సంచలన ఆరోపణలు చేసిన రష్యా
మాస్కో: భారత అంతర్గత వ్యవహారాలు, సార్వత్రిక ఎన్నికల్లో అమెరికా దురుద్దేశంతో కలగజేసుకుంటోందని రష్యా సంచలన ఆరోపణలు చేసింది. ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూను అమెరికాలో చంపేందుకు భారతీయ పౌరులు కుట్ర పన్నారని అమెరికా ఆరోపించిందిగానీ నమ్మదగ్గ సాక్ష్యాలను బయటపెట్టలేదని రష్యా గుర్తుచేసింది.
రష్యా, సౌదీ అరేబియా తరహా పాలనా విధానాలను దేశంలో అమలుచేయాలని మోదీ సర్కార్ భావిస్తోందని అమెరికా ఒక నివేదిక వెల్లడించడంపై రష్యా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మారియా జఖారోవా గురువారం మాట్లాడారు. ‘‘ పన్నూను అంతమొందించేందుకు భారత ‘రా’ అధికారి, మరో భారతీయుడు నిఖిల్ గుప్తాతో కలిసి కుట్ర పన్నారని అమెరికా ఆరోపించింది.
కానీ అందుకు బలమైన సాక్ష్యాలు ఒక్కదాని కూడా బయటపెట్టలేదు. సాక్ష్యాలు చూపకుండా ఊహాగానాలను వ్యాప్తిచేయడం తగదు. భారత విధానాలు, దేశ చరిత్రను అవగాహన చేసుకునే స్థాయి అమెరికాకు లేదు. అందుకే భారత్‌లో మత స్వేచ్ఛపై ఆరోపణలను అమెరికా నిరంతరం గుప్పిస్తోంది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాజకీయ వాతావరణాన్ని అస్థిరపరిచేందుకు అమెరికా ప్రయతి్నస్తోంది.
అందుకే రాష్ట్రాల్లో మానవహక్కుల ఉల్లంఘన జరిగిందని, మత స్వేచ్ఛకు భంగం వాటిల్లిందని నివేదికలు ఇస్తోంది’’ అని మారియా చెప్పినట్లు రష్యా అధికారిక ‘ఆర్‌టీ న్యూస్’ ఛానల్ ఒక వార్తను ప్రసారంచేసింది. గత ఏడాది అమెరికాలో పన్నూను భారత రీసెర్చ్ అండ్ అనాలసిస్ (రా) అధికారి చంపాలనుకున్న కుట్రను అమెరికా అధికారులు విజయవంతంగా భగ్నంచేశారని వాషింగ్టన్ పోస్ట్ ఒక కథనం వెలువరిచింది. దీనిపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. ఈ ఉదంతంపై దర్యాప్తు కొనసాగుతున్న వేళ ఇలాంటి నిరాధార ఆరోపణలు తగవని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ«దీర్ జైశ్వాల్ ఆనాడే ఢిల్లీలో ఆక్షేపించారు.
Comments
Please login to add a commentAdd a comment