
సాక్షి, అమరావతి: చిత్తూరు జిల్లాలో సస్పెండ్ అయిన జడ్జి రామకృష్ణ సోదరుడు రామచంద్రపై దాడి చేసిన ప్రతాప్‌రెడ్డి టీడీపీ కార్యకర్త అని డీజీపీ గౌతం సవాంగ్ వెల్లడించారు. రామకృష్ణపై వైఎస్సార్‌సీపీ నేతలు దాడిచేశారన్న చంద్రబాబు ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని తమ విచారణలో వెల్లడైందని స్పష్టంచేశారు. రామచంద్రపై వైఎస్సార్‌సీపీ నేతలు దాడి చేశారని ఆరోపిస్తూ చంద్రబాబు డీజీపీ గౌతం సవాంగ్‌కు సోమవారం లేఖ రాసిన విషయం విదితమే. దీనిపై డీజీపీ గౌతం సవాంగ్ స్పందిస్తూ చంద్రబాబుకు మంగళవారం లేఖ ద్వారా సమాధానమిచ్చారు. రాష్ట్రంలో పోలీసులు చట్ట ప్రకారం చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని స్పష్టంచేస్తూ.. ఏదైనా అంశంపై లేఖలు రాసి మీడియాకు విడుదల చేసేముందు ఓసారి నిజానిజాలు నిర్ధారించుకోవాలని కూడా చంద్రబాబుకు సూచించారు.
దాడి ఘటనపై లేఖలో డీజీపీ పేర్కొన్న అంశాలు..
– చిత్తూరు జిల్లా బి.కొత్తకోటలో కూరగాయల మార్కెట్‌కు ఆదివారం రామచంద్ర వెళ్లారు.
– అదే సమయంలో పెద్దతిప్పసముద్రం మండలానికి చెందిన టీడీపీ కార్యకర్త ప్రతాప్‌రెడ్డి తన స్నేహితులు ముగ్గురితో కలసి ఆ మార్గంలో తన వాహనంలో వెళ్తూ ఓ తోపుడుబండి వ్యాపారితో వాగ్వాదానికి దిగారు.
– ఇందులో జోక్యం చేసుకున్న రామచంద్రపై ప్రతాప్‌రెడ్డి, ఆయనతోపాటు ఉన్న మరో ముగ్గురు దాడిచేసి గాయపరిచారు.
– రామచంద్ర ఫిర్యాదు మేరకు మదనపల్లి డీఎస్పీ కేసు విచారించారు.
– ప్రత్యక్ష సాక్షులను విచారించి, వీడియో ఫుటేజీని పరిశీలించిన అనంతరం రామచంద్రపై దాడి చేసింది ప్రతాప్‌రెడ్డి అని పోలీసులు నిర్ధారించారు.
– ప్రతాప్‌రెడ్డి టీడీపీ కార్యకర్తని కూడా తేలింది. దీంతో పోలీసులు సోమవారం అతనిని అరెస్టుచేసి కోర్టులో హాజరుపరిచారు.
– కానీ, వైఎస్సార్‌సీపీ నేతలు పథకం పన్ని రామచంద్రపై దాడి చేశారన్న ఆరోపణలు అవాస్తవం.
– కనీస స్థాయిలో కూడా నిర్ధారించుకోకుండా ఆరోపణులు చేయడం శోచనీయం.
– తప్పుడు ఆరోపణలు చేస్తే అది దుష్ప్రచారానికి దారితీసి రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్యగా మారే ప్రమాదం ఉంది.
– కాబట్టి.. ఏదైనా అంశంపై స్పందిస్తూ లేఖలు రాసి మీడియాకు వెల్లడించే ముందు సంయమనం పాటించండి.
– ప్రజల్లో లేనిపోని భయాలు, సందేహాలు, కుల ఘర్ణణలు చెలరేగేందుకు మీరు అవకాశం ఇవ్వొద్దు.
– క్షేత్రస్థాయిలో ఏదైనా అంశంపై మీ వద్ద సమాచారం ఉంటే మాకు సీల్డ్ కవర్‌లో పంపించండి. మేము దర్యాప్తు చేసి తగిన చర్యలు తీసుకుంటాం.
– రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు సహకరించండి.
Comments
Please login to add a commentAdd a comment