
సాక్షి, హైదరాబాద్: గ్రామ పంచాయతీ ఎన్నికలను జూలైలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం...ఎప్పటిలాగే ఏకగ్రీవ గ్రామ పంచాయతీలకు ఆర్థిక చేయూత అందించే కార్యక్రమాన్ని కొనసాగించనుంది. ఎన్నికలు ఏకగ్రీవంగా పూర్తయ్యే గ్రామాలకు నిధులు ఇవ్వనుంది. ఐదు వేల కంటే ఎక్కువ జనాభా ఉన్న పంచాయతీలకు రూ. 15 లక్షల చొప్పున, ఐదు వేల కంటే తక్కువ జనాభా ఉన్న పంచాయతీలకు రూ. 10 లక్షల చొప్పున నిధులు మంజూరు చేయనుంది.
గ్రామాభివృద్ధి కోసం పంచాయతీలు ఈ నిధులను ఖర్చు చేయాల్సి ఉంటుంది. 2013లో ఉమ్మడి ఏపీలో పంచాయతీ ఎన్నికలు జరగ్గా అప్పుడు తెలంగాణలో 8,778 పంచాయతీలు ఉండేవి. గత ఎన్నికల్లో తెలంగాణలో 451 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. ఆలస్యం గా అయినా రాష్ట్ర ప్రభుత్వం వాటికి నిధులు విడుదల చేసింది. జూలైలో జరగనున్న పంచాయతీ ఎన్నికల విషయంలోనూ నిధుల మంజూరు నిబంధనను ప్రభుత్వం అమలు చేయనుంది.
కొత్త పంచాయతీరాజ్ చట్టంతో వాటి సంఖ్య పెరిగింది. రాష్ట్రంలో 12,751 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. చిన్న ఆవాసాలు, తండాలు పంచాయతీలుగా మారడంతో వచ్చే ఎన్నికల్లో ఏకగ్రీవ పంచాయతీల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. మరోవైపు అన్ని గ్రామాల్లో బీసీ ఓటర్ల గణన ముమ్మరంగా సాగుతోంది. గురువారం లోగా జిల్లాలవారీగా రిజర్వుడు గ్రామ పంచాయతీల సంఖ్యను అధికారులు నిర్ధారించి జూన్ 10లోగా రిజర్వేషన్లను ఖరారు చేయనున్నారు. ఆపై రిజర్వేషన్ల జాబితాను ప్రభుత్వం రాష్ట్ర ఎన్నికల సంఘానికి సమర్పిస్తే ఎన్నికల సంఘం పోలింగ్ నిర్వహణకు షెడ్యూల్ విడుదల చేయనుంది.
నేడు కలెక్టర్లతో సమావేశం..
గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో రాష్ట్ర ఎన్నికల సంఘం నిమగ్నమైంది. షెడ్యూల్ ప్రకారం జూలైలోనే ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధ మవుతోంది. దీనిపై అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీస్ కమిషనర్‌లు, ఎస్పీలు, జిల్లా ప్రజాపరిషత్ సీఈవోలు, జిల్లా పంచాయతీ అధికారులతో బుధవారం హైదరాబాద్‌లో సమావేశం నిర్వహిస్తోంది. పోలింగ్ ప్రక్రియ, శాంతి భద్రతల నిర్వహణ తదితర అంశాలను సమావేశంలో చర్చించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment