తీర్పు నేడే | Telangana Panchayat Elections First Phase gram panchayat Election | Sakshi
Sakshi News home page

తీర్పు నేడే

Published Mon, Jan 21 2019 7:09 AM | Last Updated on Mon, Jan 21 2019 7:09 AM

Telangana Panchayat Elections First Phase gram panchayat Election - Sakshi

నారాయణపేట : పోలింగ్‌ ఏర్పాట్లలో నిమగ్నమైన అధికారులు

జెడ్పీసెంటర్‌(మహబూబ్‌నగర్‌): మొదటి విడత పంచాయతీ సమరానికి సమయం రానే వచ్చింది. జిల్లాలో మొత్తం 719 గ్రామ పంచాయతీలు, 6,366 వార్డులు ఉండగా మూడు విడుతల్లో ఎన్నికలు జరుగనున్నాయి. నేడు మొదటి విడతగా 203 పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించడానికి అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఈనెల 1వ తేదీన నోటిఫికేషన్‌ జారీ అవ్వగా 7 నుంచి 9వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించారు.

203 పంచాయతీల్లో ఎన్నికలు 
జిల్లాలో మొదటి విడుత ఎన్నికలు సోమవారం జరుగుతాయి. 10 మండలాల్లో మొత్తం 249 పంచాయతీలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. ఇందులో 46 పంచాయతీలు ఎప్పటికే ఏకగ్రీవం కాగా మిగిలిన 203 పంచాయతీలకు సోమవారం ఎన్నికలను నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. కృష్ణా, మాగనూర్, మక్తల్, నర్వ, ఊట్కూర్, నారాయణపేట, దామరగిద్ద, ధన్వాడ, మరికల్, కోయిలకొండలోని 203 పంచాయతీలు, 2,274 వార్డులో ఎన్నికలు జరగనున్నాయి.
 
46 గ్రామాలు ఏకగ్రీవం 
తొలి విడుతలో 46 పంచాయతీలు ఏకగ్రీవం అ య్యాయి. ఈనెల 7 నుంచి 9వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించారు. 13వ తేదీవరకు ఉపసంహరణ ప్రక్రియ ముగిసింది. ఇందులో 46 పంచాయతీలకు కేవలం ఒక్క నామినేషన్‌ మాత్రమే దాఖలవ్వడంతో ఈ పంచాయతీలు ఏకగ్రీవం అయినట్లు అధికారులు ప్రకటించారు. ఇందులో అత్యధికంగా కోయిల్‌కొండలో 12 పంచాయతీలు, మరికల్‌లో ఎనిమిది, నారాయణపేటలో ఆరు, దామరగిద్దలో ఐదు, కృష్ణా, నర్వలో 4, మాగనూర్‌లో 3, మక్తల్‌లో 2, ఊట్కూర్, ధన్వాడలో ఒకటి చొప్పున మొత్తం 46 పంచాయతీల పాలకవర్గాలు ఏకగ్రీవం అయ్యాయి.

పోలింగ్‌కు 5,518 మంది సిబ్బంది 
తొలి విడుతకు మొత్తం 5518 మంది అధికారులను గుర్తించారు. ఇందులో 2,274 పీఓలు, అదనంగా 228 మంది పీఓలను గుర్తించారు. 2,742 ఏపీలు అదనంగా 274 మందిని ఏపీఓలను గుర్తించారు. వీరు నామినేషన్ల స్వీకరణ ఇప్పటికే పూర్తి చేశారు. ఇక  పోలింగ్‌ నిర్వహణ, కౌంటింగ్, ఉప సర్పంచ్‌ ఎన్నిక వరకు ఈ అధికారులు విధులు నిర్వహిస్తారు.

ఉదయం 7 నుంచి మొదలు.. 
పోలింగ్‌ ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు నిర్వహించనున్నారు. మూడు విడుతల్లో ఈ మాదిరిగానే ఎన్నికల నిర్వహణ జరుగుతుంది. ఎన్నికలు పూర్తయిన గంట తరువాత (మధ్యాహ్నం 2గంటలకు) నుంచి ఆయా గ్రామ, వార్డు సభ్యుల ఓట్లను లెక్కిస్తారు. ముందుగా వార్డు సభ్యుల ఓట్లను లెక్కిస్తారు. ఆ తరువాత సర్పంచ్‌ ఓట్లను లెక్కిస్తారు. ఈ ఎన్నికల్లో రెండు ఓట్లు వేయాల్సి ఉంటుంది. ఒకటి వార్డు మెంబర్‌కు, మరొకటి సర్పంచ్‌కి ఓటు వేయాల్సి ఉంటుంది. పోలింగ్‌ జరిగే రోజునే ఉప సర్పంచ్‌ ఎన్నిక కూడా నిర్వహించనున్నారు.

బ్యాలెట్‌ పద్ధతిన పోలింగ్‌ 
పంచాయతీ ఎన్నికలు బ్యాలెట్‌ పద్ధతిన నిర్వహించనున్నారు. అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే ఈవీఎంల ద్వారా ఎన్నికలు జరుపాలని మొదలు అనుకున్నప్పటికీ బ్యాలెట్‌ పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. దానికి అనుగునంగానే ఈ సారి బ్యాలెట్‌ పద్ధతిలోనే ఎన్నికలు జరుగుతాయి. ఇందులో గులాబీ రంగ బ్యాలెట్‌ సర్పంచ్‌కు, తెలుపు రంగు బ్యాలెట్‌ వార్డు సభ్యులకు కేటాయించారు. ఇందులో సర్పంచ్‌కు 30, వార్డు çసభ్యులకు 20 గుర్తులను కేటాయించారు.

నేడే ఫలితాలు 
నేటి పోలింగ్‌ ముగిసిన వెంటనే మధ్యా«హ్నం 2 గంటల నుంచి ఓట్లను లెక్కిస్తారు. ముందుగా వార్డు సభ్యులకు చెందిన ఓట్లను లెక్కిస్తారు. అనంతరం సర్పంచ్‌ అభ్యర్థుల ఓట్లను లెక్కిస్తారు. ఓట్లను లెక్కించేందుకు అధికారులు పంచాయతీల వారిగా అన్ని ఏర్పాట్లు చేశారు. అందుకు ఉపయోగించే సామాగ్రి అందుబాటులో ఉంచారు. ఎలాంటి పొరపాట్లు లేకుండా అందుకు అవసరమైన సామాగ్రిని సరఫరా చేశారు. గుండు సూది, క్యాండిల్, రబ్బర్‌బ్యాండ్‌ లాంటి వస్తువులను సైతం అందుబాటులో ఉంచారు.

ఉప సర్పంచ్‌లు సైతం 
ముందుగా వార్డు సభ్యుల ఓట్లను లెక్కిస్తారు. దీంతో ఎవరెవరు గెలిచారో.. ఓడారో తెలిసి పోతుంది. ఎవరి ప్యానెల్‌కు ఎక్కువ సభ్యులు గెలిచారో తేలనుంది. ఆ వెంటనే అసలు రాజకీయం మొదలవుతుంది. ఉప సర్పంచ్‌ పదవికి పోటీ పెరిగి పోతుంది. ముందుగా అనుకున్న ప్యానెల్‌ గెలిస్తే అప్పటికే అనుకున్న అభ్యర్థికి ఉప సర్పంచ్‌గా  అవకాశం వస్తుంది. అనుకున్న అభ్యర్థి ఓడిపోతే గెలిచిన అభ్యర్థుల్లో ఎవ్వరిని ఉప సర్పంచ్‌గా ఎన్నుకోవాలో పార్టీలు రాజకీయ వ్యుహాలను íసిద్ధం చేసుకుని పెట్టుకున్నారు. సర్పంచ్‌ జనరల్‌ అయితే ఉప సర్పంచ్‌ నాన్‌ జనరల్‌కు ఇవ్వాలని, సర్పంచ్‌ రిజర్వు అయితే ఉప సర్పంచ్‌ జనరల్‌కు ఇవ్వాలనే పోటీ నెలకుంటుంది. పోలింగ్‌లో పాల్గొన్న సిబ్బంది ఉప సర్పంచ్‌ ఎన్నికల నిర్వహించాల్సి ఉంటుంది. ఉప సర్పంచి ఎన్నిక పూర్తి అయితేనే సంపూర్ణంగా అధికారులు పని పూర్తి అయినట్లు.
 
ఇంకులో స్వల్ప మార్పు 
పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేసిన అభ్యర్థి వేలికి వేసే ఇంకును ఎడమ చేతి చూపుడు వేలుకు కాకుండా ఎడమ చేతి మధ్య వేలుకు ఇంకు పెడుతారు. ఎందుకంటే డిసెంబర్‌ 7వ తేదీన అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ఓటర్లకు ఎడమ చేతి చూపుడు వేలికి ఇంకు పెట్టారు. దీంతో అ ఇంకు ఇప్పటి దాక ఉండవచ్చనే కారణంతో ఎన్నికల సంఘం ఈ ఎన్నికల్లో ఎడమ చేతి మధ్య వేలికి ఇంకు పెట్టేందుకు నిర్ణయం తీసుకుంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement