సాక్షి, హైదరాబాద్: పల్లెపోరులోనూ గులాబీ జెండా రెపరెపలాడింది. ఊరిలోనూ కారు జోరు కొనసాగింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన టీఆర్‌ఎస్.. గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనూ సత్తా చాటుతోంది. తొలివిడత ఎన్నికల్లో ఆ పార్టీ బలపరిచిన అభ్యర్థులు విజయకేతనం ఎగురవేశారు. సోమవారం 4,470 పంచాయతీలకు (ఏకగ్రీవంతో కలిపి) ఎన్నికలు జరిగాయి. కడపటి వార్తలు అందేసరికి టీఆర్‌ఎస్ ఏకంగా 2,769 పంచాయతీలను కైవసం చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ 917 స్థానాల్లో విజయం సాధించగా.. బీజేపీ 66, టీడీపీ 29, సీపీఎం 33, సీపీఐ 14 చోట్ల గెలుపొందాయి. ఇతరులు 642 పంచాయతీల్లో పాగా వేశారు.
ప్రశాంతంగా పోలింగ్...
తొలివిడత పంచాయతీ పోరు ప్రశాంతంగా ముగిసింది. ఎక్కడా అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అధికారులు పక్కా ఏర్పాట్లు చేశారు. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభమై మధ్యాహ్నం ఒంటిగంటకు ముగిసింది. తొలివిడత పంచాయతీల పరిధిలో మొత్తం 48,46,443 మంది ఓటర్లున్నారు. వీరిలో 41,56,414 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడంతో 85.76శాతం ఓటింగ్ నమోదైంది. ఓటేసినవారిలో మహిళలు 20,36,782 మంది, పురుషులు 21,19,624 మంది, ఇతరులు 8 మంది ఉన్నారు. అత్యధికంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో 95.32శాతం పోలింగ్ నమోదు కాగా, ఆ తర్వాతి స్థానాల్లో ఖమ్మం(93.92%), రంగారెడ్డి (92.67%), సూర్యాపేట(92.45%), నల్లగొండ(91.28%) జిల్లాలున్నాయి. తక్కువ పోలింగ్ జరిగిన జిల్లాల్లో రాజన్న సిరిసిల్ల(78.47%), నిజామాబాద్(78.56%), మహబూబ్‌నగర్(81.15%), కామారెడ్డి(81.29%), జగిత్యాల(81.80%) ఉన్నాయి.
9 జిల్లాల్లో నో పోలింగ్...
వాస్తవానికి తొలివిడతలో 4,479 చోట్ల ఎన్నికలు జరగాల్సి ఉండగా..9 పంచాయతీల్లో నామినేషన్లు రాలేదు. దీంతో అక్కడ ఎన్నికలు నిర్వహించలేదు. వీటిలో మంచిర్యాల జిల్లాలో రెండు, భద్రాద్రి కొత్తగుడెం జిల్లాలో రెండు, నాగర్ కర్నూల్ జిల్లాలో ఐదు గ్రామ పంచాయతీలున్నాయి. ఇక 769 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. దీంతో 3,701 పంచాయతీల్లో సర్పంచ్ ఎన్నికలు జరగ్గా.. 12,202 మంది అభ్యర్థులు పోటీ చేశారు. వార్డు సభ్యుల కేటగిరీలో 192 స్థానాలకు నామినేషన్లు రాలేదు. 10,654 వార్డు స్థానాలు ఏకగ్రీవం కాగా.. మిగిలిన 28,976 స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. ఆయా చోట్ల 70,094 మంది అభ్యర్థులు పోటీపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment