రూట్ మ్యాప్‌లు పరిశీలిస్తున్న పోలీసు సిబ్బంది , సామగ్రితో విధులకు బయలుదేరుతున్న ఉద్యోగులు
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా రెండో విడత పోలింగ్ శుక్రవారం జరగనుంది. జిల్లాలోని ఏడు మండలాల్లో ఈ ఎన్నికలు జరగనున్నాయి. రెండో విడతగా 243 పంచాతీల్లో ఎన్నికలు జరగాల్సి ఉండగా.. 58 పంచాయతీల్లో పాలకవర్గాలు ఏకగ్రీవమయ్యాయి. దీంతో మిగిలిన 185 పంచాయతీల్లో సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు.
ఏడు మండలాలు...
జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికలను మూడు విడతలుగా నిర్వహించే షెడ్యూల్ ఖరారైంది. ఈ మేరకు రెండో విడతగా మిడ్జిల్, బాలానగర్, రాజాపూర్, జడ్చర్ల, నవాబుపేట, మహబూబ్‌నగర్, హన్వాడ మండాల్లోని 243 పంచాయతీలు, 2,068 వార్డులో ఎన్నికలకు ఏర్పాటుచేశారు. అయితే, ఏకగ్రీవమైన పంచాయతీలు పోను మిగతా జీపీల్లో ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేశారు.
ఏకగ్రీవ జీపీలు...
రెండో విడతగా ఏడు మండలాల్లో మొత్తంగా 58 గ్రామపంచాయతీల పాలకవర్గాలు ఏకగ్రీవమయ్యాయి. నవాబుపేట మండలంలో అత్యధికంగా 19 గ్రామపంచాయతీల పాలకవర్గాలు ఏకగ్రీవం కాగా, మహబూబ్‌నగర్ రూరల్‌లో 5, జడ్చర్లలో 8, మిడ్జిల్‌లో 3, హన్వాడలో 7, బాలానగర్‌లో 10, రాజాపూర్‌లో 6 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. ఆయా మండలాల్లోని 697 వార్డుసభ్యులు కూడా ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. మిడ్జిల్ మండలంలోని పంచాయతీల్లో 48 వార్డులు, బాల్‌నగర్‌లో 120, రాజాపూర్‌లో 57, జడ్చర్లలో 117, నవాబ్‌పేట్‌లో 191, మహబూబ్‌నగర్ రూరల్‌లో 50, హన్వాడలో 114 వార్డుల సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
బరిలో 4,021 మంది
గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా రెండో విడత జీపీల్లో మొత్తం 4,021 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. సర్పంచ్ స్థానాలకు 594 మంది బరిలో ఉండగా.. వార్డు సభ్యులుగా 3,427 మంది పోటీలో మిగిలారు. మిడ్జిల్ మండలంలోని 24 పంచాయతీల్లో మూడు ఏకగ్రీవం కాగా, 21 పంచాయతీల్లో, బాలానగర్‌లో 37 జీపీలకు 10 ఏకగ్రీవం కాగా 27 పంచాయతీల్లో, రాజాపూర్‌లో 24 జీపీల్లో 6 ఏకగ్రీవం కాగా 18 పంచాయతీల్లో, జడ్చర్లలో 43 జీపీలకు 8 ఏకగ్రీవం కాగా 35 జీపీలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. నవాబుపేట మండలంలో 54 పంచాయతీల్లో 19 ఏకగ్రీవం కాగా, 35 జీపీల్లో, మహబూబ్‌నగర్ రూరల్ మండలంలో 26 జీపీల్లో 5 ఏకగ్రీవం కాగా 21 జీపీల్లో, హన్వాడలో 35 జీపీలకు 7 ఏకగ్రీవం కాగా, 28 పంచాయతీల్లో ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. మొత్తంగా 243 జీపీల్లో 58 ఏకగ్రీవం కాగా మిగిలిన 185 జీపీలకు 594 మంది సర్పంచ్ స్థానం కోసం బరిలో నిలిచారు. ఇక 2,066 వార్డులకు గాను 697 ఏకగ్రీవం కాగా 1,369 వార్డుల్లో 3,427 మంది బరిలో నిలిచారు.
వలస ఓటర్లపై నజర్
పంచాయతీ ఎన్నికల్లో ప్రతీ ఓటు కీలకమే. దీంతో అభ్యర్థులు వలస ఓటర్లపై దృష్టి సారించారు. పోలింగ్ శుక్రవారం జరగనుండగా.. గురువారం రాత్రి వరకే ఎక్కడ ఉన్న ఓటర్లయినా స్వస్థలాలకు చేరుకునేలా అభ్యర్థులు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే పట్టణాలకు వెళ్లి వలస ఓటర్లను కలిసిన అభ్యర్థులు వారికి గ్రామాలకు చేర్చడంతో పాటు తిరిగి పట్టణాలకు పంపించే లా సొంత ఖర్చు తో వాహనాలు సమకూర్చారు.
4,685 మంది పోలింగ్ సిబ్బంది
రెండో విడత ఎన్నికల నిర్వహణకు మొత్తం 4,685 మంది పోలింగ్ సిబ్బందిని నియమించారు. వీరికి ఇప్పటికే శిక్షణ పూర్తి చేశారు. ఇందు లో 2,274 మంది పీఓలు కాగా 2,411 మంది ఏపీఓలు, ఇతర సిబ్బంది ఉన్నారు. సిబ్బందికి గ్రామపంచాయతీలను కేటాయించగా.. గురువారం ఉదయం పోలింగ్ సామగ్రితో కేంద్రాలకు బయలుదేరారు. ఇందుకోసం జిల్లా యంత్రాం గం ప్రత్యేక వాహనాలు కేటాయించింది.
పోలింగ్.. ఆ వెంటనే ఫలితం
గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా శుక్రవారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరగనుంది. అనంతరం గంట విరామం ఇచ్చాక రెండు గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపడుతారు. తొలుత వార్డు సభ్యు ల ఓట్లను లెక్కించి ఫలితాలు వెల్లడించాక సర్పం చ్ అభ్యర్థుల వచ్చిన ఓట్లను లెక్కిస్తారు. కాగా, ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి పూర్తయ్యాక ఉప సర్పంచ్‌ను సైతం ఎన్నుకోవాల్సి ఉంటుంది. ముందుగా అనుకున్న ప్యానెల్ గెలిస్తే అప్పటికే అనుకున్న అభ్యర్థికి ఉప సర్పంచ్ అభ్యర్థికి అవకాశం వస్తుంది. అలా జరగకపోతే ఎవరిని ఉప సర్పంచ్‌గా ఎన్నుకోవాలో పార్టీల నేతలు వ్యూహాలను సిద్ధం చేసుకున్నారు. సర్పం చ్ పదవి జనరల్ స్థానమైతే ఉప సర్పంచ్ పదవి నాన్ జనరల్‌కు ఇవ్వాలని, సర్పంచి రిజర్వ్ అయితే ఉప సర్పంచి జనరల్‌కు ఇవ్వాలని పలు వురు నిర్ణయించుకున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment