మణిపూర్‌లో భిన్న వాతావరణం
సగం పోలింగ్ కేంద్రాలు సమస్యాత్మకమే
ఇంఫాల్: గత ఏడాదంతా జాతుల వైరంతో అట్టుడికిపోయిన మణిపూర్ ఇంకా నివురుగప్పిన నిప్పులానే ఉంది. సార్వత్రిక ఎన్నికల వేళ ప్రచారంతో మోతెక్కిపోయే రాష్ట్రాలకు భిన్న వాతావరణం మణిపూర్‌లో నెలకొంది. మెయితీ, కుకీ తెగల గొడవలతో 50,000 మందికిపైగా స్థానికులు సహాయక, పునరావాస శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. తమ సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోలేదన్న భావన వారిలో గూడుకట్టుకుంది.
లోక్‌సభ ఎన్నికలపైనా వ్యతిరేక భావన నెలకొంది. దాంతో మరో రెండు వారాల్లో పోలింగ్ ఉన్నా ఎన్నికల హడావుడే కనిపించలేదు. ‘‘మణిపూర్‌లో 2,955 పోలింగ్ స్టేషన్లలో సగం సమస్యాత్మక ప్రాంతాల్లో ఉన్నాయి. రాష్ట్రంలో వేరే ప్రాంతాలకు వలసపోయిన వారి కోసం 94 స్టేషన్లు ఏర్పాటుచేస్తున్నాం. 24,000 మంది శిబిరాల నుంచే ఓటేయనున్నారు’’ అని రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసీర్ ప్రదీప్ కుమార్ ఝా అన్నారు. ఓటర్లతో మాట్లాడి ఎన్నికలపై సదాభిప్రాయం పెంచి పోలింగ్ శాతం పెంచేందుకు ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నట్టు చెప్పారు.
గత ఏడాది మే మూడో తేదీన లోయ ప్రాంతాల్లో ఉండే మెజారిటీ జనాభా మైతేయ్‌లకు రాష్ట్రంలో ఎస్‌టీ హోదా డిమాండ్‌కు వ్యతిరేకంగా కుకీలు చేపట్టిన గిరిజనుల సంఘీభావ ర్యాలీ తర్వాత హింస ప్రజ్వరిల్లింది. మైతేయ్, కుకీల విద్వేషకాండలో 219 మంది ప్రాణాలు కోల్పోయారు. వేల మంది ప్రాణభయంతో సొంతూరిని వదిలి పారిపోయి ఐదు లోయ జిల్లాలు, మూడు కొండ జిల్లాల్లోని శిబిరాల్లో దాక్కున్నారు. ఘర్షణలు పూర్తిగా సద్దుమణకముందే రాష్ట్రంలో ఎన్నికలు అవసరమా? అంటూ వేలాది మంది బాధితులు, కొన్ని పౌర సంఘాలు ప్రశి్నస్తూ ఎన్నికల బాయ్‌కాట్‌కు పిలుపునిచ్చాయి. ‘‘గత లోక్‌సభ ఎన్నికల్లో మణిపూర్‌లో చక్కటి పోలింగ్ శాతం నమోదైంది. ఇది ఎన్నికల ప్రక్రియపై రాష్ట్ర ఓటర్ల నమ్మకానికి అద్దంపడుతోంది. ఈసారి గణనీయమైన పోలింగ్‌కు కృషిచేస్తాం’’ అని ప్రదీప్ ఝా అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment