సాక్షి, అమరావతి: కరోనా వ్యాక్సినేషన్ వేళ ఎన్నికలొద్దని అందరూ చెబుతున్నా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఎందుకు వినిపించుకోవడం లేదు? హడావుడిగా 2019 ఓటర్ల జాబితాతోనే ఎన్నికలు నిర్వహిస్తామని ఎందుకు చెబుతున్నారు? ఒకవేళ ఎన్నికలు తప్పదనుకుంటే గతంలో ప్రక్రియ ఎక్కడ ఆగిపోయిందో అక్కడి నుంచే తిరిగి మొదలు పెట్టాలి కదా? మధ్యలో ఆగిపోయిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను అలా గాలికొదిలేసి కొత్తగా పంచాయతీ ఎన్నికలకు ఎందుకు నోటిఫికేషన్ ఇచ్చినట్లు? లక్షలాది మంది ప్రజల మదిని తొలుస్తున్న ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం అంపశయ్యపై ఉన్న టీడీపీకి ఊతమివ్వడానికేనని స్పష్టమవుతోంది. తనకు పదవి కట్టబెట్టడానికి కారణమైన రాజకీయ పెద్దల ప్రయోజనాల కోసమే పని చేస్తున్నట్టు స్పష్టమవుతున్నా, ఏమాత్రం జంకకుండా నిర్ణయాలు తీసుకుంటుండటం రాజకీయ పరిశీలకులను విస్మయ పరుస్తోంది.
గ్రామాల్లో జనం గ్రూపులుగా విడిపోవాలి..
– మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో 151 అసెంబ్లీ స్థానాలలో వైఎస్సార్‌సీపీ గెలుపొందిన తర్వాత తెలుగుదేశం పార్టీ రాజకీయంగా పూర్తిగా బలహీన పడిందనేది అందరికీ తెలిసిందే. ఎంతో మంది నేతలు, కార్యకర్తలు ఆ పార్టీని వీడుతున్న సంగతి కూడా విదితమే. ఏకంగా పలువురు ఆ పార్టీ ఎమ్మెల్యేలు కూడా వైఎస్ జగన్‌కు మద్దతు ప్రకటించడం చూస్తున్నాం.
– ఈ పరిణామాలను తట్టుకోలేక ఆ పార్టీ పెద్దలు దిగజారుడు రాజకీయం చేస్తుండటం స్పష్టంగా కనిపిస్తోంది. ఇది ఇలానే కొనసాగితే మిగిలిన కొద్దిపాటి మంది కూడా పార్టీకి దూరమవ్వడం ఖాయం అనే భయం చంద్రబాబు అండ్ కో కు పట్టుకుంది.
– ఈ పరిస్థితి నుంచి కాస్తా అయినా కోలుకోడానికి ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను అడ్డుపెట్టుకుని, వారి వ్యూహం ప్రకారం స్థానిక ఎన్నికల ప్రక్రియను వాడుకుంటూ పావులు కదిపారని స్పష్టమవుతోంది.
ఆ రోజు భయంతో వాయిదా
– గత ఏడాది మార్చిలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియ మొదలైంది. అప్పటికే వైఎస్ జగన్ తనదైన శైలిలో ఇచ్చిన హామీల్లో సింహ భాగం నెరవేర్చడంతో పాటు ఎన్నో విప్లవాత్మక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. దీంతో పలు ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. వార్ వన్‌సైడ్‌గా మారిపోతోందని స్పష్టమైంది. ఇది గమనించి, టీడీపీ పెద్దలు ఇచ్చిన సూచన మేరకు నాడు నిమ్మగడ్డ ఉన్నట్లుండి కరోనా పేరుతో ఆ ఎన్నికలను అర్ధంతంగా వాయిదా వేశారు.
– ఆ రోజు కరోనా కేసులు పదుల సంఖ్యలో కూడా లేవు. అలాంటి పరిస్థితిలో ఆ ఎన్నికలను ఆపేసిన నిమ్మగడ్డ.. ఈ రోజు కరోనా కేసులు వందల సంఖ్యలో వస్తున్నప్పటికీ, వ్యాక్సినేషన్ కొనసాగుతున్నప్పటికీ తిరిగి ఎన్నికలు అంటూ హడావుడి చేస్తున్నారు. ఏకకాలంలో ఇటు వ్యాక్సినేషన్, అటు ఎన్నికలు సాధ్యం కాదని తెలిసినా టీడీపీ అజెండా మేరకు ఎన్నికలు నిర్వహించి తీరాలన్న పట్టుదలతో ముందుకెళుతున్నారు.
– అప్పట్లో ఏకగ్రీవం అయినవి కాకుండా రాష్ట్రంలో 7,331 ఎంపీటీసీ స్థానాలకు, 526 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికల ప్రక్రియ మధ్యలోనే ఆగిపోయింది. 19 వేల మంది అభ్యర్థులు ఎంపీటీసీల బరిలో, 2,092 మంది అభ్యర్థులు జెడ్పీటీసీల బరిలో ఉన్నారు.
– ఈ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులతో 652 మండల పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్షులను, 13 జిల్లాల జెడ్పీ చైర్మన్‌లను ఎన్నుకోవాల్సి ఉంది. మరి ఈ ఎన్నికల ప్రక్రియను కొనసాగించకుండా, దీని ఊసే ఎత్తకుండా పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇవ్వడం వెనుక టీడీపీ దురాలోచనే కారణమని స్పష్టమవుతోంది.
ఈరోజు టీడీపీ ఉనికి కోసం ‘పంచాయతీ’
– పార్టీ గుర్తులతో సంబంధం లేకుండా జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికలను వ్యూహాత్మకంగా ఉపయోగించుకుని ఉనికి కాపాడుకునేందుకు టీడీపీ పెద్దలు స్కెచ్ వేశారు. పార్టీ రహితంగా ఈ ఎన్నికలు జరుగుతాయి కాబట్టి, ప్రతి గ్రామంలో గ్రూపు రాజకీయాలు మామూలే.
– పంచాయతీ ఎన్నికల కారణంగా గ్రామాల్లో కక్షలు, గ్రూపులు వీలైనంతగా పెరగాలనేది టీడీపీ అజెండా. ఇందులో భాగంగానే ఏకగ్రీవ ఎన్నికలకు మోకాలడ్డేలా నిమ్మగడ్డ మాట్లాడటం చూశాం. వాస్తవానికి గ్రామాల్లో ఏకగ్రీవాలను ప్రోత్సహించాలి. అప్పుడే ప్రజలు వర్గాలు విడిపోకుండా ఉంటారు. సత్వర అభివృద్ధి సాధ్యమవుతుంది.
– ఇందుకోసమే ప్రభుత్వాలు ఏకగ్రీవమయ్యే పంచాయతీలకు నగదు ప్రోత్సాహకాలు ప్రకటిస్తాయి. వైఎస్ జగన్ ప్రభుత్వం కూడా రూ.20 లక్షల వరకు ప్రోత్హాహకాలు ప్రకటించిన సంగతి తెలిసిందే.
– ఈ నేపథ్యంలో ఏకగ్రీవాలు కాకుండా చూసి, గ్రామాల్లో రెండు మూడు వర్గాలుగా ప్రజలు విడిపోయేలా చేసి టీడీపీకి లబ్ధి కలిగించే దిశగా నిమ్మగడ్డ అడుగులు వేస్తున్నారు.
– ఓటమి చెందిన వర్గం వారికి, అసంతృప్తులకు డబ్బు ఎరవేసి.. రాత్రికి రాత్రి టీడీపీ క్యాంపులో చేర్చే ఆ పార్టీ వ్యూహానికి ఓ వైపు మద్దతు ఇస్తూ.. ఆ వెంటనే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియను కొనసాగించనున్నారని విశ్వసనీయంగా తెలిసింది. తద్వారా టీడీపీ ఉనికి చాటేలా ఊతమివ్వనున్నారని సమాచారం.
అప్పుడు ఎందుకు మిన్నకున్నారంటే..
– రాష్ట్రంలో గ్రామ పంచాయతీ సర్పంచి, వార్డు సభ్యుల పదవీ కాలం 2018 ఆగస్టులోనే ముగిసింది. అదే ఏడాది అక్టోబర్‌లో హైదరాబాద్‌లో ఉండే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.. మూడు నెలల్లో పంచాయతీ ఎన్నికలు జరపాలని స్పష్టంగా తీర్పు వెలువరించింది. ఆ సమయంలో కూడా రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డే ఉన్నారు.
– అయితే అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు అసెంబ్లీ ఎన్నికల ముందు పంచాయతీ ఎన్నికల వల్ల తెలుగుదేశం పార్టీకి నష్టం చేకూరుతుందని భావించారు. పంచాయతీ ఎన్నికలకు సిద్ధపడలేదు. అలాంటప్పుడు ఇప్పుడు మాదిరి నిమ్మగడ్డ నాడు చంద్రబాబు ప్రభుత్వంపై గవర్నర్‌కు ఫిర్యాదు చేయలేదు. ఎన్నికలకు టీడీపీ ప్రభుత్వం అడ్డుపడుతోందని ఎప్పుడూ కోర్టుకు వెళ్లలేదు.
– ఇప్పుడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పలుమార్లు లేఖలు రాసినా, స్వయంగా కలసి వివరించినా పట్టించుకోలేదు. కరోనా వాక్సినేషన్ ప్రక్రియ కళ్లెదుటే కనిపిస్తున్నా, తనకు ప్రభుత్వం సహకరించడం లేదంటూ అనేక దఫాలు గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. హైకోర్టుకూ వెళ్లారు. దీన్నిబట్టి రాజ్యాంగబద్ద రాష్ట్ర కమిషనర్ హోదాలో ఉన్న నిమ్మగడ్డ తెలుగుదేశం పార్టీ రాజకీయ ప్రయోజనాల కోసమే పని చేస్తున్నారని స్పష్టమవుతోందని సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
సుప్రీంకోర్టు తీర్పు తుంగలోకి..
– రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ పదవీ కాలం ఈ ఏడాది మార్చి 31వ తేదీతో ముగియనుంది. దాంతో తెలుగుదేశం పార్టీ ప్రయోజనాల కోసం ఏకంగా సుప్రీంకోర్టు తీర్పును ఆయన తుంగలోకి తొక్కారు. 2020 మార్చి 15న ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ వాయిదా వేయగా.. దానిపై సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ వేసింది.
– కరోనా పరిస్థితులు మెరుగుపడిన తర్వాత.. ఎన్నికల ప్రక్రియ ఎక్కడ ఆపేశారో అక్కడి నుంచే తిరిగి ప్రారంభించాలని, ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపే కొత్త తేదీలను ఖరారు చేయాలని ఈ కేసులో తీర్పు వెలువరించింది.
– ఎన్నికల ప్రక్రియ ఎక్కడ ఆగిపోయిందో అక్కడి నుంచే మొదలు పెట్టాలంటే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను ముందుగా పూర్తి చేయాల్సి ఉంటుంది. వాటిని నిర్వహించకుండా కొత్తగా గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియకు నిమ్మగడ్డ నోటిఫికేషన్ ఇచ్చారు.
– ఎన్నికలు జరిపే అనుకూల పరిస్థితులు లేవని ప్రభుత్వం స్పష్టంగా నివేదికలు అందజేసినా, ఏకపక్షంగా పంచాయతీ ఎన్నికల తేదీలను ప్రకటించారు.
గుంటూరు జిల్లా రొంపిచెర్ల మండలం విప్పర్ల గ్రామంలో ఎంపీటీసీ స్థానం ఎన్నికకు 2020 మార్చి 9వ తేదీన రిటర్నింగ్ అధికారి ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేశారు. నామినేషన్ల ప్రక్రియ ముగిశాక ముగ్గురు అభ్యర్థులు పోటీలో నిలిచారు. అంతలో అర్ధంతరంగా ఆ ఎన్నికలు నిలిపివేశారు. ఇప్పుడు ఆ ఎన్నికలను తొలుత పూర్తి చేయకుండానే.. ఆ గ్రామ సర్పంచ్, వార్డు సభ్యుల పదవులకు ఎన్నికలు పెడుతున్నారు. ఇవేం ఎన్నికలు.. ఎవరి కోసం ఈ రాజకీయం అంటూ ఆ గ్రామ ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. నిమ్మగడ్డ నిర్వాకం కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లోనూ ఇదే పరిస్థితి.
Comments
Please login to add a commentAdd a comment