ఈ–వాచ్‌ యాప్‌ విడుదల చేసిన ఎస్‌ఈసీ నిమ్మగడ్డ  | E-Watch App released by SEC Nimmagadda Ramesh Kumar | Sakshi
Sakshi News home page

యాప్, డేటా భద్రత అంతా ప్రశ్నార్థకమే

Published Thu, Feb 4 2021 3:35 AM | Last Updated on Thu, Feb 4 2021 11:43 AM

E-Watch App released by SEC Nimmagadda Ramesh Kumar - Sakshi

నిమ్మగడ్డ ఆవిష్కరించిన ఈ వాచ్‌ యాప్‌

సాక్షి, అమరావతి: ప్రజాస్వామ్య ప్రక్రియను అపహాస్యం చేస్తూ, అందరి అనుమానాలను నిజం చేస్తూ, కీలకమైన ఎన్నికల నిఘా వ్యవస్థ మొత్తాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ పూర్తిగా ప్రైవేట్‌ వ్యక్తుల చేతుల్లో పెట్టేశారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో కొనసాగుతూ ప్రముఖ కార్పొరేట్‌ కంపెనీ రిలయన్స్‌ పేరును తెరపైకి తెచ్చి ఎన్నికల ప్రక్రియతో ఆటలాడారు. రోజుకో రకంగా మాట్లాడుతూ పారదర్శకతకు పాతరేస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఈ మేరకు ఆయన తన సొంత యాప్‌ను తాజాగా ఆవిష్కరించారు. పంచాయతీ ఎన్నికల్లో పోలింగ్‌ రోజు ఎక్కడైనా అవాంఛనీయ ఘటనలు జరిగితే ఆ ఫిర్యాదులను తొలుత నిమ్మగడ్డ ఎంపిక చేసిన ప్రైవేట్‌ ఏజెన్సీ ప్రతినిధులు పరిశీలించాకే కలెక్టర్లకు పంపుతారు. అంటే వడపోత అనంతరం అవసరాన్ని బట్టి మాత్రమే ఎంపిక చేసిన ఫిర్యాదులను పరిశీలించేలా ఏర్పాట్లు జరిగినట్లు స్పష్టమవుతోంది. కాగా ఈ యాప్‌తో తమకు ఎలాంటి సంబంధం లేదని రిలయన్స్‌ జియో ప్రతినిధులు స్పష్టం చేశారు. తమ కంపెనీ పేరుతో జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఖండించారు.

యాప్‌ రూపకల్పనకు సంబంధించి నిమ్మగడ్డ తన ప్రెస్‌మీట్‌లో ప్రస్తావించిన సాంబశివరావు, మదన్‌మోహన్‌రెడ్డిని ‘సాక్షి’ సంప్రదించగా ఈ వ్యవహారంతో తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. తమతో కేవలం యాప్‌ల గురించి మాత్రమే మాట్లాడారని, తమ కంపెనీ ద్వారా దీన్ని రూపొందించలేదని వెల్లడించారు. కమిషన్‌ తన సొంత వనరులతో యాప్‌ తయారీ చేసుకున్నట్లు నిమ్మగడ్డ ప్రకటించడంపై విస్మయం వ్యక్తమవుతోంది. అంత సాంకేతిక నైపుణ్యం కలిగిన ఉద్యోగులు అసలసక్కడ ఉన్నారా? అన్ని వనరులున్నాయా? కమిషన్‌ కార్యాలయంలో ఎవరితోనూ సంబంధం లేకుండా నిమ్మగడ్డ ఒంటిచేత్తో ఓ యాప్‌ను ఆగమేఘాలపై తేవడం సాధ్యమేనా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. టీడీపీ ద్వారా దీన్ని రూపొందించినట్లు చెప్పలేక, సొంత వనరులంటూ ఆయన చెబుతున్నారని స్పష్టమవుతోంది. 

ఔట్‌సోర్సింగ్, ప్రైవేట్‌ ఏజెన్సీ ముసుగులో..
ఎన్నికల్లో పారదర్శకత కోసం 2020 మార్చిలో రాష్ట్ర ప్రభుత్వం, పంచాయతీరాజ్‌ శాఖలు సంయుక్తంగా తయారు చేయించి జడ్పీటీసీ, ఎన్నికల్లో వినియోగించిన నిఘా యాప్‌ను పూర్తిగా పక్కన పెట్టేసి నిమ్మగడ్డ తన సొంత యాప్‌ ’ఈ–వాచ్‌’ను బుధవారం ఎన్నికల కమిషన్‌ కార్యాలయంలో ఆవిష్కరించడం పలు సందేహాలకు తావిస్తోంది. గురువారం నుంచి ఇది ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉంటుందని కమిషన్‌ ప్రకటించింది. పార్టీ రహితంగా జరిగే పంచాయతీ ఎన్నికల్లో టీడీపీకి ప్రయోజనం చేకూర్చేందుకే నిమ్మగడ్డ ప్రైవేట్‌ యాప్‌ను సిద్ధం చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో పనిచేసిన వారు, ఆ పార్టీ సానుభూతిపరులు ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులుగా, ప్రైవేట్‌ ఏజెన్సీల రూపంలో ఎన్నికల కమిషన్‌ కార్యాలయంలో చొరబడి ఈ తతంగాన్ని నిర్వహించనున్నట్లు వెల్లడవుతోంది. తాము అనుకున్నట్లుగా ఫొటోలు, వీడియోలను మార్ఫింగ్, ఎడిటింగ్‌ చేసి ఫిర్యాదులను పంపే అవకాశం ఉంది. 
 
కాల్‌ సెంటర్‌లో ఐదుగురు వ్యక్తుల ద్వారా..

ఎన్నికల అక్రమాలపై యాప్‌ ద్వారా ఎవరు ఫిర్యాదు చేసినా నేరుగా కలెక్టర్లు, ఎస్పీలకు వెళ్లదని రాష్ట్ర ఎన్నికల కమిషనే ప్రకటించింది. యాప్‌ ద్వారా నమోదయ్యే ఫిర్యాదు ముందుగా రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ కార్యాలయంలో ఉండే కాల్‌ సెంటర్‌కు చేరుతుంది. అయితే ఆ కాల్‌ సెంటర్‌ ప్రైవేట్‌ ఏజెన్సీ ఆధ్వర్యంలోనే పనిచేస్తుందని నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌తో పాటు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ కార్యాలయ కార్యదర్శి కన్నబాబు వివరించారు. దీన్ని సమర్ధించుకుంటూ దేశంలో ఏ కాల్‌ సెంటర్‌లోనైనా ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు లేదా ప్రైవేట్‌ ఏజెన్సీకి సంబంధించిన వ్యక్తులే పనిచేస్తారని, వారిని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఉద్యోగులు పర్యవేక్షిస్తుంటారని నిమ్మగడ్డ తెలిపారు. యాప్‌తో అనుసంధానించి కమిషన్‌ కార్యాలయంలో ఏర్పాటయ్యే కాల్‌ సెంటర్‌లో ఐదుగురు వ్యక్తులు ఉంటారని, వారంతా ప్రైవేట్‌ ఏజెన్సీకి చెందిన వారని వెల్లడించారు. ఆ ప్రైవేట్‌ ఏజెన్సీ పేరు ప్రత్యేకంగా చెప్పకుండానే రిలయన్స్‌కు పార్ట్‌నర్‌గా వ్యవహరించే సునందకు సంబంధించినదని పేర్కొన్నారు. 

సమస్యల పరిష్కారం సృష్టికర్తలదే..!
యాప్‌ ద్వారా అందే ఫిర్యాదులను కాల్‌ సెంటర్‌లో పనిచేసే ప్రైవేట్‌ వ్యక్తులు తీవ్రతను బట్టి వర్గీకరించి కలెక్టర్లకు ఏవి పంపాలో నిర్థారించేలా ప్రక్రియను రూపొందించినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ కార్యదర్శి తెలిపారు. యాప్‌ను పూర్తిగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ సూచనలు, సలహాల మేరకు తయారు చేయించినట్లు చెప్పారు. యాప్‌ నిర్వహణలో బగ్స్‌ లాంటి సమస్యలు తలెత్తితే ప్రభుత్వ ఐటీ విభాగం ద్వారా కాకుండా యాప్‌ తయారు చేసిన వారి ద్వారానే పరిష్కరించనున్నట్లు ఎన్నికల కమిషన్‌ కార్యాలయం తెలిపింది. 

నిపుణులు లేకుండా.. రూపాయి ఖర్చు కాకుండా సాధ్యమేనా?
సాధారణంగా ఓ యాప్, వెబ్‌సైట్‌కు రూపకల్పన చేయాలంటే కనీసం రూ.లక్షల్లోనే ఖర్చవుతుంది. కానీ నిమ్మగడ్డ యాప్‌ తయారీకి ఎలాంటి ఖర్చు కాలేదని ఆయనే ప్రకటించడంతో సందేహాలు ముసురుకుంటున్నాయి. కమిషన్‌ కార్యాలయంలో ఉండే వనరులను వినియోగించుకుని సొంతంగా యాప్, వెబ్‌ అప్లికేషన్‌ తయారు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ చెబుతున్నారు. అయితే అధికారిక వర్గాల సమాచారం మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ కార్యాలయంలో స్టాఫ్ట్‌వేర్‌ పరంగా ప్రావీణ్యం కలిగిన ఉద్యోగులెవరూ లేరు. అలాంటప్పుడు ఎలాంటి ఖర్చు లేకుండా ఈ యాప్‌ ఎలా తయారు చేశారని సామాన్యుడికి కూడా అనుమానం కలుగుతుంది. దీన్ని బట్టి ఎక్కడో తయారు చేసిన యాప్‌ను ఈ ఎన్నికలకు వినియోగిస్తున్నట్లు నిర్థారణ అవుతోంది. 

ఫిర్యాదుదారులకు రక్షణుందా?
యాప్‌ ద్వారా ఫిర్యాదు చేసే వారి వివరాలు కాల్‌సెంటర్‌ సిబ్బందికి కూడా తెలియకుండా జాగ్రత్తలు తీసుకుంటామని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ప్రకటించింది. అయితే యాప్‌ హ్యాకింగ్‌ జరిగే అవకాశాల గురించి ఏమాత్రం పరిశీలన చేయకుండానే హడావుడిగా ఆవిష్కరించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఫిర్యాదుదారుల వివరాలు బహిర్గతమైతే గ్రామాల్లో అశాంతికి ఆజ్యం పోసినట్లే అవుతుందని హెచ్చరిస్తున్నారు.

జియో యాప్‌ తెద్దామనుకున్నాం కానీ..
పంచాయతీ ఎన్నికల కోసం జియో యాప్‌ తెస్తున్నట్లు తొలుత నిమ్మగడ్డ స్వయంగా మీడియాకు చెప్పారు. అయితే ఇప్పుడు సొంతంగా తయారు చేయించామంటూ మరో యాప్‌ ప్రవేశపెట్టారు. ‘మొదట రిలయెన్స్‌ జియో ద్వారా దీనిని పెడతామని చెప్పా. జియో యాప్‌లో అంతర్భాగంగా చేద్దామనుకున్నాం. కానీ సాంకేతిపరమైన సమస్యలొచ్చాయి. పరిష్కరించే సమయం లేక మేమే సొంతంగా తయారు చేయించాం. ప్రభుత్వం నిఘా యాప్‌ తీసుకురావడం మంచిదే. కాకపోతే అది అవసరాలకు అనుగుణంగా ఉన్నట్లు తోచలేదు. నిఘా యాప్‌పై అపనమ్మకం ఉందని కాదు. ఎన్నికల కమిషనర్‌ తోడ్పాటు లేకుండా వాళ్లు సొంతంగా చేసుకున్నారు. ఆ నిఘా యాప్‌ను వాళ్లు ఉపయోగించుకోవచ్చు. ఎన్నికల కమిషన్‌కు ఆ నిఘా యాప్‌పై అపనమ్మకం లేదు. కమిషన్‌ అవసరాలకు ‘ఈ వాచ్‌’ యాప్‌ తెస్తున్నాం’ అని నిమ్మగడ్డ పేర్కొన్నారు.  

‘ఈ–వాచ్‌’... ఇలా
–యాప్, వెబ్‌ అప్లికేషన్‌ ద్వారా ఎవరైనా ఫిర్యాదు చేయగానే అది కాల్‌ సెంటర్‌కు వెళుతుంది. 
– కాల్‌ సెంటర్‌ ఫిర్యాదులను కేటగిరీలవారీగా.. తీవ్రమైన ఫిర్యాదా.. ? సాధారణ ఫిర్యాదా? అని వర్గీకరిస్తుంది.
తర్వాత ఆ ఫిర్యాదును సంబంధిత కలెక్టర్లకు కాల్‌ సెంటర్‌ ప్రతినిధులు పంపుతారు.
–కలెక్టర్లు ఆ ఫిర్యాదుపై చర్యలు తీసుకున్నాక తిరిగి యాప్‌లో వివరాలు నమోదు చేస్తే కాల్‌ సెంటర్‌కు అందుతాయి.
–కాల్‌ సెంటర్‌లో ఉండే వ్యక్తులు ఫిర్యాదు చేసిన వ్యక్తికి ఫోను చేసి సక్రమంగా పరిష్కరించారా... లేదా? అని వాకబు చేస్తారు. 
– ఫిర్యాదుదారుడు అసంతృప్తి వ్యక్తం చేస్తే ఆ ఫిర్యాదును తిరిగి ఓపెన్‌ చేసే అవకాశం ఉంటుంది. 
– యాప్‌ ద్వారా అందే ఫిర్యాదుల వివరాలు అందరికీ తెలిసేలా వెబ్‌సైట్‌లో ఉండవు. కేవలం ఎన్ని ఫిర్యాదులు వచ్చాయన్న సంఖ్య మాత్రమే డ్యాష్‌ బోర్డు రూపంలో ఉంచుతారు. 

ఏకగ్రీవ నినాదం బాగా వెనుకబడింది 
ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌
సాక్షి, అమరావతి/తిరుపతి: పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ‘ఈ–వాచ్‌’ యాప్‌ ద్వారా అందే సీరియస్‌ ఫిర్యాదులను కలెక్టర్లు, ఎస్పీలు సకాలంలో పరిష్కరించని పక్షంలో ఎన్నికనే రద్దు చేయాల్సి ఉంటుందని ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌ పేర్కొన్నారు. అతి తీవ్రత ఉండే ఫిర్యాదులను అరగంటలోపే పరిష్కరించాలన్నారు. ఎన్నికల నిఘాకు తాను సొంతంగా తయారు చేయించిన ‘ఈ–వాచ్‌’ యాప్‌ను బుధవారం ఆయన ఆవిష్కరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ యాప్‌పై క్షేత్రస్థాయిలో ప్రచారం చేసే బాధ్యత కలెక్టర్లకు అప్పగిస్తున్నట్లు తెలిపారు. ఏకగ్రీవం నినాదం బాగా వెనుకబడిపోయిందని, అభ్యర్థులు పెద్ద సంఖ్యలో స్వచ్ఛందంగా వచ్చి నామినేషన్లు వేస్తున్నారన్నారు. 

తక్కువ మాట్లాడతా..
యాప్‌పై కొందరు కోర్టుకు వెళ్లడంపై ఆయన స్పందిస్తూ.. ‘వాళ్ల పని వాళ్లు చేసుకుంటారు. మన పని మనం చేసుకుంటాం. సుప్రీంకోర్టు చెప్పాక ఇక ఆగుతాయా? చిన్నాచితకా ఉంటూ ఉంటాయి. కోర్టులో కేసు పడకపోతే ఆశ్చర్యపోవాలి గానీ కేసు వేశారంటే.. నాకైతే ఏమీ ఆశ్చర్యం కలిగించడం లేదు’ అని వ్యాఖ్యానించారు. తాను తక్కువగా మాట్లాడి ఎక్కువగా పని చేసుకుంటూ పోతానన్నారు. కార్యక్రమంలో ఉన్నతాధికారులు కన్నబాబు, గోపాలకృష్ణ ద్వివేది, గిరిజా శంకర్, సంజయ్‌ పాల్గొన్నారు. తాను మాట్లాడటం పూర్తవగానే విలేకరుల ప్రశ్నలకు జవాబు చెప్పకుండానే నిమ్మగడ్డ నిష్క్రమించారు. కాగా, రాజ్యాంగంలో తన పరిధి చాలా చిన్నదని, ఆ మేరకే రాజ్యాంగబద్ధంగా నడుచుకుంటున్నానని ఎస్‌ఈసీ నిమ్మగడ్డ చెప్పారు. చిత్తూరు జిల్లా అధికారులతో  తిరుపతిలో సమీక్ష నిర్వహించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement