nimmagadda ramesh kumar app launch today - Sakshi
Sakshi News home page

నేడే నిమ్మగడ్డ ప్రైవేట్‌ యాప్‌!

Published Wed, Feb 3 2021 5:14 AM | Last Updated on Wed, Feb 3 2021 10:20 AM

Nimmagadda Private App Launch Today - Sakshi

సాక్షి, అమరావతి: ఎన్నికల నిర్వహణలో నిష్పాక్షికంగా వ్యవహరించాల్సిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ పారదర్శకతకు పాతరేశారు. ఎన్నికల పర్యవేక్షణ పేరుతో గుట్టుచాటుగా ప్రైవేట్‌ యాప్‌ రూపొందించుకుని ఆ బండారం బయటపడకుండా ఉండేందుకు ప్రభుత్వం నుంచి భద్రతాపరమైన అనుమతులు తీసుకోకుండానే ఎన్నికలలో వినియోగించాలని నిర్ణయించారు. ఇప్పటిదాకా రహస్యంగా ఉంచిన ఆ యాప్‌ను బుధవారం ఉదయం 11 గంటలకు ఆవిష్కరించనున్నట్టు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ కార్యాలయ వర్గాలు తెలిపాయి. శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్న నిమ్మగడ్డ కూడా ఇదే విషయాన్ని మీడియాకు చెప్పారు. ఇప్పటివరకు యాప్‌ వివరాలు ఏమాత్రం వెల్లడించకుండా ఆయన గోప్యంగా ఉంచారు. యాప్‌ తయారు చేసింది ఎవరు? కంట్రోల్‌ కేంద్రం ఎక్కడుంది? ఎవరు పర్యవేక్షిస్తారు? సిబ్బంది ఎవరు? ఫిర్యాదులను ఎలా పరిష్కరిస్తారు? తదితర వివరాలు బహిర్గతం కాకుండా గోప్యత పాటించడం అనుమానాలకు బలం చేకూరుస్తోంది. పూర్తి పారదర్శకతతో జరగాల్సిన ఎన్నికలకు ఉపయోగించే యాప్‌ను అనుమతులు లేకుండానే ఆవిష్కరించేందుకు నిమ్మగడ్డ ఏర్పాట్లు చేసుకోవడం గమనార్హం. మరోవైపు యాప్‌లో అందే సమాచారాన్ని తొలుత తాను మాత్రమే చూసి ఆ తర్వాత ఎంపిక చేసిన డేటానే జిల్లా కలెక్టర్లకు పంపేలా నిమ్మగడ్డ ఇప్పటికే లాగిన్‌ ఏర్పాట్లు చేసుకున్నారు.

అనుమతులు తప్పనిసరి..
సాధారణంగా ప్రభుత్వంలోగానీ, ప్రభుత్వ వ్యవస్థలలోగానీ యాప్‌లు, ఇతర సాఫ్ట్‌వేర్లు ఉపయోగించాలంటే నిబంధనల ప్రకారం అనుమతులు తీసుకోవాలి. యాప్‌లో నమోదు చేసే సమాచారం (డేటా) నిర్ణీత వ్యక్తులు మినహా ఇతరులకు చేరకుండా, హ్యాక్‌ చేసే వీలు లేకుండా డేటా సెక్యూరిటీ ఏర్పాట్లు ఉన్నాయా? అని ఏపీటీఎస్‌ విభాగం నిపుణులు పరిశీలన చేశాక అనుమతులు మంజూరు చేయాల్సి ఉంటుంది. యాప్‌లలో నమోదు చేసే సమాచారాన్ని బయట వ్యక్తులు మార్చేసే అవకాశం (మార్ఫింగ్, ఎడిటింగ్‌) లేకుండా ఎప్పటికప్పుడు ప్రభుత్వ డేటా సెంటర్‌ (అన్ని రకాల ప్రభుత్వ యాప్‌లు, వెబ్‌సైట్‌ సమాచారం నిల్వ చేసే కేంద్రం)తో అనుసంధానించేలా అనుమతి పొందాలి. అయితే డేటా భద్రతకు ఉద్దేశించిన అనుమతులేవీ తీసుకోకుండానే యాప్‌ను తెచ్చేందుకు నిమ్మగడ్డ సిద్ధమయ్యారు. తద్వారా ఎన్నికల ప్రక్రియలో దురుద్దేశాలతో వ్యవహరిస్తున్నారనే అనుమానాలు బలపడుతున్నాయని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు. 

ఎవరి లబ్ధి కోసం?
ఎన్నికల కోసం ఇప్పటికే పంచాయతీరాజ్‌ శాఖ తయారు చేయించిన యాప్‌ ఉన్నప్పటికీ దాన్ని కాదని అనుమతులు లేని ప్రైవేట్‌ యాప్‌ను ఎన్నికల పర్యవేక్షణకు వినియోగించాలన్న నిర్ణయం వెనుక టీడీపీకి లబ్ధి చేకూర్చాలన్న దురుద్దేశం దాగి ఉన్నట్లు భావిస్తున్నారు. కొందరు టీడీపీ ముఖ్యలు హైదరాబాద్‌ నుంచి పర్యవేక్షించేలా యాప్‌లో ఏర్పాట్లు జరిగినట్లు కమిషన్‌ కార్యాలయ వర్గాల్లోనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీ రహితంగా జరిగే పంచాయతీ ఎన్నికలలో రాజకీయాలను చొప్పించడం ద్వారా ప్రశాంతతకు భంగం కలిగే ప్రమాదం నెలకొందన్న ఆందోళన గ్రామాల్లో వ్యక్తమవుతోంది.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement