
సాక్షి, అమరావతి: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు విడుదల చేసిన పంచాయతీ ఎన్నికల మేనిఫెస్టోపై అన్ని వైపుల నుంచి విమర్శలు వస్తుండడంతో ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ ఎట్టకేలకు వివరణ కోరారు. టీడీపీ మేనిఫెస్టోలో ప్రచురణకర్తగా పేర్కొన్న పార్టీ ప్రధాన కార్యదర్శి మద్దిపాటి వెంకటరాజును ఫిబ్రవరి 2లోపు వివరణ ఇవ్వాలని శనివారం లేఖ రాశారు.
పార్టీ రహితంగా జరిగే పంచాయతీ ఎన్నికలకు ఈ నెల 28వ తేదీన చంద్రబాబు మేనిఫెస్టో విడుదల చేయడం చట్ట విరుద్ధమని, ఆయనపై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఫిర్యాదుపై ఒక అభిప్రాయానికి వచ్చేందుకే వివరణ కోరినట్లు ఆ లేఖలో ఎస్‌ఈసీ స్పష్టంగా పేర్కొనడం గమనార్హం.