సాక్షి, అమరావతి: గ్రామ పంచాయతీ ఎన్నికల విషయంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఏకపక్ష నిర్ణయంపై రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు తలుపు తట్టింది. గ్రామ పంచాయతీలకు ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఈ నెల 8న జారీ చేసిన షెడ్యూల్‌ను సవాలు చేస్తూ శనివారం పిటిషన్ దాఖలు చేసింది. ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేస్తూ కమిషన్ జారీ చేసిన ప్రొసీడింగ్స్‌తో పాటు ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు, బదిలీల నిలిపివేత తదితర చర్యలన్నింటినీ రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించి, రద్దు చేయాలని కోరుతూ పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఈ పిటిషన్ దాఖలు చేశారు. ప్రొసీడింగ్స్‌తో సహా తదుపరి చర్యల అమలును నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు.
ఈ వ్యాజ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి, కేంద్ర హోంశాఖ కార్యదర్శి, కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శులతో పాటు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్‌ను వ్యక్తిగత హోదాలో ప్రతివాదిగా చేర్చారు. ఎన్నికల తేదీని ప్రకటించే ముందు రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పనిసరిగా సంప్రదించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిందని, హైకోర్టు సైతం రాష్ట్ర ప్రభుత్వం తన అభ్యంతరాలు, ఆందోళనలన్నింటినీ లిఖిత పూర్వకంగా ఎన్నికల కమిషన్ ముందుంచాలని ఆదేశించిందని ద్వివేదీ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ ఆదేశాల మేరకు తాము తమ అభ్యంతరాలన్నింటినీ ఆధారసహితంగా ఎన్నికల కమిషనర్ ముందు ఉంచామని వివరించారు. ఎన్నికల కమిషన్‌తో సంప్రదింపులు జరపాలంటూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలకు సంబంధించిన కాపీ అందుబాటులోకి రాక ముందే, సంప్రదింపులకు రావాలంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పంచాయతీ రాజ్ కమిషనర్‌లకు నిమ్మగడ్డ రమేశ్ లేఖలు రాశారని తెలిపారు. ఈ వ్యాజ్యంపై సోమవారం హైకోర్టు విచారణ జరపనుంది. పిటిషన్‌లోని వివరాలు ఇంకా ఇలా ఉన్నాయి.
సంప్రదింపుల వెనుక చిత్తశుద్ధి లేదు..
– రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయాలతో నిమిత్తం లేకుండా, ప్రజల ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా ఎన్నికల విషయంలో నిమ్మగడ్డ రమేశ్ ఓ నిర్ణయానికి వచ్చేశారు. ఈ నెల 8న సంప్రదింపులకు రావాలని అధికారులను ఆదేశించారు.
– హైకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ముగ్గురు అధికారుల బృందం 8న సాయంత్రం ఎన్నికల కమిషనర్‌ను కలిసింది. మా బృందం కలిసి వచ్చిన కొద్ది గంటలకే ఎన్నికల కమిషనర్ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేశారు.
– ఎన్నికల షెడ్యూల్ విడుదలైన వేగాన్ని చూస్తే, సంప్రదింపుల ప్రక్రియ కేవలం ఓ ఫార్స్ అన్న సంగతి ఇట్టే అర్థమవుతోంది. సంప్రదింపుల విషయంలో కోర్టు ముందు అంగీకరించిన దానికి భిన్నంగా ఎన్నికల కమిషనర్ వ్యవహరించారు. నాలుగు దశల్లో ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్‌ను విడుదల చేశారు. దీనిని బట్టి షెడ్యూల్‌ను ముందుగానే సిద్ధం చేసుకున్నారని స్పష్టమవుతోంది.
– తన పదవీ విరమణ తర్వాతే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించాలని భావిస్తోందని నిమ్మగడ్డ రమేశ్ స్వయంగా చేసిన ప్రకటనే, ఈ మొత్తం విషయాన్ని చెబుతోంది. ఆ ప్రకటనే ఇప్పుడు ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసేలా చేసింది.
– రాష్ట్ర ప్రభుత్వం తన అభిప్రాయాలను చెప్పడానికి ముందే ఎన్నికల షెడ్యూల్ తయారు చేశారు. కోర్టు ఆదేశాలను అమలు చేయడానికి మాత్రమే ప్రభుత్వాధికారులతో సంప్రదింపులు జరిపారే తప్ప, చిత్తశుద్ధితో జరపలేదు. సంప్రదింపుల ప్రక్రియను, కోర్టు ఆదేశాలను ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ అపహాస్యం చేశారు.
కోవిడ్ వ్యాక్సినేషన్ ఎంతో ముఖ్యమని చెప్పినా వినలేదు
– ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదనేందుకు ప్రభుత్వం చెప్పిన కారణాలు, క్షేత్ర స్థాయి పరిస్థితులను వివరిస్తూ అందజేసిన ఆధారాలను నిమ్మగడ్డ పరిగణనలోకి తీసుకోలేదు. ఏకపక్షంగా షెడ్యూల్ విడుదల చేశారు.
– కోవిడ్ వ్యాక్సిన్ విషయంలో రాష్ట్రాలను సన్నద్ధం చేసేందుకు కేంద్ర హోం శాఖ, కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలు రాష్ట్ర ప్రభుత్వాలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నాయి. సాధారణ ఎన్నికలను ఎలా నిర్వహిస్తారో అలా కోవిడ్ వ్యాక్సిన్ కార్యక్రమాన్ని నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం చెబుతూ వస్తోంది.
– ప్రభుత్వ యంత్రాంగం మొత్తాన్ని ఈ కార్యక్రమంలో నిమగ్నం చేయాలని కోరుతోంది. ఈ నెల 11న ప్రధాన మంత్రి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కోవిడ్ వ్యాక్సిన్ సన్నద్దత, విధి విధానాలు తదితరాలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడనున్నారు.
– ఈ విషయాన్ని కూడా ఎన్నికల కమిషనర్ దృష్టికి తీసుకెళ్లాం. ప్రధాన మంత్రి ప్రకటన తర్వాత నిర్ణయం తీసుకోవాలని కూడా కోరాం. ఇప్పటికే వ్యాక్సినేషన్ మార్గదర్శకాలను జారీ చేసిన విషయాన్ని కూడా కమిషనర్‌కు వివరించాం. పోలీసులతో సహా మొత్తం అధికార యంత్రాంగం కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో పాల్గొనడం ఎంత ముఖ్యమో తెలియజేశాం.
దురుద్దేశంతోనే ఈ నిర్ణయం
– వీటన్నింటినీ బేఖాతరు చేస్తూ ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేశ్ దురుద్దేశంతో ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేశారు. దీని వెనుక నిమ్మగడ్డకు కుటిల ఉద్దేశాలున్నాయి. ఎన్నికలను వాయిదా వేయాలన్న నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం క్షేత్ర స్థాయి పరిస్థితులను, ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని తీసుకుంది.
– దీనికి, రాజకీయ పార్టీలకు ఎలాంటి సంబంధం లేదు. ప్రభుత్వ నిర్ణయాల్లో పార్టీ నేతల జోక్యం ఉండదు. ఇదే విషయాన్ని ఎన్నికల కమిషనర్‌కు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చాలా స్పష్టంగా చెప్పారు.
– నిమ్మగడ్డ రమేశ్ తన నోటిఫికేషన్‌లో బీహార్, కేరళ, అమెరికాలను ఉదాహరణగా పేర్కొన్నారు. ఆ ప్రాంతాల్లో ఎన్నికల తర్వాత కోవిడ్ కేసులు భారీగా పెరిగాయి. కేరళలో ఎన్నికలను నోటిఫై చేసిన నవంబర్ నాటికి 4.50 లక్షల కేసులు ఉంటే, మూడో దశ ఎన్నికల నాటికి ఆ సంఖ్య 6.50 లక్షలకు చేరింది.
– ఈ రోజుకు (శనివారం) కేరళలో కోవిడ్ కేసులు 8.01 లక్షలు. అమెరికా విషయానికొస్తే, అమెరికా అధ్యక్ష్య ఎన్నికలు జరిగే నాటికి అక్కడ కోవిడ్ కేసులు 97.53 లక్షలు. ఇప్పుడు ఆ సంఖ్య 2.21 కోట్లకు చేరింది.
– ఇదే రీతిలో రాజస్తాన్, బీహార్‌లలో కూడా ఎన్నికల తరువాత కేసుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇక్కడ ఎన్నికలు నిర్వహించే నాటికి కోవిడ్ వ్యాక్సినేషన్‌కు సంబంధించి ఎలాంటి ప్రణాళికలు సిద్ధం కాలేదు. మార్గదర్శకాలు కూడా జారీ కాలేదు.
నిమ్మగడ్డ ఇష్టాయిష్టాలకు ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టలేం
– రాష్ట్ర ప్రభుత్వం ఎన్నడూ కూడా ప్రజాస్వామ్యయుతంగా నిర్వహించే ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోదు. ఎన్నికల ప్రక్రియపై రాష్ట్రానికి ఆపార గౌరవం ఉంది. ప్రజల ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది.
– ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేశ్ ఇష్టానుసారం తీసుకునే నిర్ణయాలకు ప్రజల ఆరోగ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం పణంగా పెట్టలేదు. పౌరుల, ప్రభుత్వాధికారుల ఆరోగ్యాన్ని, ప్రాణాలను కాపాడాల్సిన రాజ్యాంగపరమైన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.
– దేశం మొత్తం ఇప్పుడు జాతీయ విపత్తుల నిర్వహణ చట్టం పరిధిలో ఉంది. ఇలాంటి సమయంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు చేయడం సరికాదు. దీనిపై మా అభ్యంతరాలను పట్టించుకోలేదు.
– నిమ్మగడ్డ రమేశ్ ప్రభుత్వ వ్యతిరేక భావనతో ఉన్నారు. ఎన్నికల షెడ్యూల్ జారీ వెనుక సదుద్దేశాలు, హేతుబద్ధత ఎంత మాత్రం లేదు. కోవిడ్ వ్యాక్సినేషన్ దృష్ట్యా ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం అధికార యంత్రాంగాన్ని సన్నద్ధం చేయలేదన్న విషయాన్ని నిమ్మగడ్డ రమేశ్ ఉద్దేశపూర్వకంగా విస్మరిస్తున్నారు. ప్రజల ఆరోగ్యం ముడిపడి ఉన్న ఈ వ్యవహారంలో న్యాయస్థానం జోక్యం చేసుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment