సాక్షి, అమరావతి: ఎక్కడైనా సరే ప్రభుత్వ వ్యవస్థలంటే.. ఏ స్థాయిలో ఉన్నవారైనా, ఎలాంటి అధికారిక నిర్ణయం తీసుకోవాలన్నా అది ఎందుకోసమో తెలియచేస్తూ పారదర్శకత కోసం నోట్ ఫైల్స్‌తో కూడిన దస్త్రం (ఫైల్) ఉంటుంది. కానీ రాజ్యాంగబద్ధంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ హోదాలో ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ మాత్రం ఎలాంటి నోట్ ఫైల్స్, ఫైల్స్ లేకుండానే వరుసగా అత్యంత వివాదాస్పద నిర్ణయాలను ఎడాపెడా తీసుకుంటున్నారు. సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ) ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్‌ను ఆ బాధ్యతల నుంచి తప్పిస్తూ శుక్రవారం తీసుకున్న నిర్ణయంతో సహా ఇటీవల నిమ్మగడ్డ పలు వివాదాస్పద నిర్ణయాలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయంలో కనీసం ఎందుకు తీసుకున్నారో తెలియజేసే ఫైళ్లు కూడా లేవని విశ్వసనీయంగా తెలిసింది. నిమ్మగడ్డ రమేష్‌కుమారే ఒక కారణాన్ని వెతుక్కోవడం.. ఆ వెంటనే తనకు విచక్షణాధికారాలు ఉన్నాయంటూ నిబంధనలను తుంగలోకి తొక్కి చర్యల పేరుతో ఉత్తర్వులు జారీ చేయడం నిత్యకృత్యంగా మారింది. నిమ్మగడ్డ నిర్ణయాలు అప్రజాస్వామికంగా, పూర్తిగా రాచరికపు పోకడలను తలపిస్తున్నాయని రాజకీయ పరిశీలకులు, రాజ్యాంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. చరిత్రలో పేరుపొందిన నియంతలను సైతం మరిపిస్తూ ఇష్టానుసారంగా వ్యవహరించడాన్ని తప్పుబడుతున్నారు.
రాష్ట్రపతి నుంచి న్యాయమూర్తుల దాకా..
రాష్ట్రపతి నుంచి ప్రధానమంత్రి వరకు తమకు అందే వినతులు, తాము తీసుకునే నిర్ణయాలకు సంబంధించి అన్ని వివరాలను ఒక ఫైల్ రూపంలో పొందుపరచడం అనవాయితీ అని అధికార వర్గాలు వెల్లడించాయి. ఉన్నత న్యాయస్థానాల్లో వెలువరించే తీర్పులకు సంబంధించి కూడా ఆ కేసుల తాలూకు అన్ని వివరాలను ప్రత్యేకంగా పైళ్ల రూపంలో పొందుపరుస్తారని పేర్కొన్నాయి.
నిర్ణయం ఎంత చిన్నదైనా..
ప్రభుత్వ అధికారులు ఎంత చిన్న నిర్ణయం తీసుకోవాలన్నా ‘ప్రతిపాదన’ అనే ప్రాధమిక రూపం నుంచి ప్రక్రియ మొదలవుతుంది. తొలిదశలో ప్రతిపాదన నోట్ ఫైల్‌గా రూపుదిద్దుకుంటుంది. సాధారణంగా కార్యాలయ దిగువస్థాయి అధికారి నోట్‌ఫైల్‌ను రూపొందించి తన పై అధికారికి పంపిస్తారు. పై అధికారి నోట్ ఫైల్‌లో అవసరమైన మార్పులు చేయడంతో పాటు తన అభిప్రాయాన్ని, రూల్ పొజిషన్‌ను పేర్కొంటూ సంతకం చేస్తారు. అక్కడ నుంచి సంబంధిత ఉన్నతాధికారికి ఫైలు వెళుతుంది. అవసరమైన మార్పులు చేర్పులు అనంతరం నిబంధనలకు అనుగుణంగా ఆ ప్రతిపాదన ఉంటే ఆమోదించి ఉత్తర్వులు జారీ చేస్తారు. ఎన్నికల కమిషన్ కార్యాలయంలో కూడా ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ఇదే విధానాలను అమలు చేయాల్సి ఉంటుందని అధికార వర్గాలు వివరించాయి. సాధారణంగా రాజకీయ పార్టీలు లేదా ఇతరులెవరైనా ఫిర్యాదులు చేయకుండా రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఎలాంటి నిర్ణయాలు తీసుకోదు. కానీ నిమ్మగడ్డ మాత్రం ప్రజాస్వామ్య పద్ధతులను విస్మరించి నియంతృత్వ పోకడలతో ఆదేశాలు జారీ చేస్తున్నట్లు తేటతెల్లమవుతోంది.
ఎక్కడో తయారైన ఆదేశాలను జారీ చేస్తున్నారా?
ఎన్నికల కమిషన్ కార్యాలయంలో కనీసం నోట్ ఫైల్స్ కూడా లేకుండా వివాదస్పద ఆదేశాలను జారీ చేస్తున్న నిమ్మగడ్డ బయట ఎక్కడో రూపొందించిన వాటిని తన పేరుతో విడుదల చేస్తున్నట్లు పరిశీలకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గతేడాది జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియను మధ్యలోనే వాయిదా వేసినప్పుడు నిమ్మగడ్డ 2020 మార్చిలో రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తూ కేంద్ర హోంశాఖకు లేఖ రాశారు. టీడీపీ కార్యాలయంలో తయారైన లేఖపై ఆయన సంతకం చేసి పంపినట్లు ఆరోపణలు వ్యక్తమయ్యాయి. ఎన్నికల కమిషన్ కార్యాలయంలో కాకుండా బయట తయారై వచ్చిన లేఖను నిమ్మగడ్డ కేంద్ర హోంశాఖకు పంపారన్న ఫిర్యాదుపై సీఐడీ విచారణ ప్రారంభం కాగా కోర్టు జోక్యంతో నిలిచిపోయింది. తాజాగా కూడా నిమ్మగడ్డ ఆదేశాలు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయంలో కాకుండా బయటే రూపుదిద్దుకుని వస్తున్నాయని, వాటినే నిమ్మగడ్డ తన పేరుతో జారీ చేస్తున్నారని రాజకీయ వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది.
తీర్పులు రావడమే ఆలస్యం..
ఎన్నికల కమిషన్ కార్యాలయంలోని నిమ్మగడ్డ ఛాంబరు (ఆయన విజయవాడలో ఉంటే రాత్రి వేళ కూడా అక్కడే గడుపుతూ నిద్రపోతుంటారు)లోకి ఎప్పడో ప్రత్యేక పరిస్థితుల్లో మినహా కార్యాలయ అధికారులను సైతం రానివ్వరని సిబ్బంది వెల్లడించారు. చాలా సందర్భాల్లో కీలక ఆదేశాలను నిమ్మగడ్డ తన ఛాంబరు నుంచే మొదట పేపరు మీద రాసి వాటిని వ్యక్తిగత భద్రతా సిబ్బంది, అటెండర్ ద్వారా ఒకరిద్దరు అధికారుల వద్దకు పంపి టైపు చేయించి అనంతరం ఆ కాగితాలపై సంతకాలు చేసి ఆదేశాల పేరుతో జారీ చేస్తున్నారని కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. నిమ్మగడ్డ చెబుతున్న ప్రకారమే రాష్ట్ర ఎన్నికల కమిషన్‌లో సిబ్బంది సంఖ్య తక్కువగా ఉంది. కానీ కోర్టు తీర్పులు లాంటివి వచ్చిన తర్వాత కేవలం 10 – 20 నిమిషాల వ్యవధిలోనే పేజీలకు పేజీలు ఆదేశాలు రూపొందించి మెరుపు వేగంతో జారీ చేస్తున్నారంటే దీని వెనుక అదృశ్య హస్తం ఉందనే అనుమానాలు బలపడుతున్నాయి. ఇలాంటి ఉత్తర్వులు రూపొందించేందుకు ఓ రాజకీయ పార్టీ ట్రస్టు భవన్‌లో ప్రత్యేకమైన ఏర్పాట్లు ఉన్నాయనే విమర్శలున్నాయి. రాష్ట్ర ఎన్నికల కమిషన్ స్వతంత్రతను ఆ అదృశ్య శక్తులు నీరుగారుస్తున్నాయని, కమిషన్ కార్యాలయ ఉద్యోగులను కాకుండా ట్రస్టు భవన్ సేవలను వినియోగించుకోవడం వెనక లక్ష్యం ఏమిటనేది వరుసగా జారీ అవుతున్న వివాదాస్పద ఉత్తర్వులే రుజువు చేస్తున్నాయని పరిశీలకులు పేర్కొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment