కొయ్యలగూడెం గ్రామ వ్యూ
చౌటుప్పల్ (మునుగోడు) : చేనేత వస్త్రాల తయారీకి పెట్టిన పేరుగా నిలిచిన మండలంలోని కొయ్యలగూడెం గ్రామం సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రజలంతా కులమతాలు, వర్గ విభేదాలకు తావు ఇవ్వకుండా ఏకతాటిపై నిలిచారు. అందరు కలిసి తీసుకున్న నిర్ణయానికి కట్టుపడ్డారు. గతేడాది జరిగిన నూతన గ్రామపంచాయతీల విభజన సమయంలో కొయ్యలగూడెం గ్రామానికి అ న్యాయం జరిగిందని.. గ్రామపంచాయతీ ఎన్ని కలను బహిష్కరించాలని ఈనెల 7న నిర్ణయిం చారు. ఏ ఒక్కరూ కూడా పంచాయతీ ఎన్నికల్లో పాల్గొనకుండా ప్రభుత్వానికి తమ నిరసనను తెలి యపర్చాలని తీర్మాణించారు. అధికారులు నచ్చజెప్పినా తలొగ్గకుండా పంతాన్ని నెరవేర్చుకున్నారు.
చౌటుప్పల్ మండల కేంద్రానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న కొయ్యలగూడెంలో ఆ గ్రామంతో పాటు ఎల్లంబావి, జ్యోతినగర్, గజ్జెలోనిబావి గ్రామాలు ఉండేవి. పంచాయితీ పరిధిలో 2011 జనాభా లెక్కల ప్రకారంగా 4600 జనాభా, 2837 మంది ఓటర్లు ఉండేవారు. గతేడాది ఈ గ్రామపంచాయతీ నుంచి ఎల్లంబావి, జ్యోతినగర్‌ను వేరు చేశారు. 1287 మంది జనాభా, 976 మంది ఓటర్లతో కలిపి నూతనంగా ఎల్లంబావి పేరిట గ్రామపంచాయతీని ఏర్పాటైంది. ముందుగా అధికారులు చేసిన మార్కింగ్ ప్రకారంగా కాకుండా అకస్మాత్తుగా మరో మార్కింగ్‌తో విభజించి గెజిట్‌ను పూర్తిచేశారు. ఇక అప్పటి నుంచి గ్రామస్తులు తమకు జరిగిన అన్యాయం గురించి అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. రోజులు గడుస్తున్నాయో తప్ప ఫలితం మాత్రం దక్కలేదు.
విభజనతో ఆగమైన కొయ్యలగూడెం..
విభజనతో కొయ్యలగూడెం గ్రామం పూర్వపు తన ఆనవాళ్లను కోల్పోయింది. గతేడాది మార్చిలో జరిగిన ప్రక్రియలో ఎల్లంబావికి 13–57, 701–705, 438, 441, 473, 708 సర్వే నంబర్లే కేటాయించాలి. కానీ ఆ తర్వాత జరిగిన తతంగంతో అధనంగా 10, 694, 695, 696, 697, 698, 699, 700 సర్వే నంబర్లను కేటాయించారు. 1,287 మంది జనాభా ఉన్న ఎల్లంబావికి 650ఎకరాలను కేటాయించారు. 2,313 మంది జనాభా కలిగిన కొయ్యలగూడెం గ్రామానికి మాత్రం 700 ఎకరాల రెవెన్యూని మాత్రమే కేటాయించారు. దీంతో కొయ్యలగూడెం గ్రామంలోనికి వెళ్లే ప్రధాన రహదారి, కొన్నేళ్లుగా వాడుకలో ఉన్న శ్మశాన వాటిక కూడా ఎల్లంబావి పరిధిలోకి వెళ్లింది.
విఫలమైన అధికారుల ప్రయత్నాలు
ఎన్నికల్లో గ్రామస్తులతో నామినేషన్లు వేయించేందుకు అధికార యంత్రాంగం తీవ్ర ప్రయత్నాలు చేసింది. ఎవరికి ఎలాంటి ఆటంకాలు ఎదురుకాకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తామని కొంత మందికి బరోసా ఇచ్చారు. అందులో భాగంగా డి.నాగారం క్లస్టర్ వద్ద ఏసీపీ బాపురెడ్డి, సీఐ వెంకటేశ్వర్లు, ఎస్‌ఐ చిల్లా సాయిలు, సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. ఏదో జరుగుతుందని పసిగట్టిన కొయ్యలగూడెం గ్రామస్తులు ఎవరూ నామినేషన్లు వేయకుండా గస్తీ నిర్వహించారు. క్లస్టర్ వద్ద కాపుకాశారు. సాయంత్రం 5 గంటల వరకు ఇదే పరిస్థితి నెలకొనడంతో గ్రామం నుంచి ఎలాంటి నామినేషన్ దాఖలవ్వలేదు. ప్రయత్నాలు విఫలమవ్వడంతో అధికారులు వెనుదిరిగారు.
బహిష్కరించాలని నిర్ణయం..
తమకు జరిగిన అన్యాయంపై సుమారు 7 నెలలుగా గ్రామస్తులు పోరాడుతూనే ఉన్నారు. అయినా అటు ప్రభుత్వం, ఇటు అధికారులు, మరో వైపు ప్రజాప్రనిధులు కనీసం స్పందించలేదు. దీంతో తమ నిరసన తీవ్రస్థాయిలో ఉండాలని గ్రామస్తులంతా భావించారు. అందులో భాగంగా ఈనెల 7న సమావేశమై పంచాయతీ ఎన్నికలను బహిష్కరించాలని నిర్ణయించారు. ఆ మాటకు ప్రజలంతా కట్టుబడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment