బరిలో 10,668 మంది సర్పంచ్‌ అభ్యర్థులు | Notification issued for 2nd phase of panchayat polls | Sakshi
Sakshi News home page

బరిలో 10,668 మంది సర్పంచ్‌ అభ్యర్థులు

Published Sat, Jan 19 2019 3:39 AM | Last Updated on Sat, Jan 19 2019 8:21 AM

Notification issued for 2nd phase of panchayat polls - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గ్రామ పంచాయతీ రెండో విడత (ఈ నెల 25న) ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఉపసంహరణ పూర్తయ్యాక మొత్తం 3,342 సర్పంచ్‌ స్థానాలకు 10,668 మంది అభ్యర్థులు బరిలో మిగిలారు. అలాగే మొత్తం 26,191 వార్డు మెంబర్‌ స్థానాలకు 63,480 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. రెండో విడతలో భాగంగా 4,135 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తున్నట్టు నోటిఫై చేయగా, 788 సర్పంచ్‌లు ఏకగ్రీవంగా ఎన్నిక కాగా, 5 పంచాయతీలకు నామినేషన్లు దాఖలు కాలేదు.

దీంతో 3,342 సర్పంచ్‌ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ (ఎస్‌ఈసీ) తెలి పింది. రెండో విడత ఎన్నికల్లో మొత్తం 36,602 వార్డు సభ్యులకు ఎన్నికలు నిర్వహిస్తున్నట్టు ఎస్‌ఈసీ నోటిఫై చేయగా అందులో 10,317 వార్డు సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వివిధ జిల్లాల్లోని 94 వార్డు మెంబర్‌ స్థానాలకు నామినేషన్లు దాఖలు కాలేదు. దీంతో ఈ విడతలో మొత్తం 26,191 వార్డులకు జరుగుతున్న ఎన్నికల్లో 63,480 అభ్యర్థులు పోటీలో ఉన్నట్టుగా ఎస్‌ఈసీ ప్రకటించింది.
 
మూడో విడతకు ముగిసిన నామినేషన్లు..
మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల దాఖలు శుక్రవారం (18న)తో ముగిసింది. ఈ విడతలో 4,116 సర్పంచ్‌ స్థానాలు, 36,729 వార్డు మెంబర్‌ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. శుక్రవారం వరకు దాఖలైన సర్పంచ్, వార్డు అభ్యర్థుల నామినేషన్లను శనివారం పరిశీలించేందుకు అధికారు లు ఏర్పాట్లు చేశారు. బుధవారం (23న) సాయం త్రం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువుంటుంది. అదే రోజు సాయంత్రం 5 గంటలకు అభ్యర్థులకు గుర్తులు కేటాయిస్తారు. ఈ నెల 30న మూడో విడత ఎన్నికలు జరగనున్నాయి. 

నేటి సాయంత్రం ‘తొలి’ ప్రచారం బంద్‌
21న జరగనున్న తొలి విడత ఎన్నికల ప్రచారాన్ని శనివారం సాయంత్రం 5 గంటల్లోపు ముగించాలని ఎస్‌ఈసీ ఆదేశించింది. మొదటి, రెండు, మూడో విడత ఎన్నికలు పూర్తి కావడానికి 44 గంటల ముం దు ప్రచారాలు నిలిపివేయాలని ఎస్‌ఈసీ కార్యదర్శి అశోక్‌కుమార్‌ ఒక ప్రకటనలో ఆదేశించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement