విశ్లేషణ
నూతనంగా కొలువుదీరిన 18వ లోక్‌సభలో 469 మంది పురుషులతో పాటు కేవలం 74 మంది మహిళలు మాత్రమే ఉంటారు. మొత్తం ఎంపీలలో వారు 13.6 శాతం. ఈ వాటా 2019లో ఎన్నికైన మహిళల వాటా (14.4 శాతం) కంటే తక్కువగా ఉండటం గమనార్హం. లోక్‌సభ, శాసనసభలలో మూడింట ఒక వంతు సీట్లను మహిళలకు రిజర్వ్ చేయడానికి ఉద్దేశించిన చరిత్రాత్మక మహిళా రిజర్వేషన్ బిల్లును భారతదేశం ఆమోదించిన తర్వాత జరిగిన మొదటి పార్లమెంటరీ ఎన్నికలు ఇవి. స్థానిక స్థాయిలో మహిళల రాజకీయ భాగస్వామ్యాన్ని విస్తరించే విషయంలో భారతదేశం ముందుండి నడిపించింది. రాష్ట్ర, జాతీయ స్థాయులలోని అంతరాలను పరిష్కరించడంలో కూడా మనం ఇదే విధమైన నిబద్ధతను ప్రదర్శించాలి.
2024 లోక్‌సభ ఎన్నికలు ఆధునిక భారతదేశ రాజకీయ చరిత్రలో ఒక ముఖ్యమైన పోకడను సూచిస్తాయి. దీనిపై విశ్లేషించడానికి, వేడుక జరుపుకోవడానికి చాలా ఉంది కానీ, ఒక రంగంలో మాత్రం మనం ఒక అడుగు వెనక్కి వేశాం. 18వ లోక్‌సభలో 469 మంది పురుషులతో పాటు 74 మంది మహిళలు మాత్రమే ఉంటారు. 74 మందితో కూడిన ఈ మహిళా బృందంలో కచ్చితంగానే అనేక మంది శక్తిమంతమైన, చిత్తశుద్ధిగల, కష్టపడి పనిచేయగల ప్రజాప్రతినిధులు ఉన్నారు. మొత్తం ఎంపీలలో వారు 13.6 శాతంగా మాత్రమే ఉన్నారు. ఈ వాటా దారుణంగా వక్రంగా ఉండటమే కాకుండా, 2019 ఎన్నికల్లో ఎన్నికైన మహిళల వాటా (14.4 శాతం) కంటే తక్కువగా ఉండటం గమనార్హం.
2024 ఎన్నికలు జరిగిన సందర్భాన్ని పరిశీలిస్తే, మహిళా పార్లమెంటరీ ప్రాతినిధ్యం చెప్పుకోదగ్గ అభివృద్ధిని నమోదు చేసి ఉండాలి. అన్నింటికంటే ముఖ్యంగా లోక్‌సభ, రాష్ట్ర శాసనసభలలో మూడింట ఒక వంతు సీట్లను మహిళలకు రిజర్వ్ చేయడానికి ఉద్దేశించిన చరిత్రాత్మక మహిళా రిజర్వేషన్ బిల్లును భారతదేశం ఆమోదించిన తర్వాత జరిగిన మొదటి పార్లమెంటరీ ఎన్నికలు ఇవి. ఈ బిల్లు అమలులోకి వచ్చాక మహిళల సీట్లు వారికే కేటాయించాల్సి ఉంటుంది.
రిజర్వేషన్ సరిపోదు!
గత ఏడాది పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందినప్పుడు, అన్ని రాజకీయ పార్టీలు తమ మద్దతును తెలియజేయడమే కాకుండా, ఈ చారిత్రాత్మక పరిణామంలో తమకూ పాత్ర ఉందని ప్రకటించుకున్నాయి. పైగా, ఈ ఎన్నికల్లో మహిళలు ముఖ్యమైన ఓటర్లుగా ఉన్నారు. పార్టీల మేనిఫెస్టోలు, అగ్ర నాయకుల ప్రచార ప్రసంగాల నుండి మహిళల ఓటింగ్ ప్రాధాన్యతలను అర్థం చేసుకోవడం వరకు, సుదీర్ఘకాలం సాగిన ఎన్నికల సీజన్లో భారతీయ మహిళ చాలా స్పష్టంగా (కొంతవరకు సమస్యాత్మకంగా) తన ఉనికిని కలిగి ఉంది.
అయితే ఈ ఊహాగానంలో మహిళలు ఓటర్లు, లబ్ధిదారుల పాత్రకే పరిమితమయ్యారు, రాజకీయ సోపానక్రమాలలో సమానమైన భాగస్వామ్యానికి అర్హులైన మహిళా నాయకులు, ప్రతినిధులు లేకుండాపోయారు. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) సంకలనం చేసిన డేటా ప్రకారం, ఈ ఎన్నికల్లో మొత్తం అభ్యర్థుల్లో 9.6 శాతం మాత్రమే మహిళలు ఉన్నారు (పార్టీ టికెట్లపై పోటీ చేసిన అభ్యర్థుల్లో మహిళలు 11 శాతం మంది). అభ్యర్థులలో మహిళల వాటా తొమ్మిది శాతంగా ఉన్న 2019 సంవత్సరం నుండి చూస్తే ఇది చాలా కొద్ది మెరుగుదల మాత్రమే అని చెప్పాలి. పైగా పుండుపై కారం జల్లినట్టుగా, ఎన్నికల్లో పోటీ చేసిన అనేక మంది మహిళలు తమ తోటివారి నుండి స్త్రీద్వేష వ్యాఖ్యలను, అపహాస్యాన్ని ఎదుర్కొన్నారు.
ఈ విధంగా కొద్ది మంది మహిళలే ఎన్నికల్లో పోటీ చేస్తే, ఎన్నికైనవారిలో వారి ప్రాతినిధ్యం అంతంతమాత్రంగానే ఉంటుంది. ప్రపంచంలోని చాలా ప్రాంతాలలో పార్లమెంట్లు పురుషుల ఆధిపత్యంలో కొనసాగుతున్నప్పటికీ, భారతదేశం దాని సహచర పార్లమెంట్ల కంటే చాలా వెనుకబడి ఉంది. ఉదాహరణకు, 2023లో, ప్రపంచవ్యాప్తంగా 52 దేశాలు పార్లమెంటరీ ఎన్నికలను నిర్వహించాయి.
వీటిలో సగటున, 27.6 శాతం మంది మహిళలు ఎన్నికయ్యారని, ఇంటర్–పార్లమెంటరీ యూనియన్ (ఐపీయూ) డేటా చెబుతోంది. వాస్తవానికి, ప్రపంచవ్యాప్తంగా, ప్రస్తుతం ఉన్న మొత్తం ఎంపీలలో మహిళలు 26.9 శాతం ఉన్నారు. 18వ లోక్‌సభ ఎన్నికలకు ముందు, ఐపీయూ డేటా ప్రకారం, ఈ పరామితిలో మొత్తం 185 దేశాలలో భారతదేశం 143వ స్థానంలో ఉంది. కొత్త పార్లమెంటులో మహిళా ప్రాతినిధ్యంలో తగ్గుదల నమోదైన నేపథ్యంలో, మన దేశ ర్యాంకింగ్ మరో ఐదు లేదా ఆరు స్థానాలు పడిపోయే అవకాశం ఉంది.
మెక్సికో నుండి ఒక ఉదాహరణ
భారతదేశంలో ఎన్నికల లెక్కింపు జరగడానికి ఒక రోజు ముందు, ప్రపంచంలోని మరొక భిన్నమైన ప్రాంతంలో మరో చారిత్రక ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. వివిధ రాజ్యాంగ పదవులకు ప్రతినిధులను ఎన్నుకోవడానికి మెక్సికోలో సాధారణ ఎన్నికలు జరిగాయి. అక్కడ క్లాడియా షీన్‌బామ్ అత్యున్నత పదవికి చక్కటి మెజారిటీతో ఎన్నికయ్యారు. మెక్సికో అధ్యక్షురాలిగా ఒక మహిళ ఎన్నిక కావడం ఇదే తొలిసారి. కానీ పురుషులకే పరిమితమైన దుర్బేధ్యమైన కంచుకోట బద్దలవడం ఒక ఉల్లంఘన కాదు, మెక్సికో తన రాజకీయాలను మరింత ప్రాతినిధ్యంగా మార్చే ప్రయాణంలో ఇదొక తార్కికమైన తదుపరి దశ మాత్రమే.
గత కొన్ని దశాబ్దాలుగా, అట్టడుగు స్త్రీవాద ఉద్యమాల ద్వారా ముందుకు సాగిన మెక్సికో, తన రాజకీయాల్లో మహిళల ప్రాతినిధ్యాన్ని పెంచడమే కాకుండా లింగ సమానత్వాన్ని నిర్ధారించడానికి చట్టబద్ధమైన సంస్కరణల సమితిని ప్రవేశపెట్టింది; అమలు చేసింది కూడా. చట్టం ప్రకారం ప్రతిదానిలో, అంటే ప్రభుత్వంలోని అన్ని రంగాలలో సమానత్వం అవసరం. అలాగే ఎన్నికలలో లింగ సమానత్వంతో పార్టీలు తమ అభ్యర్థుల జాబితాలను ఉంచాలని ఆదేశించింది. ఈ సంస్కరణల ఫలితంగా, మెక్సికో అనేక ముఖ్యమైన రాజకీయ ఉన్నత పదవులను ఆక్రమించిన మహిళలతో పాటు, దాని పార్లమెంటు ఉభయ సభలలో స్త్రీ పురుష సమానత్వాన్ని కలిగి ఉంది.
2024లో, అధ్యక్ష పదవికి పోటీ చేసిన మొదటి ఇద్దరు అభ్యర్థులు మహిళలు కావడం, ఆ దేశ చరిత్రలో దేనితోనూ పోల్చలేని అరుదైన పరిణామం.అయినంతమాత్రాన మెక్సికోలో సమస్యలు లేవని చెప్పలేం. అక్కడ రాజకీయ, లింగ ఆధారిత హింస తీవ్రమైన సమస్యగా ఉంది. అయితే లింగ నిర్ధారిత నిబంధనలు ఉన్నప్పటికీ ఉద్దేశపూర్వకమైన, ఆలోచనాత్మకమైన సంస్కరణల ద్వారా పురోగతి సాధ్యమవుతుందని ఇది చూపిస్తోంది. అనేక ఇతర దేశాలు కూడా తమ రాజకీయాలను, పార్లమెంట్లను మరింత ప్రాతినిధ్యంగా ఉంచుతూ, సమానంగా మహిళలను కలుపుకుపోయేలా, లింగపరమైన సున్నితత్వంతో మలచడానికి చిన్న, పెద్ద రెండు చర్యలనూ తీసుకున్నాయి.
మనమందరం బాధ్యులమే!
స్థానిక స్థాయిలో మహిళల రాజకీయ భాగస్వామ్యాన్ని విస్తరించే విషయంలో భారతదేశం ముందుండి నడిపించింది. రాష్ట్ర, జాతీయ స్థాయులలోని అంతరాలను పరిష్కరించడంలో మనం ఇదే విధమైన నిబద్ధతను ప్రదర్శించాల్సిన సమయం ఆసన్నమైంది. దీనికి ఎగువ నుండి సంస్కరణ అవసరం. కానీ పురోగతిని నిర్ధారించే అంతిమ బాధ్యత మన రాజకీయ పార్టీల భుజాలపైనే ఉంటుంది.
మహిళా ప్రాతినిధ్యంలో ఈ పతనాన్ని చిన్నవిషయంగా చూడకూడదు. మహిళల (ప్రత్యేకించి సాంప్రదాయకంగా అట్టడుగున ఉన్న సమూహాల) భాగస్వామ్యాన్ని ప్రారంభించే విషయానికి వస్తే, పురోగతి చాలా అరుదుగా సరళంగా ఉంటుంది. పైగా దానికి ఎప్పుడూ హామీ ఇవ్వడం జరగదు. కాబట్టి ఈ విషయంలో శాశ్వతమైన జాగరూకత చాలా అవసరం. అలాగే మనం అడుగడుగునా జాగ్రత్తగా ఉండాలి.
అక్షీ చావ్లా
వ్యాసకర్త పరిశోధకురాలు, అశోకా యూనివర్సిటీలోని ‘సెంటర్ ఫర్ ఎకనామిక్ డేటా అండ్ అనాలిసిస్’
(సీఈడీఏ)లో పనిచేస్తున్నారు
Comments
Please login to add a commentAdd a comment