
నారాయణఖేడ్: కొత్త రిజర్వేషన్ల ప్రకారమే గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు పంచాయతీరాజ్ శాఖ సన్నాహాలు చేస్తోంది. సర్పంచ్‌ల పదవీకాలం ముగియడంతో ప్రత్యేక అధికారులు, పంచాయతీ కార్యదర్శుల ఆధ్వర్యంలో పాలన కొనసాగుతోంది. వచ్చే జనవరి 10వ తేదీలోగా గ్రామ పంచాయతీ ఎన్నికలు పూర్తి చేయాలని హైకోర్టు స్పష్టం చేయడంతో పంచాయతీరాజ్‌శాఖ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు ప్రారంభించింది. ఎన్నికలు ముందుకు సాగాలంటే మొదట రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తిచేయాల్సి ఉంటుంది. రిజర్వేషన్లు 50శాతానికి మించకుండా ఉండాలని హైకోర్టు తీర్పు ఇవ్వడం, ఆ తీర్పును ఇటీవల సుప్రీంకోర్టు ధ్రువీకరించడం తెలిసిందే. దీంతో పంచాయతీల రిజర్వేషన్లు ఖరారు చేయడానికి పంచాయతీరాజ్ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగా ఈనెల 15న కులాల గణన పూర్తిచేసి కులాల వారీగా ఓటర్లను గుర్తించారు.
ఇప్పటికే ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాల వారీగా ఓటర్లను గుర్తించిన అధికారులు బీసీ గణనను ఈనెల 15న పూర్తి చేశారు. ఈమేరకు రిజర్వేషన్లను పరిశీలించిన మీదట కొత్తవి ప్రకటించనున్నారు. 1995 నుంచి రిజర్వేషన్ విధానం అమలులోకి రాగా జనాభా ఆధారంగా మండల యూనిట్‌గా రిజర్వేషన్ ఖరారు చేస్తున్నారు. జనరల్, జనరల్ మహిళ, బీసీ, బీసీ మహిళ, ఎస్సీ, ఎస్సీ మహిళ, ఎస్టీ, ఎస్టీ మహిళ కేటగిరీలు ఉండేలా రిజర్వేషన్లు ఖరారు చేస్తారు. ఉమ్మడి రాష్ట్రంలో 1995, 2001, 2006, 2013లో పంచాయతీ ఎన్నికలు జరిగాయి. ఇప్పటివరకు గ్రామాలన్నింటికీ నాలుగు కేటగిరీల్లో రిజర్వేషన్లు వర్తించాయి. మరో నాలుగు కేటగిరీల్లో రిజర్వేషన్లు అమలు చేయాల్సి ఉండగా ఇప్పుడు అవేమీ వర్తించవు. కొత్త పంచాయతీరాజ్ చట్టం, కొత్త గ్రామాల ఏర్పాటుతో ఈ మార్పు అనివార్యమైంది. ఒక గ్రామానికి జనరల్ మహిళ రిజర్వేషన్ ఉంటే తిరిగి ఆ రిజర్వేషన్ వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
50శాతం మహిళలకు..
జిల్లాలో ఉన్న పంచాయతీల సంఖ్యను పరిగణనలోకి తీసుకొని అందులో 50శాతం పంచాయతీలను మహిళలకు రిజర్వ్ చేయనున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీల వారీగా పంచాయతీలను రిజర్వు చేయడానికి చర్యలు చేపట్టనున్నారు. కొత్తగా ఏర్పాటైన పంచాయతీల్లో ఎక్కువ శాతం గిరిజన తండాలే ఉండడంతో ఆ పంచాయతీలను ఎస్టీలకు రిజర్వ్ చేస్తారా లేదా జనరల్ స్థానాలుగా పరిగణిస్తారా తేలాల్సి ఉంది. ఎస్టీల జనాభా ఎక్కువ ఉన్న పంచాయతీలను జనరల్ స్థానాలకింద పరిగణిస్తే ఓసీ, బీసీలు ఎక్కువ మంది ఉన్నచోట నష్టం కలిగే అవకాశం ఉంది.
పాత రిజర్వేషన్లకు ఇక చెల్లు..
నూతన పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం కొత్త రిజర్వేషన్‌ల ప్రాతిపదికన ఎన్నికలు జరగనున్నట్లు తెలుస్తోంది. గతంలో ఉన్న రిజర్వేషన్లను పరిగణనలోకి తీసుకునే పరిస్థితులు లేవు. కొత్త రిజర్వేషన్ల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ స్థానాలు కేటాయిస్తూ మహిళలకు కూడా రిజర్వేషన్ నిర్ణయిస్తారు. దీంతో ఆశావహుల్లో కొంత మందికి సంతోషం కలిగినా మరికొంత మందికి నిరాశ తప్పదు. సర్పంచ్ స్థానాలే కాకుండా వార్డు సభ్యుల స్థానాలు సైతం మారనున్నాయి.
ఆశావహుల్లో ఉత్కంఠ..
సర్పంచ్ స్థానానికి పోటీచేసి తమ అదృష్టం పరీక్షించుకోవాలనుకునే ఆశావహుల్లో రిజర్వేషన్ల మార్పు తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. గత రిజర్వేషన్ ప్రకారం చూస్తే రిజర్వేషన్ మార్పుపై కొంత అవగాహన వస్తుంది. పెరిగిన పంచాయతీల సంఖ్య దృష్ట్యా కొత్త రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికలు నిర్వహించాల్సి వస్తున్నందున ఏ పంచాయతీ రిజర్వేషన్ ఏవర్గానికి కేటాయిస్తారో అంతుచిక్కని పరిస్థితులు ఉన్నాయి. తమకు పోటీచేసే అవకాశం వస్తుందా.. రాదా అని ఆశావహులు ఉత్కంఠతతో ఎదురు చూస్తున్నారు. కులాల వారీగా ఓటర్ల గణన పూర్తయిన వెంటనే పంచాయతీరాజ్ శాఖ రిజర్వేషన్‌లకు సంబంధించిన మార్గదర్శకాలను జారీచేస్తే అందరి ఉత్కంఠకు తెరపడనుంది.
ఏర్పాట్లలో అధికారులు..
పంచాయతీ ఎన్నికల నిర్వహణకు జిల్లా అధికార యంత్రాంగం సన్నద్ధమవుతోంది. వారంలోపు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానున్న నేపథ్యంలో అధికారులు అందుకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. జిల్లాలో 26మండలాలకు గాను 647 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 5,778 వార్డులను విభజించారు. 5,778 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. గతంలో అధికారులకు ఒక విడత ఎన్నికల నిర్వహణకు శిక్షణ ఇవ్వగా బదిలీల కారణంగా మరోమారు శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment