భారత్‌లో కమ్యూనిస్టుల పరిస్థితి దారుణంగా తయారైంది. వారు చెప్పేవి శ్రీరంగ నీతులు, చేసేవి అవకాశవాద, స్వార్థ రాజకీయాలు అనే అపవాదును మూటగట్టుకుంటున్నారు. పదే పదే తప్పులు చేయడం వీరికి అలవాటై పోయింది. బీజేపి మతతత్త్వపార్టీ అంటూ వేలెత్తి చూపే ఈ కమ్యూనిస్టులు కేరళలో పచ్చి ముస్లిం మతతత్త్వ పార్టీ అయిన ముస్లిం లీగ్‌తో కలిసి తమ స్వార్థ రాజకీయాలు చేస్తుంటారు. గతంలో నిరు పేదల పక్షాన పోరాడుతారనే కాస్తో కూస్తో పేరు ఉండేది. ఇటీవల కాలంలో పోరాటాలు పక్కన పారేసి తమ పబ్బం ఎలా గడుపుకోవాలనే ఆరాటమే వీరిలో ఎక్కువైంది. గతంలో ఖమ్మంలో జరిగిన ఎన్నికల సందర్భంగా వామపక్ష పార్టీ ముఖ్య నాయకుడు డబ్బులకు అమ్ముడుపోయి పక్క పార్టీకి సహాయపడినట్లు అదే వామపక్ష పార్తీలకే చెందిన మరో కీలక నాయకుడు విమర్శించడం తెలిసిందే.
ఇలాంటి వాదంతోనే ప్రస్తుతం తెలంగాణలో తమ పబ్బం గడుపుకోవడానికే టీఆర్‌ఎస్ పార్టీతో దోస్తీ చేస్తున్నారు. గతంలో ఇవే కమ్యూనిస్టు పార్టీలను అవమానకరంగా దూషించిన కేసీఆర్ పంచన చేరి ఆయన పారేసే ఒకటి, రెండు అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయొచ్చని ఆశపడుతున్నారు. బీజేపి మతతత్త్వ పార్టీ అని వేలెత్తి చూపుతున్న ఈ సోకాల్డ్ వామపక్షీయులు టీఆర్‌ఎస్ దోస్తీ చేస్తున్న పచ్చి మతతత్త్వ పార్టీ అయిన మజ్లిస్ పార్టీతో ఎలా కలుస్తారో ప్రజలకు చెప్పాలి. అంటే కేవలం టీఆర్‌ఎస్ పార్టీతోనే పొత్తు అని చెప్పి తప్పించు కుంటారేమో. మతతత్త్వం పేరుతో బీజేపీని పదే పదే విమర్శించే వీరు ఎంఐఎం వైఖరిని విమర్శించిన దాఖలాలు లేవు.
మొన్నటిదాక టీఆర్‌ఎస్‌ను అవినీతి, అక్రమాల పుట్ట అని వేలెత్తి చూపిన వీరు... తాము చేతులు కలుపగానే టీఆర్‌ఎస్ నీతిమంతంగా మారిపోయిందా? కేంద్రం సింగరేణిని ప్రైవేటీకరిస్తుందని టీఆర్‌ఎస్ చేసిన అబద్ధపు ప్రచారాన్ని గుడ్డిగా నమ్మిన వామపక్షాలు, రామగుండం ఎరువుల కర్మాగారాన్ని జాతికి అంకితం చేయడానికి రాష్ట్రానికి వచ్చిన ప్రధాని మోదీ పర్య టనను అడ్డుకోవాలని విఫలయత్నం చేశారు. రాష్ట్రంలో తమ పార్టీకి ఉన్న ఏకైక ఎమ్మెల్యే నోముల నరసింహయ్యను టీఆర్‌ఎస్‌లో కలిపేసుకొని తమను నిర్వీర్యం చేసిన విషయాన్ని కూడా మరిచి పోయారని ఆ పార్టీల కార్యకర్తలే దుయ్యబడుతున్నారు.
గత ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌తో చేతులు కలిపి టీఆర్‌ఎస్‌పై దుమ్మెత్తి పోసిన వీరు ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీతోపాటు మళ్ళీ బీజేపీని తిట్టిపోస్తున్నారు. అంతకు ముందు ఇవే వామపక్షాలు తెలుగు దేశం పార్టీతో అంటకాగిన విషయం తెలిసిందే. దీనిని బట్టి అర్థమమ్యే విషయం ఏంటంటే వీరంతా తమ స్వార్థం కోసం ఎవరితోనైనా, ఎప్పు డైనా కలిసి పోతారనీ, సిద్ధాంతాలు రాద్ధాంతాలు ఏమి ఉండవనీనూ. ఈ పార్టీల జాతీయ స్థాయి నాయకులు కూడా తక్కువేమీ తిన లేదు. మన రాష్ట్ర నాయకులకు వారే మార్గదర్శకులు. ఈ పార్టీలకు చెందిన అగ్రనాయకుల్లో కొందరు కోట్లకు పడగలెత్తారనీ, కొందరికి ప్రముఖ జాతీయ టీవీ ఛానళ్లలో, పత్రికల్లో వాటాలు కూడా ఉన్నాయనే విమ ర్శలున్నాయి. దేశమంతా రాష్ట్రాల వారీగా ఇతరులతో జట్టు కట్టడానికి వీరంతా చెప్పే ఏకైక కారణం బీజేపీ హిందూ మతతత్త్వాన్ని ఎదుర్కొని సెక్యులరిజాన్ని కాపాడటం. ఇక్కడ ప్రముఖ రచయిత్రి తస్లిమా నస్రీన్ అన్న... ‘భారత్‌లో సెక్యులరిజం అంటే హిందువులను అవమానించడం, మైనార్టీల పేరుతో అన్య మతస్థులను నెత్తికెత్తుకోవడం’ అన్న మాటలు గుర్తు చేసుకోవాలి.
ఈ వామపక్ష భావాలవారు ప్రధానంగా సామాజిక కార్యకర్తల ముసుగులో, స్వచ్ఛంద సంస్థల ముసుగులో ఉన్నారు. అలాంటి వారిలో ఒకరైన తీస్తా సెతల్వాద్ ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోదీని సైతం గతంలో అక్రమంగా కేసుల్లో ఇరికించేందుకు ఎంతగా ప్రయత్నించారో ఇటీవల బయటపడిన విషయం తెలిసిందే. ఏదైనా రాష్ట్రంలో ఎన్నికలున్నాయంటే చాలు ఇలాంటి వారు మేధావుల రూపం లోనో, మరో రూపంలోనో బీజేపీకి వ్యతిరేకంగా కల్పిత ఉద్యమాలు సృష్టిస్తుంటారు.
వామపక్షాల నాయకులు తమ పార్టీల బలోపేతానికి కృషి చేయకుండా పక్క పార్టీల వైపు ఆశగా ఎదురు చూస్తుండడం వీరి దయనీయ పరిస్థితికి అద్దం పడుతోంది. ఇప్పటికైనా వామపక్షాలు మేలుకొని తమ పార్టీల పటిష్టతకు పూనుకోకపోతే గతంలో మన దేశంలో కమ్యూనిస్టు పార్టీలనేవి ఉండేవి అని చెప్పుకునే దుఃస్థితి వస్తుంది. (క్లిక్ చేయండి: అదో.. ఆరో వేలు లాంటి వ్యవస్థ.. రద్దు చేయడమే మేలు!)
- శ్యామ్ సుందర్ వరయోగి
సీనియర్ జర్నలిస్ట్
Comments
Please login to add a commentAdd a comment