సాక్షి, అమరావతి: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను తెరవెనుక నుంచి నడిపిస్తున్నది టీడీపీ అధినేత చంద్రబాబే అని, ఆయన అడుగు జాడల్లోనే ఎస్‌ఈసీ నడుస్తున్నారని శనివారం నాటి పరిణామాలతో మరోసారి స్పష్టమైంది. పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాల మాట వింటేనే రెచ్చిపోతున్న నిమ్మగడ్డ.. చంద్రబాబు సొంత జిల్లా.. చిత్తూరులో తొలి విడతలో రాష్ట్రంలోకెల్లా అత్యధికంగా ఏకగ్రీవం కావడం భరించలేకపోయారు. ఈ ఏకగ్రీవాలన్నింటికీ మంత్రి పెద్ది రామచంద్రారెడ్డే కారణం అని, ఆయన్ను ఏకంగా 16 రోజుల పాటు ఇంటి నుంచి కదలకుండా గృహ నిర్భందం చేయాలని ఆదేశాలు జారీ చేయడం విస్తుగొలుపుతోంది. రాష్ట్రంలో నాలుగు దశల పంచాయతీ ఎన్నికలు ముగిసే ఫిబ్రవరి 21వ తేదీ వరకు మంత్రి పెద్దిరెడ్డిని ఇంటి నుంచి బయటకు రాకుండా నియంత్రించాలని డీజీపీ గౌతమ్ సవాంగ్‌ను ఆదేశిస్తూ నిమ్మగడ్డ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.
శుక్రవారం మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడిన మాటలపై పలు పార్టీలు, పౌరుల నుంచి తనకు ఫిర్యాదులు అందాయని, అందువల్లే రాజ్యాంగంలోని 243 కె నిబంధన ద్వారా రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా తనకున్న విశేషాధికారాలను ఉపయోగిస్తున్నానని నిమ్మగడ్డ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మంత్రి మీడియాతో కూడా మాట్లాడకుండా నియంత్రించాలని చెప్పారు. నిమ్మగడ్డ వైఖరి చూస్తుంటే.. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న ఓ అధికారి అడ్డగోలు నిర్ణయం తీసుకుని, దానికి విశేషాధికారం అని రంగు పూయడం ఏమాత్రం సమ్మతం కాదని సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. ప్రతిపక్ష నేత చంద్రబాబు కోరిన విధంగా నిర్ణయాలు తీసుకుంటుండటం నిమ్మగడ్డ ప్రతి అడుగులో, ప్రతి మాటలో ప్రత్యక్షంగా కనిపిస్తోంది. తన చర్యల పట్ల ప్రజలు ఏమనుకుంటారనే జంకు లేకుండా, తెలుగుదేశం పార్టీకి ఏ మేరకు లబ్ధి కలిగించాలనే అజెండాతోనే ఆయన ముందుకెళ్తున్నట్లు స్పష్టమైంది.
బాబు పునాదులు కదులుతున్నాయని..
చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరు. తాత్కాలిక అసెంబ్లీ, సచివాలయం ఉన్న ప్రాంతం గుంటూరు జిల్లా. ఈ రెండు జిల్లాలు ఏకగ్రీవాల సంఖ్యలో ముందు వరుసలో ఉన్నాయి. వాస్తవానికి పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలను ప్రోత్సహించడం అనేది ఎన్నో దశాబ్దాలుగా జరుగుతోంది. గత పంచాయతీ ఎన్నికల్లో కూడా ఇది స్పష్టంగా కనిపించింది. కక్షలు, కార్పణ్యాల నుంచి గ్రామ సీమలను తప్పించి, త్వరితగతిన అభివృద్ధి పథంలో నడిపించేందుకే పార్టీ రహితంగా పంచాయతీ ఎన్నికలను నిర్వహిస్తారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న నిమ్మగడ్డకు ఈ విషయాలు తెలియవా అంటే స్పష్టంగా తెలుసు. అయితే ఈ ఎన్నికల్లో చంద్రబాబు, టీడీపీకి భారీగా నష్టం చేకూరబోతోందనే విషయాలే ఆయనకు నిద్రలేకుండా చేస్తున్నాయి.
అడ్డగోలు నిర్ణయాలకు కారణమవుతున్నాయి. నిమ్మగడ్డ చెబుతున్నట్లు మంత్రి పెద్దిరెడ్డిపై ఫిర్యాదులు వచ్చి ఉంటే విచారించాలి కదా? ఎవరు ఫిర్యాదు చేశారో.. ఏమని ఫిర్యాదు చేశారో చెప్పాలి కదా? ఆ ఫిర్యాదులకు సంబంధించి మంత్రిని వివరణ కోరి ఉండవచ్చు. అందుకు మంత్రి స్పందించకపోతేనో.. ఆయన ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేకపోతేనో చర్యలకు ఉపక్రమించానని చెబితే ఒక అర్థం ఉండేది. ఇక్కడ అలాంటిది మచ్చుకైనా కనిపించలేదు. ‘ఎద్దు ఈనిందంటే గాటికి కట్టెయ్యండి’ అన్న చందంగా నిమ్మగడ్డ వ్యవహరించడం చూస్తుంటే.. ఆయనలో చంద్రబాబు పూనాడు అనిపించడంలో ఎలాంటి సందేహం లేదు.
నిబంధనల మేరకు వ్యవహరించాలనడం తప్పా?
నిబంధనల ప్రకారం ఎన్నికలు ఏకగ్రీవమైన స్థానాల్లో రిటర్నింగ్ అధికారులు నియమ నిబంధనలను అనుసరించి ఏకగ్రీవంగా ఎన్నికయినట్లు ప్రకటనలు చేయాలని మంత్రి పెద్దిరెడ్డి పేర్కొన్నారు. ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తే న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. అయితే నిబంధనలకు విరుద్ధంగా ఏకగ్రీవాలు జరిగిన చోట ప్రకటించకపోతే చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించినట్లుగా భావిస్తూ నిమ్మగడ్డ శనివారం ఉత్తర్వులు జారీ చేసి.. తన రాజకీయ అజెండాలో మరో అంకానికి తెర లేపారు. వాస్తవానికి ఇప్పటిదాకా జరిగిన ఏకగ్రీవాల్లో ఆయనకు ఏమైనా అనుమానాలు ఉంటే ముఖ్యమంత్రితో, ఇతర మంత్రులతో చర్చించవచ్చు. ఇతర అధికారులతో మాట్లాడవచ్చు. వారి నుంచి నివేదికలు తెప్పించుకుని పరిశీలించవచ్చు. ఇవన్నీ ఏమీ లేకుండా చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో ఏకగ్రీవాల ఫలితాలను ఆపాలని ఆదేశించడం నిమ్మగడ్డ అత్యుత్సాహమేనని తేటతెల్లమవుతోంది. పెద్దిరెడ్డి.. పంచాయతీ రాజ్ శాఖ మంత్రి. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలు పంచాయతీ ఎన్నికలు. ఈ ఎన్నికల్లో బాగోగుల గురించి ఈ మంత్రి మాట్లాడకూడదంటే ఎలా?
ప్రతి అడుగులో అధికార దుర్వినియోగం
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆదేశాల పట్ల ఉన్నతాధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఏ విషయంలోనూ ప్రభుత్వంతో చర్చించకుండా, ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం సబబు కాదంటున్నారు. నిమ్మగడ్డ తీరుతో తాము ఇక్కట్లకు గురికావాల్సి వస్తోందని వాపోతున్నారు. నిమ్మగడ్డ ప్రతి అడుగులోనూ అధికార దుర్వినియోగం కనిపిస్తోందని ఉదాహరణలతో సహా చెబుతున్నారు.
ఓటర్లు భయపడుతున్నారట..
ఎన్నికల్లో పోటీ చేసే వారు, ఓటర్లు భయాందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలోనే తాను మంత్రి పెద్దిరెడ్డిపై చర్యలు తీసుకున్నానని నిమ్మగడ్డ తన ఆదేశాల్లో పేర్కొనడం అనుమానాలకు తావిస్తోంది. ఎన్నికల ప్రక్రియలో మంత్రి జోక్యం చేసుకున్నారని చెబుతూనే.. అధికార పత్రాలను పరిశీలించ వచ్చని, చట్టబద్దమైన బాధ్యతలను నిర్వహించవచ్చని పేర్కొన్నారు. మంత్రి పెద్దిరెడ్డిపై చర్యలకు ఆదేశిస్తూ.. ఇంత హడావుడిగా ఆయన జారీ చేసిన సుదీర్ఘ ప్రకటన చూస్తుంటే ఇందులో కచ్చితంగా చంద్రబాబు హస్తం ఉందని స్పష్టమవుతోందని పలువురు రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇదిలా ఉండగా అధికారులెవ్వరూ అభద్రతా భావనకు గురికావాల్సిన అవసరం లేదని, తాము అండగా ఉంటామని ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ శనివారం ఒక ప్రకటన విడుదల చేయడం గమనార్హం.
కేంద్ర హోం కార్యదర్శికి లేఖ?
రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు సజావుగా నిర్వహించడంలో భాగంగా తాము మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని హౌస్ అరెస్ట్ చేశామని ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ శనివారం కేంద్ర హోం కార్యదర్శికి లేఖ రాసినట్లు తెలిసింది. తమ ఆదేశాలకు మంత్రి కట్టుబడకుండా ఆదివారం చిత్తూరు జిల్లాలో రాష్ట్రపతి పర్యటనలో పాల్గొంటే తాము ఎలా వ్యవహరించాలో స్పష్టం చేయాలని ఆ లేఖలో కోరినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment