మానకొండూర్‌లో ఓటు వేసేసేందుకు పెద్ద ఎత్తున బారులు తీరిన ఓటర్లు
పల్లెల్లో మరోమారు గులాబీ గుబాళించింది. రెండో విడత పంచాయతీ ఎన్నికల్లోనూ కారు దూసుకెళ్లింది. మానకొండూర్, తిమ్మాపూర్, శంకరపట్నం, గన్నేరువరం, చిగురుమామిడి మండలాల్లో శుక్రవారం పోలింగ్ జరిగింది. సాయంత్రం కడపటి సమాచారం అందే వరకు మొత్తం 107 పంచాయతీలకు ఏకగ్రీవం కలుపుకుని 63 మంది టీఆర్‌ఎస్ మద్దతుదారులు సాధించుకున్నారు. మిగతా 44 స్థానాల్లో కాంగ్రెస్ 20, సీపీఐ 3, టీడీపీ ఒకచోట గెలుపొందగా, 20 స్థానాల్లో స్వతంత్రులు విజయం సాధిం చారు. మెజార్టీ ఉపసర్పంచ్‌లుగా టీఆర్‌ఎస్ మద్దతుదారులే నెగ్గారు.
సాక్షిప్రతినిధి, కరీంనగర్: జిల్లాలో రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం ఐదు మండలాల్లో 107 గ్రామపంచాయతీలు, 1014 వార్డులకు ఎన్నికలు జరగాల్సి ఉండగా, ఇందులో ఐదు పంచాయతీలు, 167 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. పంచాయతీలు, వార్డులు కలిపి మొత్తం 104 గ్రామపంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించగా.. శుక్రవారం ఉదయం ఏడు గంటల నుంచి పోలింగ్ మొదలైంది. తొమ్మిది గంటల వరకు మందకోడిగా సాగిన పోలింగ్ ఆ తర్వాత పుంజుకుంది.
మధ్యాహ్నం 12 గంటల వరకు ఓటర్లు బారులు తీరారు. ఒంటిగంటకు పోలింగ్ సమయం ముగిసినా.. ఓటర్లు ‘క్యూ’లు కట్టడంతో శంకరపట్నం, మానకొండూరు, తిమ్మాపూర్ గ్రామాల్లోని 21 గ్రామాల్లో మధ్యాహ్నం 1.30 వరకు కూడా ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. రెండో విడత పోలింగ్ సందర్భంగా అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. కాగా ఐదు మండలాల్లో రెండో విడతలో 89.52 శాతంగా పోలింగ్ నమోదైంది.
89.52 శాతం పోలింగ్..
గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా రెండో విడతలో గతంలో ఎన్నడూ లేని విధంగా పోలింగ్ నమోదైంది. దీంతో ఓటర్ల నమోదు, ఓటుహక్కు వినియోగంపై అధికారులు ఉద్యమంలా చేపట్టిన కృషి ఫలించింది. ఐదు మండలాల్లో మొత్తం 16,3,788 మంది ఓటర్లకు 1,46,623 మంది తమ ఓటుహక్కును వినియోగించుకోగా సగటున 89.52 శాతంగా నమోదైనట్లు జిల్లా పంచాయతీ అధికారి మనోజ్‌కుమార్ వెల్లడించారు. ఇందులో 81,799 మంది పురుషులకు 73,114 మంది, 81,989 మంది మహిళలకు 73,509 మంది ఓట్లేశారు.
అత్యధికంగా శంకరపట్నం మండలంలో 91.20 శాతంగా కాగా, అత్యల్పంగా చిగురుమామిడి మండలంలో 87 శాతంగా ఉంది. గన్నేరువరంలో 90.39 శాతం, మానకొండూరులో 89.84 శాతంగా పోలింగ్ జరిగింది. వార్డులు, పంచాయతీలు కలుపుకుని మొత్తం 104 పంచాయతీల్లో 102 మంది సర్పంచ్‌లు, 847 వార్డుల్లో సభ్యుల కోసం ఈ ఎన్నికలు జరిగాయి. మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగా రాత్రి వరకు కొనసాగింది. పోలింగ్ సందర్భంగా జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్, జిల్లా ఎన్నికల పరిశీలకురాలు భారతీ లక్‌పతినాయక్. పోలీసు కమిషనర్ వీబీ.కమలాసన్‌రెడ్డి తదితరులు పలు గ్రామాల్లో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు.
పోలింగ్ ప్రశాంతం.. ఉత్కంఠగా కౌంటింగ్
ఐదు మండలాల పరిధిలోని గ్రామపంచాయతీలు, వార్డులకు రెండో విడత ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. ముందుగానే కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదు. ఎన్నికల సక్రమ నిర్వహణకు ఎలాంటి అడ్డంకులు కలుగకుండా ఉండడానికి రెండో విడతలోని 42 ప్రాంతాల్లోని 2,346 పోలింగ్ స్టేషన్లను సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించారు. అందులో 13 ప్రాంతాల్లోని 144 పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్‌కు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేశారు. ఇంటర్‌నెట్ సౌకర్యం కోసం కావాల్సిన మోడెమ్‌లను కొనుగోలు చేశారు. వెబ్ కాస్టింగ్ ఏర్పాట్లు చేసిన చోట నేరుగా రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా ఎన్నికల సరళిని అధికారులు పర్యవేక్షించడానికి వీలు కల్పించారు. 29 ప్రాంతాల్లో గుర్తించిన 202 పోలింగ్ స్టేషన్లను 29 మంది మైక్రో అబ్జర్వర్లకు బాధ్యతలు అప్పగించారు. వారు ఎన్నికలు జరిగే ప్రాంతాలకు చేరుకుని పర్యవేక్షించడంతో పాటు ఎన్నికలు పూర్తయ్యేంత వరకు వీడియో చిత్రీకరణతో ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు.
ఎన్నికలు జరిగే పంచాయతీలను 16 జోన్లు, 36 రూట్లుగా గుర్తించి, అందుకోసం ప్రత్యేక అధికారులు పర్యవేక్షించారు. ఎన్నికల నిర్వహణ కోసం 983 మంది పోలింగ్ అధికారులుగా, మరో 1257 మందిని అదనపు పోలింగ్ అధికారులకు బాధ్యతలను అప్పగించగా, వీరికి అదనంగా 261 పీవో, 562 మంది ఓపీవోలను రిజర్వులో సిద్ధంగా ఉంచిన అధికారులు పకడ్భందీగా ఏర్పాట్లు చేశారు. ఉప సంహరణల అనంతరం మానకొండూర్ మండలంలోని 26 పంచాయతీల్లో 121 మంది సర్పంచ్ బరిలో ఉండగా, తిమ్మాపూర్‌లో 21 స్థానాలకు 99 మంది, శంకరపట్నంలో 24 స్థానాలకు 94 మంది, గన్నేరువరంలో 14 స్థానాలకు 43 మంది, చిగురుమామిడి మండలంలో 17 సర్పంచ్ స్థానాలకు 82 మంది కలిపి మొత్తంగా 102 సర్పంచి స్థానాల్లో 439 మంది బరిలో నిలిచారు. 846 వార్డు స్థానాల కోసం 2,354 మంది బరిలో నిలిచారు. అయితే పెద్ద సంఖ్యలో పోటీ ఉండటంతో ఫలితాలు వెలువడే వరకు కూడా సస్పెన్స్ నెలకొంది. అర్ధరాత్రి వరకు జరిగిన ఓట్ల లెక్కింపు అభ్యర్థులను ఉత్కంఠకు గురి చేసింది. రెండో విడత పోలింగ్, ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా ముగియడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment