సాక్షి, అమరావతి: కోర్టు ఇచ్చిన ఆదేశాలను ప్రభుత్వం అమలుచేయడం లేదంటూ దాఖలు చేసిన కోర్టు ధిక్కార పిటిషన్‌ను ప్రచారం కోసం దాఖలు చేస్తున్నారా? అంటూ హైకోర్టు సోమవారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌ను నిలదీసింది. గత నెల 18న దాఖలు చేసిన కోర్టు ధిక్కార పిటిషన్ 42 రోజుల పాటు ఈ కోర్టు ముందు విచారణకు రాలేదని.. అయితే, పిటిషన్‌లో ప్రతీ అక్షరం మాత్రం డిసెంబర్ 19నే అన్ని పత్రికల్లో ప్రముఖంగా ప్రచురితమైందని.. దీంతో పిటిషన్ వేసిన ప్రయోజనం నెరవేరినట్లు కమిషనర్ భావించినట్లున్నారని హైకోర్టు తెలిపింది. దీని ఆధారంగానే నిమ్మగడ్డ రమేష్ ప్రచారం కోసమే కోర్టు ధిక్కార వ్యాజ్యం దాఖలు చేశారన్న అభిప్రాయం ఈ న్యాయస్థానానికి కలుగుతోందని ఘాటుగా వ్యాఖ్యానించింది.
ఇదీ కోర్టు ధిక్కార పిటిషన్..
తమకు కేటాయించిన నిధులను ప్రభుత్వం విడుదల చేయడంలేదని, నిధులు విడుదల చేసేలా ఆదేశాలివ్వడంతో పాటు విధి నిర్వహణలో తమకు ఆర్థిక, ఆర్థికేతర సహాయ, సహకారాలు అందించేలా కూడా ఆదేశాలివ్వాలంటూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ గత ఏడాది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్, ఎన్నికల కమిషన్‌కు అన్ని రకాల సహాయ సహకారాలు అందించాలని గత ఏడాది నవంబర్ 3న రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం వీటిని అమలుచేయడంలేదని, దీనిని కోర్టు ధిక్కారంగా పరిగణించాలంటూ నిమ్మగడ్డ రమేష్ గత ఏడాది డిసెంబర్ 18న కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యం జనవరి 29న విచారణకు రాగా, ఇందులో ప్రస్తుత ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్‌ను ప్రతివాదిగా చేసేందుకు కమిషన్ తరఫు న్యాయవాది గడువు కోరడంతో న్యాయమూర్తి అంగీకరించిన విషయం తెలిసిందే.
ఇన్ని రోజులు జాప్యం ఎందుకు?
ఈ నేపథ్యంలో.. సోమవారం ఈ వ్యాజ్యం విచారణకు రాగా, న్యాయమూర్తి తనకు కొన్ని విషయాలపై స్పష్టతనివ్వాలని ఎన్నికల కమిషన్ తరఫు న్యాయవాది ఎన్.అశ్వనీకుమార్‌ను ఆదేశించారు. డిసెంబర్ 18న పిటిషన్ దాఖలు చేస్తే అది జనవరి 29 వరకు ఎందుకు విచారణకు రాలేదని.. ఇన్ని రోజుల జాప్యం మీ తప్పా, రిజిస్ట్రీ తప్పా అంటూ అడిగారు. కేసు విచారణకు వచ్చేందుకు రిజిస్ట్రీకి లేఖలు రాశానని, ఫోన్లు కూడా చేశానని అశ్వనీ చెప్పారు. అత్యవసరంలేదని భావించే 42రోజులు మౌనంగా ఉన్నారా? అంటూ న్యాయమూర్తి మళ్లీ ప్రశ్నించారు. ‘నిజంగా అత్యవసరమని భావించే ఉంటే ఈ కోర్టులో ప్రస్తావించి ఉండేవారు. ఆ పనిచేయలేదంటే వారు ఏ ప్రయోజనం ఆశించి కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారో సులభంగా అర్థమవుతోంది.
ఇన్ని రోజులు మౌనంగా ఉండి, ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తరువాత దీనిపై అత్యవసర విచారణ జరపాలని కోరుతున్నారంటే ప్రతివాదులపై (ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి) ఒత్తిడి పెంచడానికి ఇలా చేస్తున్నారని ఈ కోర్టు భావిస్తోంది. ఎన్నికల కమిషనర్ సదుద్దేశాలపై ఈ కోర్టుకు సందేహం కలుగుతోంది’.. అని న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ తీవ్రంగా వ్యాఖ్యానించారు. ఇన్ని రోజులు ఓ పిటిషన్ విచారణకు రాకపోవడం అంటే ఈ కోర్టు రాజ్యాంగ విధులను నిర్వర్తించకుండా అడ్డుకోవడమేనని న్యాయమూర్తి తెలిపారు. ఇందుకు బాధ్యులైన అధికారులపై కోర్టు ధిక్కార చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే, ఈ కోర్టు ధిక్కార వ్యాజ్యంలో ప్రతివాదులుగా ఉన్న అప్పటి సీఎస్ నీలం సాహ్ని, ప్రస్తుత ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదీలకు నోటీసులు జారీచేశారు.
అంతేకాక.. నవంబర్‌లో తమ ఉత్తర్వులకు సంబంధించి తీసుకున్న చర్యలపై తాము కోరిన నివేదికను తదుపరి విచారణ సమయంలో తన ముందుంచాలని రిజిస్ట్రీకి న్యాయమూర్తి స్పష్టంచేశారు. అలాగే, పిటిషన్ విచారణకు రాక ముందే వాటిని పత్రికలకు ఇవ్వడం సరికాదని, ఈ విషయంలో కమిషనర్‌కు తగిన సలహా ఇవ్వాలని కమిషన్ తరఫు న్యాయవాది అశ్వనీకుమార్‌కు సూచించారు. తదుపరి విచారణను ఈ నెల 15కి వాయిదా వేశారు. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ ఉత్తర్వులు జారీచేశారు.
Comments
Please login to add a commentAdd a comment