దేవరకద్ర మండలం డోకూర్‌లో వర్షంలో గొడుగు పట్టుకుని ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి
అడ్డాకుల (దేవరకద్ర): గ్రామపంచాయతీ ఎన్నికల పర్వం చివరి దశకు వచ్చేసింది. మూడో విడత ఎన్నికలు ఈనెల 30వ తేదీన జరగనుండగా ప్రచారానికి నేటి సాయంత్రం వరకు గడువు ఉంది. దీంతో గ్రామాల్లో సర్పంచ్, వార్డుసభ్యులుగా బరిలో ఉన్న అభ్యర్థులే కాకుండా వారి తరుఫున బడా నేతలు, కుటుంబసభ్యులు ముమ్మర ప్రచారం చేస్తున్నారు. ఇతర ప్రాంతాల్లో ఉండే దూరపు బంధువులు కూడా ప్రచారానికి రంగంలో దించేశారు. తెలిసిన వారిని కలిసి తమ అభ్యర్థికి ఓట్లేయాలని ప్రచారం చేస్తున్నారు. అభ్యర్థుల పిల్లల్లో చాలా మంది ఇతర ప్రాంతాల్లో చదువుకుంటున్నారు. వారంతా ఊర్లకు వచ్చి ఎన్నికల ప్రచారంలో బిజీగా గడుపుతున్నారు. కొందరు అభ్యర్థులు పేరు మోసిన బంధువులను ప్రత్యేకంగా పిలిపించుకుని మంతనాలు చేస్తున్నారు.
పల్లెల్లో సందడి
ఎన్నికల సందర్భంగా పల్లెల్లో సందడి వాతావరణం నెలకొంది. శని, ఆదివారాలు సెలవు దినాలు కావడంతో దూరపు ప్రైవేటు ఉద్యోగులు, ఉపాధ్యాయులతోపాటు యువత అంతా తమ బంధువుల ప్రచారంలో నిమగ్నమై కనిపించారు. ఇంటర్, డిగ్రీ చదువుకునే పిల్లలు సైతం ప్రచారంలో తమ మార్కును చూయించే ప్రయత్నం చేస్తున్నారు. స్నేహితుల తల్లిదండ్రులు, బంధువులతో తమ స్నేహితుడి బంధువుకు ఓట్లేయాలని ప్రచారం సాగిస్తున్నారు. ముఖ్యంగా వైద్య సేవలు అందించిన వారిని ఎక్కువగా వాడుకుంటున్నారు. ప్రజలతో మంచి సంబంధాలు ఉండి ఇతర ప్రాంతాల్లో ఉండే వారు ఇప్పుడు పల్లెల్లో కనిపిస్తున్నారు. ఆదివారం మండలాల్లో జోరుగా వర్షం కురుస్తున్నా లెక్క చేయకుండా అభ్యర్థులు తరఫున ఎమ్మెల్యేలు, నాయకులు ప్రచారం సాగించారు.
8 మండలాలు.. 227 పంచాయతీలు
జిల్లాలో 721 గ్రామపంచాయతీలు ఉండగా, రెండింటి పాలకవర్గాలకు ఇంకా సమయం ఉండడంతో 719 జీపీల్లో మూడు విడతలుగా ఎన్నికల నిర్వహణకు అధికారులు షెడ్యూల్ విడుదల చేశారు. ఈ మేరకు మొదటి విడతలో 249 పంచాయతీలు, రెండో విగడతలో 243 పంచాయతీల్లో ఎన్నికలు పూర్తయ్యాయి. ఇక మూడో విడతగా 227 జీపీల్లో ఈనెల 30వ తేదీన బుధవారం పోలింగ్ జరగనుంది. అయితే, తొలి విడతలో 46 జీపీలు, రెండో విడతలో 56 జీపీల పాలకవర్గాలు ఏకగ్రీవం కాగా.. మూడో విడతకు సంబంధించి మాత్రం కేవలం 24 గ్రామపంచాయతీల్లో మాత్రమే ఏకగ్రీవమయ్యాయి. ఈ విడత పంచాయతీల్లో పోరు హోరాహోరీగా కొనసాగనుందని చెప్పాలి. ఇక మూడో విడతలో ఎనిమిది మండలాల్లోని గ్రామపంచాయతీల్లో ఎన్నికలు జరగనుండగా.. అత్యధికంగా మద్దూరు మండలంలో 11 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. అలాగే, భూత్పూర్ మండలంలో ఒక్క జీపీ కూడా ఏకగ్రీవం కాలేదు. అలాగే, సర్పంచ్ పదవి ప్రతీ పంచాయతీలో ఇద్దరు, ముగ్గురుపైనే అభ్యర్థులు పోటీలో ఉండడం గమనార్హం. గండీడ్ మండలంలోనైతే 49 పంచాయతీలకు నాలుగు ఏకగ్రీవం కాగా, మిగిలిన 45 పంచాయతీల్లో సర్పంచ్ స్థానాలకు ఏకంగా 125 మంది పోటీ పడుతున్నారు.
పెరిగిన ఎన్నికల వే‘ఢీ’
సర్పంచ్ ఎన్నికలంటేనే రసవత్తర పోరుకు నిదర్శనం. ఎందుకంటే ఒక్క ఓటు కూడా అభ్యర్థి ఫలితాన్ని తారుమారు చేస్తుంది. బుధవారమే పోలింగ్ జరుగనుండటంతో గ్రామాల్లో వేడి రా జుకుంది. ఓవైపు రెండు రోజులుగా ముసురు వ ర్షాలు కురుస్తుంటే మరోవైపు అభ్యర్థుల్లో రోజురోజుకు వేడి పెరుగుతోంది. వర్షం కురుస్తున్నా లెక్క చేయకుండా ప్రచారం సాగుతోంది. మద్ద తుదారులు, అనుయాయులను ఇంటికే పిలిపించుకుని మంతనాలు చేస్తున్నారు. తమ వర్గం ఓట్లు పక్కకు జారకుండా చూసుకుంటున్నారు.
సర్వత్రా ఉత్కంఠ
సర్పంచ్, ఉప సర్పంచ్ బరిలో ఉన్న అభ్యర్థుల్లో టెన్షన్ మొదలైంది. పోలింగ్ తేదీ సమీపిస్తుండటంతో ఓట్ల లెక్కలు వేస్తున్నారు. ‘మనకు ఓట్లేసే వారెవరు...మనకు చేయిచ్చే వారెవరు’ అంటూ ముఖ్య నాయకులతో లెక్క కడుతుతున్నారు. ఓటర్లు కూడా చైతన్యమై ఎవరు వచ్చి ఓట్లడిగినా మీకే వేస్తామంటూ భరోసాగా చెబుతుండటంతో అభ్యర్థులు తికమకపడుతున్నారు. ఎవరిని నమ్మాలో.. ఎవరిని నమ్మవద్దో తెలియని సంకట స్థితిని ఎదుర్కొంటున్నారు. లెక్కకు అందని విధంగా ఖర్చు చేయాల్సి రావడంతో తీవ్ర ఉత్కంఠకు గురవుతున్నారు.
నేటితో ప్రచారానికి ‘తెర’
పోలింగ్‌కు 44 గంటల ముందే ప్రచార పర్వా న్ని ముగించాలన్న నిబంధనతో నేటి సాయం త్రం ప్రచారం ముగియనుంది. ప్రచారానికి తెరపడిన వెంటనే ప్రలోభాల పర్వం మొదలు కానుంది. మద్యం, డబ్బులతో ఓటర్లకు ఎర వేయడానికి అంతా సిద్దం చేసుకున్నారు. మంగళవారం రాత్రి వరకు ప్రలోభాల పర్వం సాగనుంది. ఇందుకోసం అభ్యర్థులు చివరి అస్త్రాలన్నింటినీ ప్రయోగించేందుకు సిద్దమయ్యారు. ఓటర్లను మచ్చిక చేసుకోవడానికి దేనికైనా...ఎంతకైనా వెనుకాడడం లేదు. ఇదిలా ఉండగా వలస ఓటర్లు గ్రామాల బాటపట్టారు. దూరప్రాంతాల్లో ఉండే ఓటర్లు గ్రామాలకు చేరుతున్నారు. రెండు రోజుల్లో ఊర్లో గడిపి ఓట్లేసి పోవచ్చని ముందే వస్తున్నారు.
గ్రామాభివృద్ధే ప్రధాన లక్ష్యం : ఆల
దేవరకద్ర రూరల్: గ్రామాభివృద్ధే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. ప్రజాసంక్షేమానికి ప్ర భుత్వం అహర్నిషలు పాటుపడుతుందన్నారు. మండలంలోని జీన్గరాల, గుడిబండ, డోకూర్ గ్రామాల్లో ఆదివారం ఎమ్మెల్యే ఆల పంచాయతీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వర్షాన్నిసైతం లెక్కచేయకుండా ఎమ్మెల్యే ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గతంలో ఏ ప్రభుత్వం చేయని సంక్షేమ పథకాలకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని, సాగునీరు, తాగునీటికి అధిక ప్రాధాన్యం ఇవ్వడం జరిగిందన్నారు. అన్నదాతలను అ న్ని విధాలుగా ఆదుకోవాలన్న ఉద్దేశ్యంతో వినూత్నరీతిలో తీసుకొచ్చిన పథకాలన్నీ అమలవుతున్నాయని, రాబోయే రో జుల్లో చేయాల్సిన పనులను దృష్టిలో పెట్టుకొని టీఆర్‌ఎస్ బలపర్చిన అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment