Shyam sundar
-
జస్టిస్ బండారు శ్యాంసుందర్ పదవీ విరమణ
సాక్షి, అమరావతి : హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బండారు శ్యాం సుందర్ శుక్రవారం పదవీ విరమణ చేశారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ నేతృత్వంలో న్యాయమూర్తులందరూ ప్రత్యేకంగా సమావేశమై ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా జస్టిస్ ఠాకూర్ మాట్లాడుతూ.. జస్టిస్ శ్యాం సుందర్ 33 ఏళ్ల పాటు వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించి, న్యాయవ్యవస్థకు ఎన్నో రకాలుగా సేవలు అందించారని తెలిపారు. ఇంత సుదీర్ఘ కాలం పని చేయడం చిన్న విషయం కాదన్నారు. జస్టిస్ శ్యాం సుందర్ విలువలకు పెద్ద పీట వేశారని, తండ్రి చెప్పిన మాటలను తూచా తప్పకుండా ఇప్పటివరకు పాటించారని తెలిపారు. క్లిష్టమైన కేసులను చాలా సులభంగా పరిష్కరించారని చెప్పారు. సత్వర న్యాయం కోసం కృషి చేశారు అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్, హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు కిలిగినీడి చిదంబరం, బార్ కౌన్సిల్ చైర్మన్ నల్లారి ద్వారకనాథరెడ్డి, డిప్యూటీ సొలిసిటర్ జనరల్ (డీఎస్జీ) పసల పొన్నారావు తదితరులు జస్టిస్ శ్యాం సుందర్ సేవలను కొనియాడారు. న్యాయవ్యవస్థకు ఆయన అందించిన సేవలు మరువలేనివన్నారు. సత్వర న్యాయం కోసం ఎంతో కృషి చేశారని, న్యాయవ్యవస్థ సమర్థతను పెంచేందుకు కృషి చేశారని తెలిపారు. ఎన్నో క్లిష్టమైన కేసులను సమర్థతతో, స్పష్టతతో పరిష్కరించారన్నారు. పని చేసిన ప్రతి చోటా ఎంతో హుందాగా, సమర్థవంతంగా వి«ధులు నిర్వర్తించారన్నారు. ఆయన జీవితం ఎంతో మందికి స్ఫూర్తిదాయకమని వారు చెప్పారు.ఈ స్థాయికి వస్తానని ఊహించలేదు అనంతరం జస్టిస్ శ్యాం సుందర్ మాట్లాడుతూ.. తాను ఈ స్థాయికి వస్తానని ఎన్నడూ ఊహించలేదన్నారు. ఎంతో మంది తనకు మార్గదర్శకంగా ఉండి, ఇక్కడి వరకు వచ్చేందుకు సహకరించారని తెలిపారు. తన గురువు, సీనియర్ అయిన తన తండ్రి ఎంతో నేర్పారన్నారు. విధి నిర్వహణలో ఎవరినైనా బాధపెట్టి ఉంటే క్షమించాలన్నారు. తనకు సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ న్యాయవ్యవస్థతో తనకు ఎన్నో మధుర స్మృతులున్నాయని, వాటిని గుండెల్లో దాచుకుంటున్నానని తెలిపారు. తాను చేసిన ప్రమాణానికి కట్టుబడి విధులు నిర్వర్తించానని చెప్పారు. ఈ వీడ్కోలు కార్యక్రమంలో జస్టిస్ శ్యాం సుందర్ కుటుంబ సభ్యులు, అదనపు ఏజీ ఇవన సాంబశివ ప్రతాప్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ మెండ లక్ష్మీనారాయణ, న్యాయవాదులు, రిజి్రస్టార్లు పాల్గొన్నారు. అనంతరం హైకోర్టు న్యాయవాదుల సంఘం జస్టిస్ శ్యాం ప్రసాద్ దంపతులను ఘనంగా సన్మానించింది. వారికి శాలువా కప్పి, అమ్మవారి చిత్రపటాన్ని బహూకరించారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు చిదంబరం, ఉపా«ధ్యక్షుడు ఎన్.రంగారెడ్డి, ప్రధాన కార్యదర్శి నన్నపనేని శ్రీహరి, ఇతర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. -
హైకోర్టుకు మేజర్ శ్యామ్‌సుందర్ మహంతి భార్య.. కీలక ఆదేశాలు జారీ
భువనేశ్వర్: చైనా–భారత్ మధ్య 1962లో జరిగిన యుద్ధంలో పాల్గొన్న మేజర్ శ్యామ్‌సుందర్ మహంతి ధైర్య సాహసాలకు ప్రతీకగా ప్రదానం చేసిన భూమి(రికార్డ్ ఆఫ్ లైట్స్–ఆర్ఓఆర్)ని ఆయన భార్యకు అందజేయాలని రాష్ట్ర హైకోర్టు ఆదేశించింది. నెల రోజుల వ్యవధిలో భూమి సంబంధిత పట్టా సిద్ధం చేయాలని ఆదేశాల్లో పేర్కొంది. తదుపరి వారం రోజుల్లోగా సవరించిన ఆర్ఓఆర్ను పిటిషనర్ ఇంటికి వెళ్లి, ప్రత్యక్షంగా అందజేయాలని స్పష్టం చేసింది. దివంగత మేజర్ శ్యామ్‌సుందర్ మహంతి భార్య పూర్ణిమా మహంతి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్ బిశ్వనాథ్ రథ్‌తో కూడిన ధర్మాసనం పై విధంగా ఆదేశాలు జారీ చేసింది. ధైర్యసాహసి మేజర్ భార్యను వేధించడం పట్ల న్యాయమూర్తి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సత్వర చర్యలతో ఆర్ఓఆర్ సిద్ధం చేసి, ఇంటి వద్దకే వెళ్లి పిటిషర్‌కు అందజేయాలన్నారు. అధికారి తీరుపై అసహనం.. 1962 చైనా–భారత్ యుద్ధంలో మేజర్ మహంత ధైర్య సాహసాలు ప్రదర్శించినందుకు గాను ప్రభుత్వం ఆయనకు శ్యామపూర్ ప్రాంతంలో 5 ఎకరాల భూమిని ప్రదానం చేసింది. 2004లో మహంతి మరణించగా.. కుటుంబ వ్యవహారాల నిమిత్తం ఆయనకు కేటాయించిన భూమిని భార్య పూర్ణిమ వివిధ సందర్భాలలో ఐదుగురు వేర్వేరు వ్యక్తులకు విక్రయించారు. మరికొంత భూమిని తనవద్దే ఉంచుకున్నారు. దీనిపై భువనేశ్వర్ అసిస్టెంట్ సెటిల్మెంట్ అధికారి అభ్యంతరం వ్యక్తం చేస్తూ భూమిని ప్రభుత్వ సాధారణ పాలనాశాఖ పేరిట నమోదు చేయాలని ఆదేశించారు. ఈ ఉత్వర్వులను పూర్ణిమ మహంతి హైకోర్టులో సవాల్ చేశారు. ఆమె అభ్యర్థన పట్ల హైకోర్టు సానుకూలంగా స్పందించింది. అధికారి తీరును తప్పుబడుతూ ఉత్తర్వులు చట్టపరంగా ఆమోదయోగ్యం కాదని కొట్టివేసింది. ఈ భూమిని ధైర్య సాహసాలను గుర్తిస్తూ రిటైర్డ్ ఆర్మీ మేజర్‌కు కేటాయించడంతో ఈ విషయంలో సంబంధిత అధికారులు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించింది. -
వామపక్షాల తీరు మారాలి.. పక్క పార్టీల వైపు ఆశగా చూస్తూ..
భారత్‌లో కమ్యూనిస్టుల పరిస్థితి దారుణంగా తయారైంది. వారు చెప్పేవి శ్రీరంగ నీతులు, చేసేవి అవకాశవాద, స్వార్థ రాజకీయాలు అనే అపవాదును మూటగట్టుకుంటున్నారు. పదే పదే తప్పులు చేయడం వీరికి అలవాటై పోయింది. బీజేపి మతతత్త్వపార్టీ అంటూ వేలెత్తి చూపే ఈ కమ్యూనిస్టులు కేరళలో పచ్చి ముస్లిం మతతత్త్వ పార్టీ అయిన ముస్లిం లీగ్‌తో కలిసి తమ స్వార్థ రాజకీయాలు చేస్తుంటారు. గతంలో నిరు పేదల పక్షాన పోరాడుతారనే కాస్తో కూస్తో పేరు ఉండేది. ఇటీవల కాలంలో పోరాటాలు పక్కన పారేసి తమ పబ్బం ఎలా గడుపుకోవాలనే ఆరాటమే వీరిలో ఎక్కువైంది. గతంలో ఖమ్మంలో జరిగిన ఎన్నికల సందర్భంగా వామపక్ష పార్టీ ముఖ్య నాయకుడు డబ్బులకు అమ్ముడుపోయి పక్క పార్టీకి సహాయపడినట్లు అదే వామపక్ష పార్తీలకే చెందిన మరో కీలక నాయకుడు విమర్శించడం తెలిసిందే. ఇలాంటి వాదంతోనే ప్రస్తుతం తెలంగాణలో తమ పబ్బం గడుపుకోవడానికే టీఆర్ఎస్ పార్టీతో దోస్తీ చేస్తున్నారు. గతంలో ఇవే కమ్యూనిస్టు పార్టీలను అవమానకరంగా దూషించిన కేసీఆర్ పంచన చేరి ఆయన పారేసే ఒకటి, రెండు అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయొచ్చని ఆశపడుతున్నారు. బీజేపి మతతత్త్వ పార్టీ అని వేలెత్తి చూపుతున్న ఈ సోకాల్డ్ వామపక్షీయులు టీఆర్ఎస్ దోస్తీ చేస్తున్న పచ్చి మతతత్త్వ పార్టీ అయిన మజ్లిస్ పార్టీతో ఎలా కలుస్తారో ప్రజలకు చెప్పాలి. అంటే కేవలం టీఆర్ఎస్ పార్టీతోనే పొత్తు అని చెప్పి తప్పించు కుంటారేమో. మతతత్త్వం పేరుతో బీజేపీని పదే పదే విమర్శించే వీరు ఎంఐఎం వైఖరిని విమర్శించిన దాఖలాలు లేవు. మొన్నటిదాక టీఆర్ఎస్ను అవినీతి, అక్రమాల పుట్ట అని వేలెత్తి చూపిన వీరు... తాము చేతులు కలుపగానే టీఆర్ఎస్ నీతిమంతంగా మారిపోయిందా? కేంద్రం సింగరేణిని ప్రైవేటీకరిస్తుందని టీఆర్ఎస్ చేసిన అబద్ధపు ప్రచారాన్ని గుడ్డిగా నమ్మిన వామపక్షాలు, రామగుండం ఎరువుల కర్మాగారాన్ని జాతికి అంకితం చేయడానికి రాష్ట్రానికి వచ్చిన ప్రధాని మోదీ పర్య టనను అడ్డుకోవాలని విఫలయత్నం చేశారు. రాష్ట్రంలో తమ పార్టీకి ఉన్న ఏకైక ఎమ్మెల్యే నోముల నరసింహయ్యను టీఆర్ఎస్లో కలిపేసుకొని తమను నిర్వీర్యం చేసిన విషయాన్ని కూడా మరిచి పోయారని ఆ పార్టీల కార్యకర్తలే దుయ్యబడుతున్నారు. గత ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌తో చేతులు కలిపి టీఆర్ఎస్పై దుమ్మెత్తి పోసిన వీరు ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీతోపాటు మళ్ళీ బీజేపీని తిట్టిపోస్తున్నారు. అంతకు ముందు ఇవే వామపక్షాలు తెలుగు దేశం పార్టీతో అంటకాగిన విషయం తెలిసిందే. దీనిని బట్టి అర్థమమ్యే విషయం ఏంటంటే వీరంతా తమ స్వార్థం కోసం ఎవరితోనైనా, ఎప్పు డైనా కలిసి పోతారనీ, సిద్ధాంతాలు రాద్ధాంతాలు ఏమి ఉండవనీనూ. ఈ పార్టీల జాతీయ స్థాయి నాయకులు కూడా తక్కువేమీ తిన లేదు. మన రాష్ట్ర నాయకులకు వారే మార్గదర్శకులు. ఈ పార్టీలకు చెందిన అగ్రనాయకుల్లో కొందరు కోట్లకు పడగలెత్తారనీ, కొందరికి ప్రముఖ జాతీయ టీవీ ఛానళ్లలో, పత్రికల్లో వాటాలు కూడా ఉన్నాయనే విమ ర్శలున్నాయి. దేశమంతా రాష్ట్రాల వారీగా ఇతరులతో జట్టు కట్టడానికి వీరంతా చెప్పే ఏకైక కారణం బీజేపీ హిందూ మతతత్త్వాన్ని ఎదుర్కొని సెక్యులరిజాన్ని కాపాడటం. ఇక్కడ ప్రముఖ రచయిత్రి తస్లిమా నస్రీన్ అన్న... ‘భారత్‌లో సెక్యులరిజం అంటే హిందువులను అవమానించడం, మైనార్టీల పేరుతో అన్య మతస్థులను నెత్తికెత్తుకోవడం’ అన్న మాటలు గుర్తు చేసుకోవాలి. ఈ వామపక్ష భావాలవారు ప్రధానంగా సామాజిక కార్యకర్తల ముసుగులో, స్వచ్ఛంద సంస్థల ముసుగులో ఉన్నారు. అలాంటి వారిలో ఒకరైన తీస్తా సెతల్వాద్ ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోదీని సైతం గతంలో అక్రమంగా కేసుల్లో ఇరికించేందుకు ఎంతగా ప్రయత్నించారో ఇటీవల బయటపడిన విషయం తెలిసిందే. ఏదైనా రాష్ట్రంలో ఎన్నికలున్నాయంటే చాలు ఇలాంటి వారు మేధావుల రూపం లోనో, మరో రూపంలోనో బీజేపీకి వ్యతిరేకంగా కల్పిత ఉద్యమాలు సృష్టిస్తుంటారు. వామపక్షాల నాయకులు తమ పార్టీల బలోపేతానికి కృషి చేయకుండా పక్క పార్టీల వైపు ఆశగా ఎదురు చూస్తుండడం వీరి దయనీయ పరిస్థితికి అద్దం పడుతోంది. ఇప్పటికైనా వామపక్షాలు మేలుకొని తమ పార్టీల పటిష్టతకు పూనుకోకపోతే గతంలో మన దేశంలో కమ్యూనిస్టు పార్టీలనేవి ఉండేవి అని చెప్పుకునే దుఃస్థితి వస్తుంది. (క్లిక్ చేయండి: అదో.. ఆరో వేలు లాంటి వ్యవస్థ.. రద్దు చేయడమే మేలు!) - శ్యామ్ సుందర్ వరయోగి సీనియర్ జర్నలిస్ట్ -
నేలవిడిచి సాముచేయవద్దు!
‘‘తన కోపమే తనకు శత్రువు, తన శాంతమే తనకు రక్ష’’ అనే సత్యాన్ని రాష్ట్రంలోని కేసీఆర్ ప్రభుత్వం మరచిపోయినట్లుంది. హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘోరపరా భవం ఎదుర్కోవడంతో కేసీఆర్‌లో అసహనం తీవ్ర స్థాయికి చేరింది. ప్రజల్లో రాష్ట్ర ప్రభుత్వం పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో సంయమనంగా ఉండవలసిందిపోయి... విచక్షణా రహితంగా రైతు, నిరుద్యోగ, ఉద్యోగ, ఉపాధ్యాయ వ్యతిరేక చర్యలు చేపడుతోంది. ప్రభుత్వ అసమర్థత కారణంగానే ఇంటర్ విద్యార్థులు పదుల సంఖ్యలో ఆత్మహత్యలు చేసుకున్న విషయం తెలిసిందే. వారిలో ఆత్మస్థైర్యాన్ని నిలిపేందుకు ప్రజల పక్షాన బీజేపీ నిలబడటాన్ని సహించలేక కేసీఆర్ ప్రభుత్వం దుందుడుకు చర్యలకు తెరలేపింది. అందులో భాగంగానే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ అయిన బండి సంజయ్‌ను అరెస్టు చేయించి జైలుకు పంపించారనేది విశ్లేషకుల మాట. హైకోర్టు బండి సంజయ్ అరెస్ట్, రిమాండ్ల విషయంలో అసంతృప్తి వ్యక్తం చేస్తూ, ఆయన్ని విడుదల చేయాలని ఆదేశించి న్యాయ వవస్థ ఔన్నత్యాన్ని మరోసారి చాటిచెప్పింది. బండి సంజయ్‌ని అరెస్టు చేసిన 15 నిమిషాల్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయడం ఎలా సాధ్యమైందని హైకోర్టు ప్రశ్నించడం పోలీసు శాఖ ఆత్మ విమర్శ చేసుకోవలసిన అవసరాన్ని గుర్తు చేస్తోంది. తెలంగాణలో 317 జీఓ విషయంలో ఇంత పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం అవుతున్నా ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం శోచనీయం. తెలంగాణ ఉద్యమ యోధులైన ఉద్యోగ, ఉపాధ్యాయులు 317 జీఓ కారణంగా స్థానికత విషయంలో తీవ్ర భయాందోళనలకు గురవడమే కాకుండా, పలువురు ఆత్మహత్యలకు పాల్పడటం బాధాకరం. తెలంగాణ సాధనకు ప్రధాన అంశాలైన నిధులు, నియామకాలు, నీళ్ళ విషయాలను కేసీఆర్ ప్రభుత్వం ఆటకెక్కించింది. అందుకే ఇటీవల జరిగిన జీహెచ్ఎంసీ, దుబ్బాక, హుజూరాబాద్ ఎన్నికలు/ఉప ఎన్నికల్లో ఓటర్లు టీఆర్ఎస్ను ఓడించి, బీజేపీని గెలిపించారు. (చదవండి: ఈ జీఓతో సమస్య మళ్లీ మొదటికి!) ఇచ్చిన హామీలను కేసీఆర్ మరచిపోయారు. దళితు డిని ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పి తానే ముఖ్యమంత్రి పీఠమెక్కడమే కాకుండా... వారికి ఇస్తామన్న మూడెకరాల భూమి విషయంలోనూ కేసీఆర్ మాటతప్పారు. ఇటీవల హడావుడిగా ప్రవేశపెట్టిన దళిత బంధు పథకాన్ని కూడా ఇప్పటికీ అమలు చేయడం లేదు. ఉద్యోగాల భర్తీ కోసం ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకపోవడంతో నిరాశ చెందిన నిరుద్యోగుల్లో పలువురు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇక రైతులను వరి పంట వేయవద్దని, వరి వేస్తే ఉరే అన్న ధోరణిలో కేసీఆర్ భయపెడుతున్నారు. ధాన్యం కొనుగోలులోని జాప్యం కారణంగా పలువురు రైతులు కల్లాల్లో, మార్కెట్ యార్డుల్లో వరి కుప్పలపైనే దిగులుతో ప్రాణాలు వదిలిన విషయం ఈ సందర్భంగా గుర్తుచేసుకోవాలి. వరి కొనకపోవడానికి కారణం కేంద్రమే అన్న ధోరణిలో రాష్ట్రం వ్యవహరించడం శోచనీయం. రైతులు వాస్తవాలు గ్రహించారు కాబట్టే బీజేపీ రైతులకు మద్దతుగా చేపట్టిన ఆందోళనలకు పూర్తిగా అండగా నిలిచారు. దేశంలో బాయిల్డ్ రైస్ వాడకం తగ్గడమే కాకుండా వరి ఉత్పత్తి పెరగడంతో కేంద్ర ప్రభుత్వం తాము బాయిల్డ్ రైస్ కొనబోమని ఎప్పుడో స్పష్టం చేసింది. అందుకు అంగీకరించి కూడా రాష్ట్ర ప్రభుత్వం మాట తప్పి రైతుల ఊపిరి తీసింది. రాష్ట్రానికి కేంద్రం సహకారం, సహాయం అందే విషయంలో అన్ని విధాలా కృషి చేస్తున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ఇటీవల కేసీఆర్ అభ్యంతర పదజాలంతో దూషించడం తనలో పెరిగిన అసహనానికి మరో ఉదాహరణగా చెప్పవచ్చు. (చదవండి: తప్పు చేసినా శిక్షకు అతీతులా?) ప్రజామోదం లేకుండా ప్రభుత్వం ఏమీ సాధించలేదు. అలాగే ఉద్యోగ, ఉపాధ్యాయులు 317 జీఓ విషయంలో తీవ్ర భయాందోళనలకు గురై ఆత్మహత్యలకు పాల్పడుతున్నా వారికి ధైర్యం చెప్పాల్సిన ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ఇప్పటికీ చలించకపోవడం శోచనీయం. ఉద్యోగులు, ఉపాధ్యాయులను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్న 317 జీఓలో తగిన సవరణలను చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. (చదవండి: ఈ కశ్మీర్ లెక్క కరెక్టేనా?) - శ్యామ్ సుందర్ వరయోగి బీజేపీ రాష్ట్ర నాయకులు -
మోదీ వాస్తవాలు ఎందుకు చెప్పట్లేదు?
భారత రాజ్యాంగం 7వ షెడ్యూలులోని ఆర్టికల్ 246 ప్రకారం ‘‘ప్రజారోగ్యం’’ రాష్ట్రాల పరిధిలోని అంశం. ఈ జాబితా ప్రకారం 6 వ అంశంలోని ప్రజారోగ్యం, ఆసుపత్రులు, డిస్పెన్సరీలు, పరిశుభ్రతలు కాపాడాల్సిన బాధ్యత రాష్ట్రాలదే. అంటే అసుపత్రుల్లో సకల సౌకర్యాలు ఐసియూ బెడ్స్, మందులు, వెంటిలేటర్లు, అంతెందుకు ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటు బాధ్యత కూడా రాష్ట్రప్రభుత్వాలదే. వీటి ఏర్పాటులో రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమైనా మోదీ చెప్పట్లేదు. ఎందుకు? ఎందుకంటే, ఎవరినో నిందిస్తూ కూర్చుంటే ప్రజల ప్రాణాలు గాల్లో కలుస్తాయి కాబట్టి. రాజకీయాలు చేసే సమయం కాదు కాబట్టి. కేంద్రం ఇప్పటిదాకా కొత్తగా 14 ఎయిమ్స్ వైద్య కళాశాలలను మంజూరు చేయగా అందులో 11 కళాశాలలు పనిచేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు తమ పరిధిలో ఎన్ని వైద్య కళాశాలలు నెలకొల్పాయో మోదీ చెప్పట్లేదు ఎందుకు? ఎందుకంటే ప్రజలు నిజాలు గ్రహించాలని. కేంద్రం ఇప్పటి దాకా విపత్తు నివారణ కోసం 2020–2021 ఆర్థిక సంవత్సరంలో తొలి విడతగా రాష్ట్రాలకు మొత్తం రూ. 11,092 కోట్లు విడుదల చేయగా అవి ఇప్పుడు రాష్ట్రాల వద్ద అందుబాటులో ఉన్న విషయాన్ని మోదీ ఎందుకు చెప్పట్లేదు? అంతేకాకుండా అదనంగా విపత్తు నివారణ నిధుల నుంచి రూ. 8,873 కోట్లు కోవిడ్ నివారణ చర్యల కోసం రాష్ట్రాలకు విడుదల చేసిన విషయాన్ని మోదీ ఎందుకు చెప్పట్లేదు? జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలలోనే చైనా వైరస్ ప్రమాదకరంగా ఉంటోందని రాష్ట్ర ప్రభుత్వాలను అలర్ట్ చేసినా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు మొద్దు నిద్రలో పట్టించుకోకుండా నిర్లక్ష్యంతో వ్యవహరించిన విషయాన్ని మోదీ చెప్పట్లేదు ఎందుకు? ఎందుకంటే ఎవరినో నిందిస్తూ కూర్చుంటే ప్రజల ప్రాణాలు గాల్లో కలుస్తాయి కాబట్టి. రాజకీయాలు చేసే సమయం కాదు కాబట్టి. చైనా వైరస్ వ్యాప్తి నిరోధానికి తీసుకోవలసిన చర్యలపై పలుమార్లు ముఖ్యమంత్రుల సమావేశాలు నిర్వహించినా పలువురు సీఎంలు గైర్హాజరు కావడం లేదా సమావేశంలో చర్చించిన అంశాలపై సీరియస్‌గా తగిన చర్యలు తీసుకోలేని విషయాన్ని మోదీ ప్రజలకెందుకు చెప్పట్లేదు? ఎందుకంటే ఎవరినో నిందిస్తూ కూర్చుంటే ప్రజల ప్రాణాలు గాల్లో కలుస్తాయి కాబట్టి. రాజకీయాలు చేసే సమయం కాదు కాబట్టి. పి.ఎం. కేర్స్ నిధుల నుంచి రాష్ట్రాలకు విరివిగా వెంటిలేటర్లు పంపించినా వాటిని ఉపయోగించకపోగా కనీసం ప్యాకేజి కూడా తీయని విషయాన్ని మోదీ చెప్పట్లేదు. ఎందుకు? ఎందుకంటే ఎవరినో నిందిస్తూ కూర్చుంటే ప్రజల ప్రాణాలు గాల్లో కలుస్తాయి కాబట్టి. రాజకీయాలు చేసే సమయం కాదు కాబట్టి. చైనా వైరస్ వ్యాప్తి నిరోధానికి ఇప్పటికే రూ. 7,000 కోట్లు పి. ఎం. కేర్స్ నిధుల నుంచి కేటాయించిన విషయాన్నిమోదీ చెప్పట్లేదు. ఎందుకు? ఎందుకంటే అది ప్రచార పటాటోపం చేసే అంశం కాదు కాబట్టి. వాక్సిన్ భారత్ లోనే తయారు చేసేలాగా తగిన ఏర్పాట్లు ఎందుకు చేశారో మోదీ చెప్పట్లేదు ఎందుకని? విదేశీ సంస్థలపై ఆధార పడడం మంచిది కాదు కాబట్టి. ఎందుకంటే ఫైజర్ వ్యాక్సిన్‌తో అర్జెంటీనా, బ్రెజిల్‌లు దోపిడీకి గురవుతున్నాయి కాబట్టి. వారు డిమాండ్ చేసినంత రేటు కట్టి ఇవ్వాలి కాబట్టి. దీంతో సామాన్యులకు వాక్సిన్ అందే అవకాశం ఉండదు కాబట్టి. ఇది చెప్పినా కొంతమందికి ముఖ్యంగా కాంగ్రెస్, కమ్యూనిస్టులకు, కొన్ని ప్రతిపక్షాలకు, విదేశీ భక్తులకు నచ్చదు కాబట్టి. విదేశీ సాయం కింద మన దేశానికి అందిన వైద్య పరికరాలు, మందులు, సామాగ్రి కేవలం ఒకటి, రెండు రోజుల్లోనే అత్యవసరంగా అవసరమున్న రాష్ట్రాలకు చెరవేస్తున్న విషయాన్ని మోదీ చెప్పట్లేదు. ఎందుకు? ఎందుకంటే ప్రచారం అక్కర్లేదు కాబట్టి. స్వయంగా ఆక్సిజన్ ప్లాంట్లను నెలకొల్పే అధికారం రాష్ట్రాలకు ఉందనే విషయాన్ని మోదీ ఎందుకు చెప్పట్లేదు? ఎందుకంటే కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి కాబట్టి. కరోనా వైరస్ వ్యాప్తి నివారణలో కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమవుతున్న విషయాన్ని మోదీ చెప్పట్లేదు ఎందుకు? ఎందుకంటే ఇది వారి వైఫల్యాన్ని ఎత్తి చూపే సమయం కాదు కాబట్టి. చైనా వైరస్ వ్యాప్తి నిరోధానికి యుద్ధ ప్రాతిపదికన భారత్‌లో తయారు చేయించిన వాక్సిన్ వాడకం విషయంలో ప్రారంభంలో ప్రజలు అంతగా ముందుకు రాకపోవడంతో కొంత వాక్సిన్ వృధా అయిన విషయాన్ని మోదీ చెప్పట్లేదు ఎందుకు? ఎందుకంటే వాక్సిన్ వాడకం విషయంలో ప్రజలను ఉత్సాహపరచాల్సింది పోయి కొందరు ముఖ్యంగా ప్రతిపక్షాలు, కొన్ని మీడియా సంస్థలు అనవసర భయాలను రేకెత్తించాయి కాబట్టి. ఆ విషయం చెబితే రాజకీయం చేసినట్లు అవుతుందని, ఇది సరైన సమయం కాదు కాబట్టి. దేశంలో వాక్సిన్ కొరత ఉందని విమర్శిస్తున్న వారికి ఇంత తక్కువ సమయంలో ఇన్ని కోట్ల మందికి వాక్సిన్ వేయించిన దేశం ప్రపంచంలో ఒక్క భారత్ మాత్రమేనని, అయితే రాత్రికి రాత్రి కావలసినంత వాక్సిన్ తయారు చేయించలేమని మోదీ చెప్పట్లేదు. ఎందుకు? ఎందుకంటే మంచి పని చేసినా విమర్శించే అలవాటున్న ప్రతిపక్షాలు.. ప్రభుత్వం ఏం చెప్పినా అర్థం చేసుకోవు కాబట్టి. చైనాతో డోక్లామ్ సమస్య పరిష్కారం కోసం కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తున్న సమయంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చైనా అధికారులతో రహస్యంగా సమావేశం కావడాన్ని మోదీ చెప్పలేదు. ఎందుకు? రాహుల్ గాంధీ కుటుంబం గురించి అందరికీ తెలుసు కాబట్టి. ఇలా చెబుతూ పోతే మోదీ ఇంకా చెప్పని ఎన్నో సత్యాలు మరుగున పడిపోతున్నా, ఇంతచేస్తున్నా తమ బాధ్యతలను విస్మరించి కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న పలు రాష్ట్ర ప్రభుత్వాలను, కొందరు ప్రతిపక్ష నాయకులను, తమకు తామే మేధావులమని భుజకీర్తులు తగిలించుకునే ‘సోకాల్డ్ మేధావులను’, ప్రజల్లో పట్టించుకునే వారే లేని కమ్యూనిస్టులను, అవార్డ్ వాపసి బ్యాచ్‌ని, ప్రజలకు వాస్తవాలు చెప్పలేని విదేశీ భక్త జర్నలిస్టులను ఏమనాలో ఇక ప్రజలే నిర్ణయించుకోవాలి. వ్యాసకర్త: శ్యామ్ సుందర్ వరయోగి కో–కన్వీనర్, బీజేపీ రాష్ట్ర ప్రశిక్షణ కమిటీ, హైదరాబాద్, తెలంగాణ -
టీఆర్ఎస్ దూకుడుకు బీజేపీ కళ్లెం
తెలంగాణలో తాను చెప్పిందే వేదం, చేసిందే చట్టం అన్న ట్లుగా వ్యవహరించిన కేసీఆర్ సర్కారుకు ప్రజలు కర్రు కాల్చి వాతలు పెట్టడం దుబ్బాక ఉపఎన్నికతో శ్రీకారం చుట్టి జీహెచ్ఎంసీ ఎన్నికల దాకా కొనసాగిం చారు. గతంలో కేవలం 4 స్థానాలు గెలుచుకున్న బీజేపీ ఇప్పుడు ఒంటరిగా పోటీచేసి 48 స్థానాలను సాధించేలా ఎలా బలపడ గలిగింది? గతంలో 99 సీట్లు సాధించి తిరుగే లేదని పించుకున్న టీఆర్ఎస్ 55 స్థానాలకే ఎందుకు చతికిల పడింది? రథసారథిగా పగ్గాలు చేపట్టిన క్షణం నుంచి బండి సంజయ్ తనకు లభించిన ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోకుండా పార్టీలో అందరినీ కలుపుకొని బీజేపీ ‘బండి’ని విజయతీరాలకు చేర్చారు. ఏ ప్రజలైతే ఎన్నుకున్నారో వారినే నిర్లక్ష్యం చేయడం, కష్టాల్లో ఉన్నా పలకరించి ధైర్యం చెప్పక పోగా ఒక బాధ్యత గల మంత్రి వర్షం పడితే నీళ్లు రాక మరేం వస్తాయని వ్యంగ్యంగా మాట్లాడటంతో ప్రజలు ఎన్నికలు వస్తే ఫలితాలు ఇలా రాక ఇంకెలా వస్తాయని నిరూపించారు. ఇంటర్ పరీక్షల ఫలితాల వెల్లడిలో తప్పులు దొర్లినప్పుడు విద్యార్థులు ఆత్మహత్యలు చేసు కున్నా కనీసం ఆ కుటుంబీకులను పరామర్శించక పోవడం, నిర్బంధంగా రైతుల చేత తాము చెప్పిన పంటలనే పండించాలని ఆదేశించడం లాంటి అంశా లను ప్రజలు సహించలేకపోయారు. ఏ నిధులు, నీళ్లు, నియామకాలు అని చెప్పి కేసీఆర్ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం చేయించారో వాటినే గాలికి వదిలేసి అంద రికీ ఉద్యోగాలివ్వడం ఏ ప్రభుత్వానికైనా సాధ్యమా అని అసెంబ్లీ సాక్షిగా మాట్లాడేముందు అంతమంది యువకుల ప్రాణాలు ఉద్యోగాల పేరుతో ఎందుకు తీశారో సమాధానమివ్వాల్సిన అవసరముంది. దళి తుడిని సీఎంగా చేస్తానని చెప్పి.. చేయకున్నా, వారికి ఇస్తానన్న మూడు ఎకరాల భూమి ఎటు పోయింది? ప్రజల మనోభావాలను అర్థం చేసుకొని పాలించాలి తప్ప ఇష్టారీతిన పరిపాలిస్తాం, తప్పులను మాత్రం కేంద్రం మీదికి తోసేస్తాం అంటే ఎలా? సరిగ్గా ఇలాంటి విధానాలనే అనుసరించిన కాంగ్రెస్ పరిస్థితి ఇప్పుడు ఎలావుంది? రోజురోజుకు రాజకీయ రణక్షేత్రం నుంచి నిష్క్రమిస్తోంది. సమీప కాలంలో తమిళనాడు, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్ని కలు ఉన్నాయని రైతుల ఉద్యమాన్ని కొనసాగిస్తోంది. గతంలో కూడా ఇలాగే గుజరాత్ ఎన్నికల సందర్భంగా పటేళ్ల ఉద్యమం, ఉత్తరప్రదేశ్ ఉపఎన్నికల ముందు అత్యాచార ఘటనను ఆసరాగా చేసుకోవాలని మరో ఉద్యమం చేయాలని చూసి విఫలమైంది. కాంగ్రెస్‌కు తోడు కమ్యూనిస్టులు జమయ్యారు. రేపో మాపో వారి చేతిలో ఉన్న కేరళ కూడా జారిపోయే పరిస్థితి ఉంది. ఇటీవల స్వయంగా ముఖ్యమంత్రి కార్యాలయమే గోల్డ్ స్కామ్‌కు కేంద్రం కావడం కమ్యూనిస్టులు కూడా అవినీతిపరులేనా అనే సందేహాలకు తావిచ్చింది. దీనికి భిన్నంగా ఇటీవల బిహార్‌తోపాటు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఉపఎన్నికల్లో, దుబ్బాక ప్రజలతో సహా అందరూ బీజేపీకి పట్టం కట్టిన విషయమే ఆ పార్టీ పాలన గురించి తెలియజేస్తోంది. ప్రజాభిప్రాయానికి అనుగుణంగా పరిపాలిస్తే పార్టీ ఏదైనా ప్రజలు ఆదరిస్తారనడానికి మరో ఉదాహరణ అవసరం లేదు. మరి టీఆర్ఎస్ కూడా కాంగ్రెస్, కమ్యూనిస్టుల మాదిరిగా ఆలోచించి అతితొందరగా ప్రజలకు దూరమై అధికార పగ్గాలను బీజేపీకి అప్ప గిస్తామనుకుంటే ప్రజలకు సంతోషదాయకమే. దుబ్బాక ఎన్నికలకు ముందు కేటీఆర్ శాంతి భద్రతలకు బీజేపీ విఘాతం కలిగించే అవకాశముం దనీ, పైపెచ్చు ఆ సమాచారం బీజేపీ క్యాంప్ నుంచే వచ్చిందనీ ప్రకటించి అభాసుపాలయ్యారు. మళ్ళీ సీఎం కేసీఆర్ ఇలాగే ప్రకటించి ప్రజలను భయాం దోళనలకు గురిచేశారు. బీజేపీ మీద మతతత్వ పార్టీ అని ముద్రవేసేందుకు ప్రయత్నించారు. తెలంగాణ ద్రోహులను చేరదీసి, మజ్లిస్ పార్టీతో దోస్తీ కోసం వారిని సంతృప్తిపరచడం కోసం నిజాం పాలనను మెచ్చుకుంటే ప్రజలు సహించే స్థితిలో లేరు. నిజామా బాద్‌లో కవిత, దుబ్బాకలో హరీశ్‌రావు, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కేటీఆర్ దూకుడుకు పగ్గం వేసినట్లుగానే 2023లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు బీజేపీని అధికారంలోకి తేవడం ఖాయం. -శ్యామ్ సుందర్ వరయోగి వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ మొబైల్: 98669 66904 -
కరోనా కట్టడిలో ఉదాసీనత
‘తుమ్మితే ఊడే ముక్కు’ అన్న సామెతను మార్చి, ‘తుమ్మితే పోయే ప్రాణం’ అన్న చందంగా మారింది తెలంగాణ పరిస్థితి. ఎవరికి కరోనా ఉందో, ఎవరికి లేదో అర్థం కాని దుస్థితి. ఎవరికైనా కరోనా పాజిటివ్ ఉన్నట్లు తేలినా, వారిని వెంటనే ఆసుపత్రిలో ఉంచి చికిత్స అందించ కుండా హోమ్ క్వారంటైన్ పేరుతో ఇంటికి పంపిం చేసి మరింత మందికి కరోనా సోకేలా చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించడంతో పాటు అనుమానితులందరికి కరోనా పరీక్షలు జర పకపోవడం కూడా నేటి ఈ దుస్థితికి కారణమని తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ నిర్లక్ష్య ధోరణిని ఎత్తిచూపిన ప్రతిపక్షాలు, నాయకులపై ప్రభుత్వ పెద్దల ఎదురుదాడి శోచనీయం. ఐ.సి.ఎం.ఆర్. నిబంధనల ప్రకారమే నడుచు కుంటున్నామని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ చెబుతున్నారు. ఉత్తరప్రదేశ్, మధ్య ప్రదేశ్, కర్ణాటకతోపాటు పలు రాష్ట్రాల్లో లక్షలాది మందికి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారంటే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఐ.సి.ఎం.ఆర్. నిబంధనలను ఉల్లంఘిస్తున్నట్లా? ఆ ప్రభుత్వాలు అంత జాగ్ర త్తగా ఉంటున్నా కరోనా విజృంభిస్తుండగా పరీక్షలు అంతగా చేయకుండానే తెలంగాణలో కరోనాను కట్టడి ఎలా చేయాలనుకుంటున్నారో టీఆర్ఎస్ ప్రభుత్వానికే తెలియాలి. దేశంలో అతి తక్కువ పరీక్షలు చేసిన రాష్ట్రం తెలంగాణ కావడం బాధా కరం. ఒకవైపు ప్రజలంతా కరోనా భయంతో అల్లా డుతుంటే, సచివాలయాన్ని కూల్చి కొత్తది కట్టాలని కేసీఆర్ ఉబలాటపడడం ‘రోమ్ నగరం తగలబడు తుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయిస్తూ కూర్చు న్నట్లు’గా ఉంది. ఇంత భయానకమైన పరిస్థితి నెలకొంది కాబట్టే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి. కిషన్ రెడ్డి ఇటీవల హైద్రాబాద్‌లో జరిగిన వర్చువల్ ర్యాలీలో మాట్లాడుతూ, ‘హైదరాబాద్ ఎప్పుడైనా పేలి పోవచ్చు’ అని తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులను దృష్టిలో ఉంచుకొనే కేంద్ర ప్రభుత్వం కోటిమంది ఆడపడుచుల జన్‌ధన్ ఖాతాల్లో రూ. 521 కోట్లు జమ చేసిందన్నారు. పట్టణ ప్రాంతాల్లో ఉన్న భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం రూ. 127 కోట్లు, వృద్ధులు, విక లాంగులు, వితంతువులయిన సుమారు 7 లక్షల మంది ఖాతాల్లో రూ. 166 కోట్లు, ఉద్యోగుల కోసం పి.ఎఫ్. ఖాతాలో రూ. 470 కోట్లు, డిజాస్టర్ మేనేజ్ మెంట్ కింద వలస కార్మికుల రైల్వే ప్రయాణం, భోజనం, ఇతర సౌక ర్యాల కోసం రూ. 224 కోట్లు, కోవిడ్ అసిస్టెన్స్ కింద రూ. 217 కోట్లు హెల్త్ డిపా ర్ట్మెంట్ ద్వారా రిక్రూట్మెంట్ ఇతర సౌకర్యాల కల్పనకు మంజూరు చేసిందని ఆయన వివరిం చారు. వైద్య సిబ్బంది రక్షణ కోసం సుమారు 6 లక్షల 20 వేల ఎన్–95 మాస్కులు, డాక్టర్ల కోసం సుమారు రెండున్నర లక్షల పి.పి.ఇ. కిట్లు, ఇంకా పలు రకాలుగా కేంద్రం సహాయసహకారాలు అందిస్తుందన్నారు. కేంద్రం ఇంత చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంతో ప్రజల ప్రాణాలు గాలిలో దీపాలుగా మారాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇళ్ల యజమానులు అద్దెల విషయంలో ఎవ రిపై ఒత్తిడి చేయరాదని నీతులు చెప్పిన ప్రభుత్వం, ఆదాయం లేక నానాఅవస్థలు పడుతున్న పేదలు, మధ్య తరగతి ప్రజల నుంచి 3 నెలల బిల్లుల వసూ లుకు పూనుకోవడంపై తీవ్ర ఆవేదన వ్యక్తమవు తోంది. రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీతో పాటు ముగ్గురు ఎంఎల్ఏలు సైతం కరోనా బారిన పడటం రాష్ట్రంలోని దయనీయ పరిస్థితికి అద్దం పడుతోంది. చివరికి ప్రజలు, ప్రతిపక్షాల ఒత్తిడికి తలొగ్గిన ప్రభుత్వం ‘చేతులు కాలాక ఆకులు పట్టిన’ చందంగా కొన్ని ప్రైవేట్ ల్యాబ్‌ల్లో పరీక్ష లకు, కొన్ని ఆసుపత్రుల్లో చికిత్సకు అనుమతులి చ్చింది. దీన్ని ఆసరాగా తీసుకున్న కొన్ని ఆసుప త్రులు, ల్యాబ్‌ల యజమానులు స్వార్థంతో డబ్బుల సంపాదనే ధ్యేయంగా శవాలపై పేలాలు ఏరుకున్నట్లుగా వ్యవహరిస్తున్నారని బాధితులు విమర్శిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. ప్రతివిషయంలో ఎదురుదాడి సరైన విధానం అని పించుకోదు. ప్రజలు చైతన్యవంతులయ్యారు. ప్రతి క్షణం ఏం జరుగుతున్నదో మీడియా, సోషల్ మీడియా ద్వారా తెలుసుకుంటున్నారు. తమ నిర్ల క్ష్యాన్ని కప్పిపుచ్చుకునే పరిస్థితి లేదు. తమ తప్పు లకి కేంద్రం లేదా ఇతర ప్రతిపక్షాలపైకి తోసేయా లనుకోవడం భావ్యం కాదు. ప్రాజెక్టుల కంటే ప్రజల ప్రాణాల రక్షణకే రాష్ట్ర ప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యమిస్తుందని ఆశిద్దాం. వ్యాసకర్త శ్యామ్ సుందర్ వరయోగి కో–కన్వీనర్, బీజేపీ రాష్ట్ర ప్రశిక్షణ కమిటీ, ఫౌండర్, మేనేజింగ్ ట్రస్టీ, రాఘవ్స్ ఫౌండేషన్, హైదరాబాద్ -
తప్పిన పెను ప్రమాదం
భువనగిరిఅర్బన్ : యాదాద్రి భువనగిరి జిల్లా బీజేపీ అధ్యక్షుడు పీవీ శ్యాంసుందర్‌రావు రోడ్డు ప్రమాదం నుంచి బయటపడ్డారు. మంగళవారం మధ్యాహ్నం భువనగిరి– వలిగొండ మార్గంలో నందనం వద్ద ఆయన వెళ్తున్న కారును మరో కారు ఢీకొట్టడంతో మూడు ఫల్టీలు కొట్టింది. కారు బోల్తా పడటంతో ప్రమాదం నుంచి శ్యాంసుందర్‌రావు క్షేమంగా బయటపడగా, ఆయన కారు డ్రైవర్ నానికి బలమైన దెబ్బలు తగిలాయి. వివరాల్లోకి వెళితే స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పీవీ శ్యాంసుందర్‌రావు వలిగొండలో జరిగే శ్రీ రేణుక ఎల్లమ్మతల్లి కల్యాణానికి హాజరయ్యేందుకు తన కారులో వెళ్తున్నాడు. ఈ క్రమంలో నందనం గ్రామంలో ఉన్న కాటమయ్య ఆలయం వద్ద ఉన్న మూలమలుపు వద్దకు చేరుకోగానే వలిగొండ నుంచి భువనగిరి వైపు వస్తున్న స్వీఫ్ట్ డిజైర్ కారు అతివేగంగా వచ్చి ఢీకొట్టింది. దీంతో కారు మూడు çఫల్టీలు కొట్టుకుంటు వెళ్లి రోడ్డు పక్కన వెళ్తున్న బైక్‌ను ఢీకొట్టింది. ప్రమాదానికి గురికాగానే గాలిబెలూన్లు తెరుచుకోవడంతో ఎలాంటి ప్రమాదానికి గురికాకుండా బయటపడ్డారు. కారులో ఉన్న శ్యాంసుందర్‌రావు, కారు డ్రైవర్ ఇద్దరు కారు లోపలి నుంచి బయటకు వచ్చారు. కారు డ్రైవర్‌కు గాయాలయ్యాయి.కాగా ప్రమాదం జరిగిన సమయంలో ఎదురుగా వస్తున్న బైక్ కారు కిందికి దూసుకుపోయింది. బైక్ పై వెళ్తున్న నరాల జంగయ్య, బి. వేదేశ్వర్ చాకచక్యంగా బైక్‌ను వదిలి కిందకు దూకడంతో వారు పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. బైక్ రాకపోతే కారు బావిలో పడేదా ? ఈ రోడ్డు ప్రమాదంలో శ్యాంసుందర్‌రావు కారు కిందకు నరాల జంగయ్య బైకు వెళ్లక పోతే ఆ కారు అలాగే ఫల్టీలు కోట్టుకుంటూ పక్కనే ఉన్న బావిలో పడేదని స్థానికులు చెబుతున్నారు. ఆసమయంలో బైకు కారు కిందికి రావడంతో పెను ప్రమాదం తప్పిందని పేర్కొన్నారు. కారు మీద ఉన్న ఇద్దరు కిందికి దూకి ప్రాణాలు దక్కించుకున్నారు. అదే సమయంలో వారి బైక్ కారు కిందికి దూసుకుపోవడంతో అక్కడే ఆగిపోయింది. రోడ్డు పక్కన గల వ్యవయాసాయ బావిలో కారు పడిపోకుండా ఆగిపోవడంతో రెండు నిండు ప్రాణాలు నిలిచిపోయాయి. గాయపడ్డ శ్యాంసుందర్‌రావును, డ్రైవర్‌ను ప్రాథమికి చికిత్స కోసం భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం విషయం తెలియగానే బీజేపీ కార్యకర్తలు, నాయకులు, శ్యాంసుందర్ అభిమానులు పెద్ద ఎత్తున ఏరియా ఆస్పత్రికి తరలి వచ్చారు. ఆయన యోగ క్షేమాలు తెలుసుకున్నారు. ప్రమాదం నుంచి బయటపడడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. మెరుగైన చికిత్స నిమిత్తం డ్రైవర్‌ను సికింద్రాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నర్ల నర్సింగ్‌రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తునట్లు భువనగిరి రూరల్ పోలీసులు తెలిపారు. -
ఎస్పీ బదిలీ వెనుక
సాక్షి ప్రతినిధి, అనంతపురం : ‘ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చినట్లు’ తయారైంది ఎస్పీ శ్యాంసుందర్ పరిస్థితి! సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, మాజీ డీజీపీ దినేష్‌రెడ్డి మధ్య సాగిన మాటల యుద్ధం ఎస్పీపై బదిలీ వేటు పడేలా చేసిందనే అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది. దినేష్‌రెడ్డి సీఎం కిరణ్‌పై ఆరోపణలు చేసిన 20 రోజుల్లోగానే ఎస్పీని బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడటం ఇందుకు బలం చేకూర్చుతోంది. పంచాయతీ ఎన్నికల షెడ్యూలు వెలువడటానికి సరిగ్గా ఒక్క రోజు ముందు.. అంటే జూలై 2న అప్పటి ఎస్పీ షహనవాజ్ ఖాసీంను ప్రభుత్వం బదిలీ చేసింది. విధి నిర్వహణలో నిక్కచ్చిగా వ్యవహరించే ఖాసీం ఉంటే పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీ ఆటలు సాగవనే ఉద్దేశంతోనే ఆయన్ను బదిలీ చేసింది. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడం వల్ల కొత్త ఎస్పీని నియమించే అవకాశాలు లేవని, కిందిస్థాయి అధికారులను గుప్పిట్లో పెట్టుకుని యథేచ్ఛగా అధికార దుర్వినియోగానికి పాల్పడి.. దొడ్డిదారిన ఎన్నికల్లో విజయం సాధించవచ్చునని అధికార పార్టీ నేతలు ఎత్తులు వేశారు. అయితే.. రాష్ట్ర ఎన్నికల సంఘం జోక్యం చేసుకుని హైదరాబాద్ ట్రాఫిక్ విభాగంలో డీసీపీ-2గా పనిచేస్తోన్న ఎస్.శ్యాంసుందర్‌ను జిల్లా ఎస్పీగా నియమించాలని సర్కారుకు సూచించింది. ఆ మేరకు శ్యాంసుందర్‌ను జిల్లా ఎస్పీగా నియమిస్తూ జూలై 11న సర్కారు ఉత్తర్వులు జారీచేసింది. జూలై 12న ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన ఆయన.. పలు సందర్భాల్లో తనను కలిసిన మీడియా ప్రతినిధులతో పంచాయతీ ఎన్నికల కోడ్ ముగియగానే తనను బదిలీ చేస్తారని బాహటంగానే చెబుతూ వచ్చారు. అయితే.. తెలంగాణ ఏర్పాటుకు సీడబ్ల్యూసీ, యూపీఏ పక్షాలు నిర్ణయం తీసుకోవడంతో ‘అనంత’లో సమైక్యాంధ్ర ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడింది. దీన్ని నీరుగార్చేందుకు ఎస్పీ శ్యాంసుందర్ శతవిధాలా ప్రయత్నించారు. ఉద్యమకారులపై విచక్షణారహితంగా లాఠీలు ఝుళిపించారు. శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో రౌడీలు, ఫ్యాక్షనిస్టులు తిష్ట వేశారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఎస్పీ తీరుపై సమైక్యవాదులు విరుచుకుపడ్డారు. ఆయన ఎక్కడికెళ్లినా అడ్డుతగిలారు. ఉద్యమవేడి తగ్గేదాకా ఎస్పీ అడుగు బయట పెట్టలేని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే శ్యాంసుందర్‌పై బదిలీ వేటు పడుతుందనే అభిప్రాయం అప్పట్లోనే పోలీసు వర్గాల్లో బలంగా వ్యక్తమైంది. అయితే.. అప్పట్లో బదిలీ ఉత్తర్వులు వెలువడలేదు. డీజీపీ దినేష్‌రెడ్డి సెప్టెంబరు 30న ఉద్యోగ విరమణ చేసిన విషయం విదితమే. పదవీకాలాన్ని పొడిగించుకునేందుకు ఆయన తీవ్రప్రయత్నాలు చేశారు. అవి ఫలించలేదు. ఈ క్రమంలో ఈ నెల 8న సీఎం కిరణ్‌ను లక్ష్యంగా చేసుకుని తీవ్ర ఆరోపణలు గుప్పించారు.‘అనంతపురం జిల్లా ఎస్పీ శ్యాంసుందర్‌ను బదిలీ చేయాలని సీఎం నాపై ఒత్తిడి తెచ్చారు. శ్యాంసుందర్‌ను నిజామాబాద్ ఎస్పీగా నియమించడం ద్వారా సీఎం రాజకీయ ప్రత్యర్థి అయిన డి.శ్రీనివాస్‌కు చెక్ పెట్టాలన్నది ఆయన ఉద్దేశం. కానీ.. నేను ఆ ఒత్తిళ్లకు తలొగ్గలేదు. అందుకే డీజీపీగా నా పదవీకాలాన్ని సీఎం పొడిగించలేదు’ అంటూ దినేష్‌రెడ్డి ఆరోపించారు. ఇవి అప్పట్లో సంచలనం రేపాయి. ఈ నేపథ్యంలోనే ఎస్పీ శ్యాంసుందర్‌పై బదిలీ వేటుకు సీఎం కిరణ్ సిద్ధమయ్యారు. దినేష్‌రెడ్డి ఆరోపణలు చేసిన 20 రోజుల్లోగానే శ్యాంసుందర్‌పై బదిలీ వేటు వేయించారు. ఈ మేరకు ఆదివారం ఉత్తర్వులు వెలువడ్డాయి. గతంలో పనిచేసిన హైదరాబాద్ ట్రాఫిక్ విభాగం డీసీపీ-2 పోస్టుకే శ్యాంసుందర్‌ను బదిలీ చేయడం గమనార్హం. శ్యాంసుందర్ ఎక్కడ పనిచేసినా వివాదాస్పదంగా మారడం.. ఆ తర్వాత బదిలీ కావడం రివాజుగా మారింది. గుంటూరు, వరంగల్జిల్లాల్లో పనిచేసినప్పుడూ ఇదే రీతిలో బదిలీవేటు పడింది. ముచ్చటగా మూడోసారి కూడా వివాదాస్పదం కావడంతో బదిలీ వేటు పడినట్లు పోలీసు వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. -
ముఖ్యమంత్రి హామీలను నమ్మేది లేదు: మెడికల్ జేఏసీ
సమైక్యాంధ్ర కోసం ఉధృతంగా జరుగుతున్న ఉద్యమాన్ని నీరుగార్చేందుకు రాజకీయక కుట్ర జరుగుతోందని ప్రభుత్వ వైద్యుల సంఘం నేత శ్యాంసుందర్ ఆరోపించారు. ఉద్యోగ సంఘాల సమ్మె విరమణ ఆ వ్యూహంలో భాగమేనని, తాము మాత్రం సమ్మెను ఉధృతం చేయడానికి తమ పోరాటం కొనసాగిస్తామని ఆయన తెలిపారు. మొదట్నుంచి రాజకీయాలకు అతీతంగా మెడికల్ జేఏసీ ఉద్యమాలు కొనసాగిస్తోందని, ఈ రోజు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీల మేరకు కొంతమంది సమ్మెలు విరమించామంటున్నారు గానీ తాము మాత్రం ఆ హామీలను నమ్మేది లేదని స్పష్టం చేశారు. విభజనను విరమణకు సానుకూలంగా ఒక ప్రకటన కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే వరకు సమ్మె విరమించబోమని తెలిపారు. సీమాంధ్రలోని 13 జిల్లాల్లో ఉన్న పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, బోధనాస్పత్రులు, ఏరియా ఆస్పత్రులలో ఓపీ, ఆపరేషన్లు బహిష్కరిస్తామని డాక్టర్ శ్యాంసుందర్ తెలిపారు.