
సాక్షి, అమరావతి: తమ పార్టీ వారిపై తప్పుడు కేసులు పెడుతున్నారని, వాటిపై చర్యలు తీసుకోవాలని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు డీజీపీ గౌతమ్‌సవాంగ్‌ను కోరారు. ఈ మేరకు శనివారం డీజీపీకి లేఖ రాశారు. పంచాయతీ ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతర పరిణామాల్లో టీడీపీ సానుభూతిపరులపై పోలీసులు పలుచోట్ల కేసులు పెట్టారని తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలు మండలం ఇల్లాపల్లి పంచాయతీలో సర్పంచ్‌గా గెలిచిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థి విజయోత్సవ ర్యాలీ నిర్వహించి టీడీపీ మద్దతుదారులను ఇబ్బందులకు గురిచేయటంతో పాటు వారిపై తప్పుడు కేసులు పెట్టించారని చంద్రబాబు పేర్కొన్నారు.
దాడి చేసిన వారిపై కేసు పెట్టకుండా గాయపడిన బాధితులపై పోలీసులు కేసులు బనాయించారని తెలిపారు. తమ పార్టీ నేతలు ఒత్తిడి చేశాక పోలీసులు దాడి చేసిన వారిపై కేసు నమోదు చేశారని, ఇప్పుడు కేసు ఉపసంహరించుకోవాలంటూ బాధితులను పోలీసులు, వైఎస్సార్‌సీపీ నేతలు బెదిరిస్తున్నారన్నారు. పోలీసులు నిష్పాక్షికంగా వ్యవహరించేలా చూడాల్సిన బాధ్యత డీజీపీదేనన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేలా చూస్తారని ఆశిస్తున్నానన్నారు.