
సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్ డీజీపీపై టీడీపీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేయడం భావ్యం కాదని పోలీస్ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ అన్నారు. ఆయన శనివారమిక్కడ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రాజధానిలో పర్యటన సందర్భంగా చంద్రబాబు నాయుడుపై చెప్పులు, రాళ్లు విసిరిన వారిని అరెస్ట్ చేసి వెంటనే చర‍్యలు తీసుకున్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. దాడి ఎందుకు చేశారో విచారణలో నిందితులు చెప్పినవే డీజీపీ మీడియాకు వెల్లడించారన్నారు. దాడి చేయించింది డీజీపీ అని టీడీపీ నేతలు మాట్లాడటం సరికాదన్నారు. చెప్పులు వేయించే సంస్కృతి పోలీసులది కాదని, చరిత్ర తిరగేస్తే అది ఎవరి సంస్కృతో అర్థం అవుతుందన్నారు.
అనుమతి ఇస్తే ఒక రకంగా, ఇవ్వకపోతే మరో రకంగా టీడీపీ ద‍్వంద్వ వైఖరితో వ్యవహరిస్తోందని శ్రీనివాస్ మండిపడ్డారు. 40 ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు అంటే పోలీసులకు గౌరవం ఉందని, అనుచిత వ్యాఖ్యలతో టీడీపీ నేతలు ఆ గౌరవాన్ని పోగొడుతున్నారన్నారు. పోలీసులపై అభాండాలు వేయడం టీడీపీ నేతలకు ఫ్యాషన్ అయిపోయిందని విమర్శించారు. నిరాధారమైన ఆరోపణలతో టీడీపీ నేతలు జుగుప్సాకరంగా వ్యవహరిస్తున‍్నారన్నారు. పోలీస్ బాస్‌ను టార్గెట్ చేసి వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు రాజకీయ కుట్ర చేస్తున్నారని వ్యాఖ్యానించారు. పోలీసుల మనోధైర్యాన్ని, ఆత్మాభిమానాన్ని దెబ్బతీసేలా టీడీపీ వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. టీడీపీ వ్యవహారం చూస్తుంటే ఆడలేక మద్దెల మీద పడినట్లు ఉందని అన్నారు. ఇప్పటికైనా తెలుగుదేశం పార్టీ తన వైఖరి మార్చుకోకపోతే న్యాయ పోరాటానికి దిగేందుకు వెనకాడేది లేదని శ్రీనివాస్ స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment