టీడీపీ దాడులు.. దౌర్జన్యాలు | TDP leaders threats and attacks in AP panchayat elections | Sakshi
Sakshi News home page

టీడీపీ దాడులు.. దౌర్జన్యాలు

Published Tue, Feb 2 2021 5:21 AM | Last Updated on Tue, Feb 2 2021 1:33 PM

TDP leaders threats and attacks in AP panchayat elections - Sakshi

రామగిరిలో ఎస్‌ఐకి ఫిర్యాదు చేస్తున్న బాధితులు

సాక్షి నెట్‌వర్క్‌: పార్టీ రహితంగా జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ నాయకులు దాడులు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా గొడవలు సృష్టించాలని కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు. పార్టీ రహిత ఎన్నికలకు మేనిఫెస్టో విడుదల చేసిన చంద్రబాబు ఈ ఎన్నికలకు పార్టీ రంగు పూస్తున్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్వయంగా బెదిరింపులకు పాల్పడగా పలుచోట్ల మాజీ మంత్రుల అనుచరులు, మాజీ ప్రజాప్రతినిధులు ప్రత్యర్థుల్ని భయభ్రాంతుల్ని చేస్తున్నారు. అచ్చెన్నాయుడు తన స్వగ్రామం నిమ్మాడలో తమకు పోటీగా ఎవరూ నామినేషన్‌ వేయకుండా ఫోన్‌లో బెదిరించడమేగాక ఆయన సోదరుడు, సోదరుడి కుమారుడు, టీడీపీ కార్యకర్తలు ఆదివారం బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే.

చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం యాదమరి మండలంలో ఆదివారం నామినేషన్‌ కేంద్రాల వద్ద హల్‌చల్‌ చేసిన టీడీపీ ఎమ్మెల్సీ దొరబాబు తన కారుతో ఇద్దరు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను ఢీకొట్టిన విషయం విదితమే. వైఎస్సార్‌ జిల్లా చాపాడు మండలం బద్రిపల్లెలో ఆదివారం రాత్రి దళితులపై టీడీపీ వర్గీయులు దౌర్జన్యానికి దిగారు. 9వ వార్డు మెంబరు పదవికి నామినేషన్‌ వేసిన డేగల చంద్రలీల నామినేషన్‌ ఉప సంహరించుకునేందుకు వీల్లేదంటూ నెర్రవాడకు చెందిన టీడీపీ నాయకులు మాజీ జెడ్పీటీసీ మేకల బాబు, బుర్రి నాగరాజు, టీడీపీ మద్దతుతో బరిలో ఉన్న సర్పంచ్‌ అభ్యర్థి భర్త గుత్తి వీరనారాయణ, మేకల సుదర్శన్‌ మరో ఐదుగురు తమ మనుషులతో కలసి దళితులపై బెదిరింపులకు పాల్పడుతూ దాడికి యత్నించారు. దీనిపై దళితులు సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేసి, న్యాయం చేయాలంటూ పోలీస్‌స్టేషన్‌ ఎదుట ఆందోళన చేపట్టారు. 

దళిత తహసీల్దార్‌పై దాడికి యత్నం 
చిత్తూరు జిల్లా పాకాల తహసీల్దార్‌ లోకేశ్వరిని టీడీపీ పాకాల మండల మాజీ అధ్యక్షుడు నాగరాజునాయుడు శనివారం ఫోన్‌లో అంతుచూస్తానంటూ బెదిరించాడు. దళితురాలైన ఆమెను కులం పేరుతో దూషించాడు. అనుచరులతో కలిసి తహసీల్దార్‌ కార్యాలయానికి వెళ్లి ఆమె మీద, సిబ్బంది మీద దాడికి ప్రయత్నించాడు. తహసీల్దార్‌  పాకాల పోలీసులకు ఫిర్యాదు చేయగా.. నాగరాజు, మరో ఆరుగురిపై కేసు నమోదు చేశామని, నిందితులు పరారీలో ఉన్నారని పాకాల ఎస్‌ఐ రాజశేఖర్‌ తెలిపారు.  
నిమ్మాడలో జరిగిన దౌర్జన్యకాండలో అరెస్టు చేసిన వారిని కోర్టుకు తరలిస్తున్న పోలీసులు    

పరిటాల సునీత అనుచరుల బెదిరింపులు 
అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలం మాదాపురంలో ‘మాపైనే పోటీ చేస్తావా.. మీ అంతుచూస్తాం’ అంటూ పరిటాల వర్గీయులు వీరంగం చేశారు. సర్పంచి పదవికి నాగరాజు భార్య నిర్మలమ్మ పోటీచేస్తోంది. టీడీపీకి చెందిన మాదాపురం శంకర్‌ భార్య గంగమ్మ బరిలో ఉన్నారు. సోమవారం గ్రామ వలంటీర్లు పింఛన్లు పంపిణీ చేస్తుండగా టీడీపీ నాయకుడు మాదాపురం శంకర్‌ తమ వారికి ఇంతవరకు ఎందుకు పింఛన్లు ఇవ్వలేదని వలంటీర్లపై విరుచుకుపడ్డాడు. విషయం తెలుసుకున్న స్థానికుడు బోయ నాగేంద్ర సర్దిచెప్పబోయాడు. మాపైనే మీ వదినను పోటీకి నిలుపుతావా? మీ అంతు చూస్తాం.. అంటూ శంకర్‌ బెదిరించాడు. బాధితులు రామగిరి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 

నిమ్మాడ ఘటనపై ఎస్‌ఈసీకి ఫిర్యాదు 
శ్రీకాకుళం జిల్లా నిమ్మాడ సర్పంచ్‌ స్థానానికి నామినేషన్‌ వేసేందుకు వెళ్లిన కింజరాపు అప్పన్నతో పాటు ఆయనకు అండగా వెళ్లిన తనపైన కూడా అచ్చెన్నాయుడు వర్గీయులు దాడిచేసి చంపేందుకు ప్రయత్నించారని వైఎస్సార్‌సీపీ టెక్కలి నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ దువ్వాడ శ్రీనివాస్‌ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కు ఫిర్యాదు చేశారు. శ్రీకాకుళం కలెక్టరేట్‌ ప్రాంగణంలో సోమవారం ఆయన నిమ్మగడ్డను కలిశారు. ఎన్నికలు సజావుగా జరిగేలా చర్యలు చేపట్టాలని వినతిపత్రం ఇచ్చారు.

పరారీలో కింజరాపు హరిప్రసాద్, సురేష్‌ 
టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఇలాకా అయిన నిమ్మాడలో ఆదివారం జరిగిన దౌర్జన్యకాండకు సంబంధించి 12 మందిని పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. నిమ్మాడ సర్పంచ్‌ అభ్యర్థిగా అదే గ్రామానికి చెందిన కింజరాపు అప్పన్న నామినేషన్‌ వేసేందుకు వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్‌తో కలిసి వెళ్లగా.. అచ్చెన్నాయుడు సోదరుడు హరిప్రసాద్, ఆయన కుమారుడు సర్పంచ్‌ అభ్యర్థి సురేష్, ఆయన అనుచరులు, టీడీపీ కార్యకర్తలంతా బీభత్సం సృష్టించటం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించిన విషయం విదితమే. ఈ సంఘటనపై బాధితుడు కింజరాపు అప్పన్న కోట»ొమ్మాళి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు సెక్షన్‌ 307 కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. సోమవారం సీఐ ఆర్‌.నీలయ్య, ఎస్‌ఐ రవికుమార్‌ నేతృత్వంలో 12 మందిని అరెస్టు చేసి కోటబొమ్మాళి కోర్టుకు తరలించారు. వీరికి న్యాయస్థానం 14 రోజుల రిమాండ్‌ను విధించటంతో అంపోలు జైలుకు తరలించారు. ఘటనలో ప్రధాన సూత్రధారులైన కింజరాపు హరిప్రసాద్, ఆయన కుమారుడు సురేష్‌ పరారీలో ఉన్నారు. వారికోసం పోలీసులు గాలిస్తున్నారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని నామినేషన్‌ కేంద్రం రిటర్నింగ్‌ అధికారి యు.శ్రీనివాసరావు కూడా కోటబొమ్మాళి ఎస్‌ఐ రవికుమార్‌కు ఫిర్యాదు చేశారు.   

నిమ్మాడ ఘటనలో కేసు నమోదు:డీజీపీ 
సాక్షి, అమరావతి: శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం నిమ్మాడ పంచాయతీ నామినేషన్ల సందర్భంగా.. నామినేషన్‌ వేయకుండా అడ్డుకోవడం, జన సమీకరణ చేసి శాంతిభద్రతల సమస్య సృష్టించడం వంటి వాటిపై కేసు నమోదు చేసినట్టు డీజీపీ డి.గౌతమ్‌ సవాంగ్‌ చెప్పారు. మంగళగిరిలోని పోలీస్‌ ప్రధాన కార్యాలయంలో సోమవారం ఆయన పోలీసు ప్రతినిధులతో సమావేశమయ్యారు. అనంతరం శాంతిభద్రతల అదనపు డీజీ రవిశంకర్‌ అయ్యన్నార్‌తో కలిసి డీజీపీ మీడియాతో మాట్లాడారు. రాజకీయాలకు అతీతంగా జరగాల్సిన గ్రామ పంచాయతీ ఎన్నికలను రాజకీయాలు చేస్తూ కొందరు నేతలు వివాదాస్పదం చేయడం సరికాదన్నారు. రాజకీయ జోక్యంతో రెచ్చగొట్టే ప్రయత్నాలు చేసేవారిని సాంకేతిక పరిజ్ఞానం ఇట్టే పట్టిస్తుందన్నారు. నిమ్మాడలో ఒక అభ్యరి్థకి ఫోన్‌ చేసి బెదిరించిన ఒక పార్టీ నాయకుడి ఆడియో టేపు లీకవ్వడమే ఇందుకు నిదర్శనమని చెప్పారు. ఎన్నికల అనంతరమే టీకా వేయించుకోవాలని పోలీసులు నిర్ణయించినట్లు  చెప్పారు. డీజీపీతో చర్చల అనంతరం సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జనకుల శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి ఎండీ మస్తాన్, గౌరవాధ్యక్షుడు ఎన్‌.చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు మీడియాతో మాట్లాడుతూ పోలీసుల ఆత్మస్థైర్యం దెబ్బతీసేలా రాజకీయ నేతలు చేస్తున్న విమర్శలు మానాలని కోరారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement