
సాక్షి, అమరావతి: తన హయాంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను జరిపే పరిస్థితి లేదని, కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా దీనికి కారణమని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రకటించారు. ఈ నెలాఖరుతో పదవీ విరమణ చేయనున్న తనకు ఈ ఎన్నికలు నిర్వహించేందుకు తగినంత సమయం లేదన్నారు. ఈ మేరకు నిమ్మగడ్డ రమేష్ కుమార్ పేరుతో రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఏడాది క్రితం స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసినప్పుడు సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు ప్రకారం.. తిరిగి ఎన్నికలు నిర్వహించేటప్పుడు ప్రభుత్వంతో సంప్రదింపుల తర్వాతే కొత్త తేదీలను ఖరారు చేయాలని, పోలింగ్ తేదీకి నాలుగు వారాల ముందు నుంచి ఎన్నికల కోడ్ అమలు చేయాలని సూచించిందని నిమ్మగడ్డ అందులో పేర్కొన్నారు. ఎన్నికలకు నాలుగు వారాల ముందు కోడ్ అమలు చేయడం ద్వారా పంచాయతీ, మునిసిపల్ ఎన్నికలను నిర్వహించానని, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల విషయంలోనూ ఇదే విధానం అమలు చేయాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
ఆ బాధ్యత తదుపరి ఎస్‌ఈసీదే
నాలుగు వారాల ముందు ఎన్నికల కోడ్ అమలు చేయాల్సి ఉండటం, పోలింగ్ సిబ్బందిని కోవిడ్ వారియర్స్‌గా గుర్తించి వ్యాక్సినేషన్‌లో ప్రాధాన్యత ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించడం, మరోవైపు తన పదవీ కాలం ఈ నెలాఖరు (మార్చి 31వ తేదీ)తో ముగుస్తున్న కారణంగా వాయిదా పడిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను తిరిగి నిర్వహించేందుకు షెడ్యూల్ ప్రకటించలేకపోతున్నట్లు నిమ్మగడ్డ పేర్కొన్నారు. తన తదుపరి రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టేవారు ఈ ఎన్నికల నిర్వహణ బాధ్యత తీసుకుంటారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
నిన్న అలా.. నేడు ఇలా
దాదాపు నెలన్నర క్రితం కరోనా వ్యాక్సినేషన్ పూర్తయ్యేవరకైనా స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయాలని రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు కోరినా నిమ్మగడ్డ నిరాకరించారు. ఎన్ని అవాంతరాలు తలెత్తినా తక్షణమే ఎన్నికలు నిర్వహించాల్సిందేనంటూ మొదట గ్రామ పంచాయతీ ఎన్నికలను నిమ్మగడ్డ ప్రారంభించిన విషయం తెలిసిందే. కరోనా వ్యాక్సినేషన్ పెద్ద ఎత్తున సాగుతున్న సమయంలో అలా మొండిగా వ్యవహరించిన నిమ్మగడ్డ ఇప్పుడు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను నిర్వహించలేకపోవడానికి అదే వ్యాక్సినేషన్‌ను సాకుగా చూపుతుండటం పట్ల అధికార, రాజకీయ వర్గాల్లో విస్మయం వ్యక్తమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment