విజయనగరం మున్సిపాలిటీ: రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు గ్రామ పంచాయతీల ఎన్నికలకు సిద్ధంకావాలని జిల్లా పంచాయతీ అధికారి బలివాడ సత్యనారాయణ ఆదేశించారు. బుధవారం తన కార్యాలయంలో విజయనగరం, బొబ్బిలి డివిజన్‌ల పరిధిలో గల డీఎల్‌పీఓలు, ఈఓపీఆర్‌డీలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామ పంచాయతీల పదవీకాలం జూలై నెలతో ముగియనున్న నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం నూతన పాలకవర్గాల ఎన్నికల నిర్వహణకు అవసరమైన ప్రణాళికలు రూపొందించాలంటూ ఉత్తర్వులు జారీ చేసిందన్నారు.
ఇందులో భాగంగా వచ్చే నెల 15న జిల్లాలోని 920 గ్రామ పంచాయతీలకు సంబంధించిన ఓటర్ల జాబితాను సిద్ధం చేసి పంచాయతీ కార్యాలయంలో ప్రచురించాల్సి ఉందన్నారు. ప్రస్తుతం అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సిద్ధం చేసిన ఓటర్ల జాబితా ఆధారంగా గ్రామ పంచాయతీల వారీగా నూతన ఓటర్ల జాబితాను తయారు చేయాలని సూచించారు. మండలాల వారీగా ఓటర్ల జాబితాను సంబంధిత తహసీల్దార్ల వద్ద నుంచి ఈఓపీఆర్‌డీలు సేకరించి వాటిని గ్రామ పంచాయతీ కార్యదర్శులకు అందజేయాలన్నారు. పంచాయతీ ఓటర్ల జాబితాలో ఎటువంటి తొలగింపులు, చేర్పులకు అవకాశం ఉండదన్నారు. జిల్లాలో వార్డుల వారీగా ఓటర్ల జాబితాలను సక్రమ వరుసలో ఈ నెల 20 నాటికి సిద్ధం చేయాలని సూచించారు. వాటిలో తప్పుఒప్పులను సరిచూసిన తర్వాత నిర్ధేశిత సమయానికి తుది ఓటర్ల జాబితా ప్రచురిస్తామని చెప్పారు.
బకాయిలు వసూలు చేయాలి..
ఈనెల 15 నాటికి 2017–17 ఆర్థిక సంవత్సరంలో బకాయి ఉన్న రూ. 15 కోట్ల పన్నును వసూలు చేసి వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపరచాలని జిల్లా పంచాయతీ అధికారి బలివాడ సత్యనారాయణ సూచించారు. ఆర్థిక సంవత్సరంలో రూ. 15 కోట్ల డిమాండ్ ఉండగా... ఇప్పటి వరకు 8 కోట్ల రూపాయలు మాత్రమే వసూలైందన్నారు. మిగిలిన బకాయిలను పది రోజుల్లో వసూలు చేయాలని కోరారు. అదేవిధంగా వీధి దీపాలు, రక్షిత మంచినీటి పథకాలకు సంబంధించి విద్యుత్ బిల్లులను సకాలంలో చెల్లించాలని సూచించారు. అనధికారిక లే అవుట్‌లను గుర్తించి వాటి ద్వారా గ్రామ పంచాయతీలకు రావాల్సిన ఆదాయాన్ని సమకూర్చాలన్నారు.
తాగునీటి ఎద్దడినివారణకు చర్యలు..
ప్రస్తుత వేసవి నేపథ్యంలో గ్రామాల్లో తాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలని డీపీఓ సత్యనారాయణ ఆదేశించారు. గ్రామల్లో ఉన్న పీడబ్ల్యూ, ఎంపీడబ్ల్యూ పథకాలు పాడైతే మరమ్మతులు చేపట్టాలని సూచించారు. అదేవిధంగా అన్ని గ్రామాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు. సమావేశంలో విజయనగరం డివిజనల్ పంచాయతీ అధికారి ఎ.మోహనరావు , ఈఓపీఆర్‌డీలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment