర్గత ప్రచారం మొదలైంది. బీసీ, దళిత, గిరిజన వర్గాల నేతలు కూడా తమ హక్కుల పేరిట జనంలోకి వెళ్లే ప్రయత్నాలను ముమ్మరం చేశారు.
జనంలోకి ప్రజాప్రతినిధులు
ఉమ్మడి ఆదిలాబాద్‌లోని నాలుగు జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇటీవలి కాలంలో తరచూ ప్రజలతో మమేకమయ్యేందుకు ఎక్కువ సమయాన్ని కేటాయిస్తున్నారు. తమ తమ నియోజకవర్గాల్లో జరిగే పెళ్లిళ్లు, శుభకార్యాలకు ఠంఛనుగా హాజరవుతున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతుబంధు పథకాన్ని చాలా వరకు తమకు అనుకూలంగా మలుచుకొని సద్విని యోగం చేసుకున్నారు.
నియోజకవర్గాల్లోని పెండింగ్ పనులను క్లియర్
చేయించుకునే బిజీలో పడ్డారు. వివాదాస్పద అంశాల జోలికి వెళ్లకుండా రాబోయే ఎన్నికల నాటికి తమ గ్రాఫ్‌ను పెంచుకునే ప్రయత్నాల్లో మునిగారు. మంచిర్యాల జిల్లాలో ప్రభుత్వ విప్ నల్లాల ఓదెలు, ఎమ్మెల్యేలు నడిపెల్లి దివాకర్‌రావు, దుర్గం చిన్నయ్య పూర్తిగా నియోజకవర్గంపైనే దృష్టి పెట్టి ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తున్నారు. సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ఎక్కువ దృష్టి పెడుతూనే పెండింగ్ ప్రాజెక్టు సిర్పూర్ పేపర్ మిల్స్‌ను పునఃప్రారంభం ఎక్కువ దృష్టి పెట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రాయితీలతో గుజరాత్‌కు చెందిన జేకే మిల్స్ ఎస్‌పీఎంను టేకోవర్ చేసుకునేలా తన వంతు పాత్ర పోషించారు. ఎన్నికల లోపు జేకే పేపర్‌మిల్స్ నుంచి కీలక ప్రకటన రావచ్చని భావిస్తున్నారు.
ఆదిలాబాద్‌లో మంత్రి జోగు రామన్న, నిర్మల్‌లో మరో మంత్రి అల్లోల్ల ఇంద్రకరణ్‌రెడ్డి సైతం సమయం దొరికితే నియోజకవర్గాల్లో గడుపుతున్నారు. ఈ రెండు నియోజకవర్గాల్లో వివాదాస్పద అంశాలేవీ తెరపైకి రాకుండా ఇప్పటికే అనుచర వర్గానికి స్పష్టమైన ఆదేశాలు వెళ్లాయి. ముధోల్‌లో ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి నియోజకవర్గానికే పరిమితమై వచ్చే ఎన్నికల్లో మరోసారి తన సత్తా చాటాలనే ఆలోచనతో ఉన్నారు. ఖానాపూర్, బోథ్, ఆసిఫా బాద్‌లలో ఆదివాసీ సమస్య తీవ్ర రూపం దాల్చడంతో ఎమ్మెల్యేలు సంయమనంతో వ్యవహరిస్తున్నారు. ఈ నియోజకవర్గాల్లో సొంత పార్టీల్లో ఉన్న అసంతృప్తిని చల్లబరుచుకోవడమే పనిగా మారింది.
సన్నద్ధమవుతున్న విపక్షాలు
కేంద్రంలో మోదీ ప్రభుత్వం ఆలోచనలకు అనుగుణంగా రాష్ట్రంలో టీఆర్‌ఎస్ కూడా ముందస్తు ఎన్నికలకు సిద్ధమవుతుండడంతో అన్ని నియోజకవర్గాల్లో ప్రతిపక్షపార్టీలు కూడా తమ కార్యకలాపాలను పెంచాయి. కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే టిక్కెట్ల కోసం పోటీపడుతున్న నాయకులు ఎవరికి వారే ఆయా నియోజకవర్గాల్లో తమ బలం పెంచుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. డీసీసీ అధ్యక్షుడు మహేశ్వర్‌రెడ్డి నిర్మల్ నియోజకవర్గంలో విస్తృత స్థాయిలో కార్యక్రమాలు చేపడుతున్నారు. అదే సమయంలో తూర్పున ఐదు నియోజకవర్గాల్లో బస్సు యాత్ర నిర్వహించడం ద్వారా తన సత్తా చాటుకున్నారు. మంచిర్యాలలో మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేంసాగర్‌రావు పల్లె, పట్టణం తేడా లేకుండా తనదైన శైలిలో ప్రజల మధ్యకు వెళుతున్నారు.
పార్టీలో గ్రూపులతో సంబంధం లేకుండా వచ్చే ఎన్నికల్లో పార్టీ టిక్కెట్టుతో పోటీ చేయడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. ఆసిఫాబాద్‌లో ఆత్రం సక్కు, బోథ్‌లో సోయం బాపూరావు ఆదివాసీ అంశాన్ని భుజాన వేసుకొని వచ్చే ఎన్నికల్లో బలమైన పోటీదారులుగా తయారయ్యారు. ఆదిలాబాద్‌లో ముగ్గురు నేతలు టిక్కెట్టు ప్రయత్నాల్లో ఎవరికి వారే గ్రౌండ్ తయారు చేసుకొంటున్నారు. చెన్నూరులో కూడా కాంగ్రెస్ టిక్కెట్టుకు ఇటీవల కాలంలో పోటీ పెరిగింది. బెల్లంపల్లిలో కాంగ్రెస్ యంత్రాంగం పటిష్టంగానే ఉన్నా, ధీటైన నాయకుడి కోసం ఎదురుచూస్తున్నారు. సిర్పూర్‌లో ముగ్గురు నాయకులు టిక్కెట్టు రేసులో ఉన్నారు. ఇక్కడ స్థానిక, స్థానికేతర నినాదాన్ని తీసుకొస్తున్నారు.
అమిత్‌షా, మోదీలపైనే బీజేపీ భారం
దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలన్నీ ఒకేసారి నిర్వహించాలన్న ప్రధాని మోదీ నిర్ణయం తమకు అనుకూలంగా మారుతుందని స్థానిక బీజేపీ నాయకులు కూడా భావిస్తున్నారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో చక్రం తిప్పిన అమిత్‌షా, మోదీ రాష్ట్రంలో కూడా సత్తా చూపుతారన్న ఆశతో ఉన్నారు. అయినా నియోజకవర్గాల్లో పర్యటించే కార్యక్రమాన్ని నేతలు మొదలుపెట్టారు. మంచి ర్యాలలో ముల్కల్ల మల్లారెడ్డి, బెల్లంపల్లిలో కొ య్యల ఏమాజీ పల్లె నిద్ర, పాదయాత్రలతో జనం మధ్యకు వెళుతున్నారు. నిర్మల్, ముథోల్, ఆదిలా బాద్‌లలో కూడా బీజేపీ తన ఉనికిని చాటుకుం టుండడం కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపుతోంది.
టీజేఎస్‌లో అయోమయం
ముందస్తు ఎన్నికల ప్రచారంతో ప్రొఫెసర్ కోదండరాం నేతృత్వంలోని టీజేఎస్ కొంత అయోమయంలో పడింది. పార్టీకి సంస్థాగతంగా యం త్రాంగం తయారు కాని పరిస్థితుల్లో కేవలం ఉద్య మ కార్డుతోనే ఎన్నికలకు పోతే ఎలాంటి ఫలి తాలు వస్తాయోననే మీమాంసలో ఆయా నియోజకవర్గాల నాయకులు ఉన్నారు. కాంగ్రెస్, ఇతర కలిసివచ్చే పార్టీలతో పొత్తు ఉంటే ఫలితాలు వేరేగా ఉంటాయని మంచిర్యాలకు చెందిన ఓ నాయకుడు ‘సాక్షి’తో వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment