
సాక్షి, అమరావతి: ప్రతిపక్ష నేత చంద్రబాబు దురుద్దేశంతోనే డీజీపీ గౌతం సవాంగ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం మండిపడింది. గౌతం సవాంగ్ ఆధ్వర్యంలో రాష్ట్ర పోలీసు శాఖ జాతీయ స్థాయిలో 113 అవార్డులను సొంతం చేసుకోవడం ఆయన సమర్థతకు నిదర్శనమని కొనియాడింది. నిబద్ధతతో విధులు నిర్వహిస్తున్న డీజీపీపై చంద్రబాబు చేస్తున్న అనుచిత వ్యాఖ్యలను పోలీసు అధికారుల సంఘం గురువారం ఓ ప్రకటనలో ఖండించింది.
పోలీసు ప్రధాన కార్యాలయంలో పీఆర్వోగా విధులు నిర్వహిస్తున్న రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ సుక్రూ నాయక్‌పై మూకుమ్మడిగా దాడి చేయడం ద్వారా టీడీపీ నేతలు ఎలాంటి సందేశం ఇస్తున్నారని నిలదీసింది. టీడీపీ ప్రభుత్వ హయాంలోనే ఆయన పోలీసు ప్రధాన కార్యాలయంలో పీఆర్వోగా విధుల్లో చేరిన విషయాన్ని గుర్తు చేసింది. టీడీపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఘర్షణల గురించి మీడియా ప్రతినిధులు వివరాలు కోరడంతో.. సమాచారం తెలుసుకునేందుకే సుక్రూ నాయక్ అక్కడకు వెళ్లారని తెలిపింది. తాను పోలీసు అధికారిని అని చెప్పి గుర్తింపు కార్డు చూపించినప్పటికీ టీడీపీ నేతలు పట్టించుకోకుండా ఆయనపై దాడికి పాల్పడటాన్ని తీవ్రంగా తప్పుబట్టింది.